పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము
మార్కండేయుఁడు ధర్మరాజునకు బ్రాహ్మణప్రభావంబు సెప్పుట (సం. 3-182-1)
వ. అనిన విని ధర్మనందనుండు ‘బ్రాహ్మణప్రభావంబు వినవలతుం జెప్పవే’ యనిన మార్కండేయుం డిట్లని చెప్పెఁ; దొల్లి హైహయవంశోద్భవుండైన ధుంధుమారుండను కుమారుండు మృగయాసక్తుండై వనంబునఁ గ్రుమ్మరువాఁ డొక్కయెడం దృణలతాగుల్మమధ్యంబునం గృష్ణాజినోత్తరీయుం డై యున్నవాని నొకవిప్రు దవ్వులం గని మృగం బను బుద్ధిం జేసి యేసి, డాయంజని, నిశ్చేతనుండైన యతనిం జూచి యత్యంతదుఃఖితుండయి పురంబునకుం బోయి నిజవంశవృద్ధులైన హైహయుల కంత వృత్తాంతంబునుం జెప్పి, వారిం దోడ్కొని వచ్చి యవ్విప్రకళేబరంబు సూపిన. 181
తే. వార లందఱు వందురి వగచి యచటి | కతిసమీపంబునను దార్‌క్ష్యుఁడను మునీంద్రు
నాశ్రమం బున్న నయ్యెడ కరిగి కనిరి | దేవమునిసిద్ధలోకప్రతీక్ష్యుఁ దార్‌క్ష్యు.
182
క. కని భక్తి మ్రొక్కుటయు, న | య్యనఘుఁడు దీవించి వారి కర్హమ్మగు పూ
జనము లొనరింపఁ బంచెం | దన శిష్యులఁ బరమసంశితవ్రతుఁడు దయన్‌.
183
వ. హైహయులు నమ్మునీంద్రునకు సాష్టాంగదండప్రణామంబుసేసి ‘మహాత్మా! యిక్కుమారుండు మృగయాసక్తుం డై వచ్చి యింతకుమున్న యివ్వనంబున నొక్కబ్రాహ్మణుం గృష్ణాజినసంవృతు నతిశాంతుం బాపంబునం జేసి మృగం బను బుద్ధి నేసిన నతండు మృతుం డయ్యె; నేము మహాపాతకదూషితుల మైతిమి గావున మీ చేయు సత్కారంబుల కర్హులము గా; మిప్పాపంబున కెయ్యది నిష్కృతి?’ యనిన నవ్వుచుఁ దార్‌క్ష్యుం డి ట్లనియె. 184
క. ‘వినుఁ డెన్నఁడు మా యాశ్రమ | మున నెవ్వారలకు లేవు భూరిభయవ్యా
ధినిరోధమృత్యుదోషా | ద్యనేకదుఃఖములు త్రిజగదాశ్చర్యముగన్‌.
185
వ. అని పలికి తనపుత్త్రు నధికతపోబలసమన్వితుం జూపి. 186
క. ‘ఈతఁ డగునె మీ బాలకు | చేత నిహతుఁ డైనఁవాడు సెప్పుఁ’ డనుడు వా
రాతఁడ తమ మును చూచిన | యాతం డగుటకు మహాద్భుతాత్మకు లగుచున్‌.
187
క. ‘మృతుఁ డయి క్రమ్మఱ సం | జీవితుఁ డయ్యె నితండు; కరము విస్మయ మిది భూ
నుత! యిట్టి మహిమ కలిమికిఁ | గత మెయ్యది? యానతిమ్ము కారుణ్యమునన్‌.
188
వ. అని యడిగినఁ దార్‌క్ష్యుం డిట్లనియె. 189
శా. ఆలస్యం బొక యింత లేదు, శుచి యాహారంబు, నిత్యక్రియా
జాలం బేమఱ, మర్చనీయు లతిథుల్‌, సత్యంబ పల్కంబడున్‌,
మేలై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిం దాల్తు; మట్లౌట నె
క్కాలంబుం బటురోగమృత్యుభయశంకం బొంద మే మెన్నఁడున్‌.
190
వ. ఇది యస్మదీయ ప్రభావంబు; మీకుఁ బాతకభయంబువలవ; దరుగుం’ డనినం దార్‌క్ష్యు వీడ్కొని హైహయులు నిజనివాసంబులకుం జనిరి; భరతవంశోత్తమ! యిట్టిది బ్రాహ్మణప్రభావం’ బని మఱియు మార్కండేయుండు ‘బ్రహ్మక్షత్త్రస్వరూపనిదర్శనం బయిన యొక్కయితిహాసంబు సెప్పెద విను’ మని ధర్మరాజున కిట్లనియె. 191
చ. వినుతచరిత్రుఁ డత్రి యను విప్రవరుండు తపం బొనర్పఁ గా
ననమున కేఁగుచుండి తన నాతిఁ గనుంగొని యిట్లనుం ‘దపం
బున కిదె యేను బూని వనభూమికిఁ బోవుచు నున్నవాఁడ, నో
వనరుహనేత్ర! నీవు నట వచ్చెదొ పుత్త్రులయొద్ద నుండెదో.’
192
చ. అనుటయు భార్య యిట్లనియె ‘నక్కట! పుత్త్రులకుం గుటుంబభా
ర నియమవృత్తు లెల్లను దిరంబుగఁ జేయక యాశ్రమాంతరం
బునకు మహాత్మ! నీకు నిటు వోవుట ధర్మువు గాదు; వైన్యభూ
జనపతి యిచ్చు నర్థులకుఁ జాలఁగ; నర్థము వేఁడు మవ్విభున్‌.’
193
వ. అనినం గొండొక విచారించి భార్యపలుకులు ధర్మయుక్తంబు లగుటకు సంతసిల్లి, యమ్మహాద్విజుం డప్పుడు చని యశ్వమేధాధ్వరదీక్షితుండయి, విప్రులకు నపారధనంబు లిచ్చుచున్న వైన్యుం గని యాశీర్వాద పురస్సరంబుగా ని ట్లనియె. 194
ఉ. ‘నీవ విధాత, వింద్రుఁడవు నీవ, సమస్తజనేశ్వరుండవున్‌
నీవ, యశేషధర్మములు నీవ యెఱుంగుదు, నిన్నుఁ బోలఁగా
నీ వసుధాతలంబున మహీశ్వరు లెవ్వరు లేరు, సన్మునీం
ద్రావలి యెప్డు నిన్నుఁ గొనియాడుఁ బరిస్ఫుటవాక్యభంగులన్‌.’
195
చ. అని పలుకంగ గౌతమమహాముని యచ్చట నుండి యంతయున్‌
విని, కలుషించి, ‘యేల యిటు వీఁకున నో రఱుగంగఁ బ్రేలె; దీ
జనపతియే విధాతయును శక్రుఁడు నీశుఁడు నర్థకాంక్షి వై
మనమున శంక లేక యొక మానవు నింత నుతింప నేటికిన్‌?’
196
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )