| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | అనుటయు నత్రి యి ట్లనియె. | 197 |
| ఉ. |
‘ఊరక మీఱ నాడెదవు; యుక్త మయుక్తము నాత్మఁ జూడఁగా నేరవు; సర్వలోకములు నిర్మలనీతిపరాక్రమంబు లొ ప్పారఁగ నేలి ధర్మముల కన్నిటికిం గుదురై వెలుంగు ధా త్రీరమణుండు మేటిగ నుతింపఁగ వోలదె నాకు నిమ్మెయిన్?’ |
198 |
| వ. | అని త న్నాక్షేపించిన గౌతముండు. | 199 |
| ఆ. |
‘కలయ నరలు వచ్చి తల తెల్ల నైనంతఁ | జేసి నీకు నెట్లుఁ జేరు నెఱుక? జ్ఞానవృద్ధుఁడైన వాని మాటలు గదా | సభలఁ జెల్లు నార్యజనుల కెక్కి.’ |
200 |
| వ. | అని తొడంగి యయ్యిరువురు మహానాదంబుగా వివాదంబు సేయుచుండఁగాశ్యపనామధేయుం డైన ముని సభాసదులైన మునులం జూచి వీరలవాదు మనచేతఁ జక్కంబడదు; సకలధర్మజ్ఞుం డయిన సనత్కుమారు నడుగుద’ మనిన నా సదస్యులందఱు సనత్కుమారుపాలికిం జని యత్రిగౌతములవివాదంబు తెఱం గెఱింగించిన, నతండు వారల కి ట్లనియె. | 201 |
| ఉ. |
‘అత్రి నిజంబ పల్కెఁ; దగ నాతని వాక్యము ధర్మయుక్త; మీ ధాత్రి సమస్తమున్ బృహదుదగ్రభుజాగ్రమునందుఁ దాల్చు సత్ క్షత్రియుఁ డెల్లవారలను గావను బ్రోవఁ బ్రభుండు; గావునన్ శత్రునిషూదనుం డతఁడు శక్రుఁడు నీశ్వరుఁడున్ విధాతయున్. |
202 |
| క. |
జనులకు నెల్లను బూజ్యుఁడు | జనపాలుం; డతని మహితశాసనమున స జ్జనులును మునులును సద్విధిఁ | జనువారలు గాక; కడవఁ జన దెవ్వరికిన్. |
203 |
| వ. | క్షత్త్రియప్రభావం బే మనవచ్చు! విరాట్టు, సమ్రాట్టు, విధిజితుండు, సత్యమన్యుండు, యథాజీవుండు, ధర్ముండు నను భవ్యనామంబుల నిగమంబులు పార్థివుం గొనియాడుఁ; దొల్లి యధర్మంబునకు వెఱచి బ్రాహ్మణులు నిజతేజోబలంబులు క్షత్త్రియులందు నిక్షేపించిరి; నాఁటంగోలె బ్రాహ్మ్యంబువలన క్షత్త్రంబు ప్రవర్తిల్లుచుండు; బ్రహ్మక్షత్త్రంబులు పరస్పరసంశ్రయంబులు; వెలిగా వర్తింప నేరవు; క్షత్త్రియుండు బ్రాహ్మణ సంసేవనంబునం దేజోనిరూఢుం డయి యాదిత్యుండు చీఁకటి నడంచునట్లు దురితంబుల నడంచు; నట్లగుటంజేసి క్షత్త్రియుండు సర్వాధికుం డగుట నిశ్చయం’ బనిన, నమ్మునులందఱుఁ జని వైన్యునకుఁ దత్ప్రకారం బంతయు నెఱింగించిన నా భూవరుం డత్రిం జూచి. | 204 |
| క. |
‘నను నెల్లజనులకంటెను | ఘనుఁ డని కొనియాడి తీవు కడు నిజముగఁ గా వున నిదె ప్రీతుఁడ నైతిన్ | గొను మిచ్చెద నీకు నేను గోటిధనంబుల్.’ |
205 |
| క. |
అని యిష్టధనము లిచ్చినఁ | గొని వచ్చి మునీశ్వరుండు గొడుకులకుఁ బ్రియం బునఁ బంచి యిచ్చి యిమ్ములఁ | జనియె వనంబునకు ధర్మసంహితబుద్ధిన్. |
206 |
| వ. | అని చెప్పి మార్కండేయుండు పాండవేయునితో నిట్లను; సరస్వతీగీత యను నితిహాసంబు సెప్పెద; నందు విశిష్టధర్మంబు లెఱుఁగ నగుఁ; దొల్లి తార్‌క్ష్యుండను మునివరుండు భారతి నారాధించిన నద్దేవి ప్రత్యక్షం బగుటయు ని ట్లని యడిగె. | 207 |
| క. |
‘పురుషున కెయ్యది ధర్మువు? | పురుషుం డెద్దానఁ బరమపుణ్యాత్మకుఁ డై చిరపుణ్యగతులు వడయును? | దిరముగ నిది యానతిమ్ము దేవీ! నాకున్.’ |
208 |
| వ. | అనిన వానికి నప్పరమేశ్వరి యి ట్లనియె. | 209 |
| మ. |
‘ధృతి వేదంబులు నాలుగుం జదివి భూదేవుండు నానాధ్వర వ్రతుఁ డై యుండెడునట్టిపుణ్యుఁ డమరావాసంబునం దుండు ను న్నతవృత్తస్తనభారమంథర మరున్నారీపరీరంభ సం భృత రోమాంచ సమంచితాంగుఁ డగుచుం బెక్కేండ్లు సంప్రీతితోన్. |
210 |
| సీ. |
మేలగు క్రేపుతోఁ బాలు సాలఁగ గల్గి | లాలితం బగు తొలిచూలు మొదవుఁ బాత్రభూతుం డైన శ్రోత్రియునకు నిచ్చు | సదమలచరితుఁ డమ్మొదవు మేన నెన్నిరోమము లుండు నన్ని వేలేఁడులు | సురలోకసౌఖ్యవిస్ఫురణ నొందు; భారంబునకుఁ జాలి భూరిసత్త్వాఢ్య మై | బిరుదైన యెద్దు భూసురున కిచ్చి |
|
| ఆ. |
నరుఁడు ధేనుదశక మిరవొంద నిచ్చిన | ఫలము వడయు; మఱియు వలువ లొసఁగి చంద్రలోకమునకు సంప్రీతుఁడై చనుఁ; | గనక మిచ్చి నాకమునకు నరుగు. |
211 |
| క. |
కృతమతి యై యేడేఁడులు | హుతవహు ఘృతమునను బ్రీతి నొందించిన సు వ్రతుఁ డీరేడుతరంబుల | పితరులఁ గొని దివికి నేఁగుఁ బెంపెసలారన్. |
212 |
| క. |
సతతంబును శుచియై దే | వతలఁ బ్రదీప్తాగ్నియందు వదలక సంత ర్పితులుఁగఁ జేసి పడయు నం | చితముగ గోలోకవాస చిరసౌఖ్యంబుల్. |
213 |
| వ. | అగ్నిహోత్రం బస్మదాత్మకం బని యెఱుంగుము; సకలయజ్ఞంబులందుఁ గల్గింపఁ బడు విశిష్టద్రవ్యంబు లన్నియు మదీయంబు; లేను మహనీయం బైన యగ్నిహోత్రముఖంబునం బ్రభవింతు; నాత్మజ్ఞు లగు మహాత్ములకు నఖిలసంశయచ్ఛేదంబు సేయుదు; ననవరత స్వాధ్యాయ దానవ్రత పరాయణులైన తపోధను లెందేని వీతశోకులై వసియింతు; రట్టిది మామకంబైన పరమపదంబు; వినుము! ప్రచుర మధుక్షీరతోయంబులును శర్కరాసైకతంబులును మాంసాపూపప్రకరతీరంబులును బాయసకర్దమంబులు నైన యేఱు లనేకంబు లుత్పాదించి యింద్రాగ్ని ప్రముఖు లైన దివిజులకుఁ దృప్తి సేసి యజనశీలురు మత్పదంబుం బ్రాపింతు’ రని చెప్పినఁ దార్‌క్ష్యుండు కృతాంజలియై. | 214 |
| ఉ. |
అంబ! నవాంబుజోజ్జ్వలకరాంబుజ | శారదచంద్రచంద్రికా డంబరచారుమూర్తి! ప్రకట స్ఫుట భూషణ రత్న రోచిరా చుంబితదిగ్విభాగ! శ్రుతిసూక్తవివిక్తనిజప్రభావ! భా వాంబరవీథివిశ్రుతవిహారి! ననుం గృపఁ జూడు భారతీ! |
215 |
| వ. | అని వినుతించి కృతార్థుం డయ్యె’ ననిన విని మృకండుపుత్త్రునకుఁ బాండుపుత్త్రుం డి ట్లనియె ‘మునీంద్రా! వైవస్వతమను వెత్తెఱంగునం బ్రభావసంపన్నుం డయ్యెఁ జెప్పవే’ యనిన మార్కండేయుం డి ట్లనియె. | 216 |
| క. |
‘విను చాక్షుషమన్వంతర | మున వైవస్వతుఁడు పరమపుణ్యుండు దపం బొనరించె నిరాహారత | ననుపమధైర్యుండు దశసహస్రాబ్దంబుల్. |
217 |
| ఆ. |
అనఘుఁ డూర్థ్వబాహుఁ డై యేకపాదంబు | నందు నిలిచి బదరికాశ్రమమునఁ జలిపె మఱియుఁ బెక్కుసంవత్సరంబులు | తపము సకలజనులుఁ దను నుతింప. |
218 |