| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము |
| చ. |
ఘనుఁడు పరిక్షితుం డనఁ బ్రకాశితుఁ డైన మహీవిభుండు భా నునిభుఁడు భానువంశ్యుఁడు వినూతనకీర్తి యయోధ్య యేలువాఁ డనుపముఁ డొక్కనాఁడు మృగయారతుఁడై చరియించెఁ గానన మ్మున నొకరుండ యిమ్ముల నపూర్వజవోగ్రహయాధిరూఢుఁడై. |
318 |
| వ. | ఇవ్విధంబునం బెక్కుమృగంబుల వధియించుచుఁ గ్రుమ్మరువాఁ డొక్కయెడ. | 319 |
| ఆ. |
మదగజాభిరామ మృదులయానం బొప్ప | నల్లఁ బొలయుచును లతాంతరములఁ గరములీలఁ గమ్మవిరులు గోయుచునున్న | పువ్వుఁబోఁడి నొక్క పొలఁతిఁ గనియె. |
320 |
| క. |
కని యంతఁ గదిసి యా కా | మిని యొప్పులఁ జూడ్కి దగుల మీఱిన తమకం బున ననిమిషలోచనుఁ డై | జననాథుఁడు మదనబాణసంహతిఁ దూలెన్. |
321 |
| వ. | అదియును నతిసుందరం బైన తదీయమూర్తివిభవంబునకు మెచ్చి సాభిప్రాయంబుగా నవలోకించె; నంత నమ్మహీకాంతుం డక్కాంత కి ట్లనియె. | 322 |
| ఉ. |
‘ఎవ్వరి దాన వంబుజదళేక్షణ! యేకత మిట్టు లేల నీ వివ్వనభూమియందుఁ జరియించెదు?’ నావుడుఁ ‘దండ్రిపంపునం దివ్వనభూమియందుఁ జరియించెద సద్వరుఁ గోరి; కన్య; నే నెవ్వరిదానఁ గావలయు నేర్పడఁ జెప్పుము రాజనందనా!’ |
323 |
| వ. | అనిన దానిప్రగల్భవచనంబులకు నధికవిలోలుం డై భూపాలుండు దనయభిలాషం బెఱింగించిన నమ్మగువ ‘నన్నెన్నండును జలవిహారంబునకుఁ జొనుపకుండు నది; యట్లయిన నిన్ను వరియించెద’ ననిన వాఁడును దత్సమయంబున కొడంబడి దానిం దోడ్కొని పురంబునకుఁ జనుదెంచి యిష్టసుఖతత్పరుం డయి యుండె; నంత నొక్క శరత్సమయంబునందు. | 324 |
| చ. |
అతులితపుష్పవల్లవ ఫలాన్వితభూరుహభూరివల్లరీ వితతముఁ జారుకైరవనవీనసరోరుహషండమండలా యతసరసీమనోహరము నైన పురోపవనంబునన్ సము న్నతవిభవుండు వాసభవనంబు లొనర్పఁగఁ బంచి యిమ్ములన్. |
325 |
| క. |
దేవీసహితంబుగఁ బృ | థ్వీవరుఁ డవ్వనమునందు విహరించె ఘనాం తావసరవాసరంబుల | భావితపద్మవనపవనపరిచితుఁ డగుచున్. |
326 |
| వ. | అంత నొక్కనాఁడు నితాంతఘర్మజలకణకలితశరీరుండై ప్రియాసమేతంబుగా వాసగృహంబు వెలువడి తత్సమీపంబున నతిమనోహరం బయిన కమలాకరంబుఁ గని దాని తీరంబున నయ్యుగ్మలి నునిచి తాను గృతావగాహుం డై. | 327 |
| క. |
‘మే లై యున్నది జలము వి | శాలనయన! చెమట వోవఁ జయ్యన దేహ క్షాళన మొనరింపు’ మనిన | నా లేమ దరస్మితాననాంబుజ యగుచున్. |
328 |
| ఆ. |
మడుఁగు సొచ్చి మునిఁగి మాయ మై పోయిన | నద్భుతాత్ముఁ డగుచు నవనివిభుఁడు మడుఁగు గలయ వెదకి మానినిఁ గానక | జలము లెల్ల వెడలఁ జల్లె గడఁగి. |
329 |
| వ. | ఇట్లు సల్లి యందు మండూకంబు లనేకంబు లున్నం జూచి ‘యివి మత్ప్రియాంగనను మ్రింగినవి గా కేమి’ యని కలుషించి యనుచరులం బిలిచి ‘నాకుఁబ్రియంబు సేయవలసినవారు గలిగినం బుడమిం గల కప్పల నెల్లం బొడవడంగించునది’ యని పంచిన నలుదిక్కులకుం జని తదీయ కింకరవర్గంబు. | 330 |
| చ. |
కొలఁకుల వాగులన్ నదులఁ గ్రోవుల బావుల నిర్ఝరంబులం గలయఁగ రోసి రోసి వడిఁ గప్పలఁ గుప్పలుగా వధించుచో నలుగుల మందు భేకనివహంబు గనుంగొని భేకనాయకుం డలఘుతపస్విరూపమున నా నృపుపాలికి వచ్చి యిట్లనున్. |
331 |
| ఉ. |
‘అక్కట! లోకమెల్ల నగ నాఱడి కప్పలఁ జంప నేల ? యిం దెక్కడి పెంపు గల్గుఁ బృథివీశ్వర! కోపము డింపు; కప్పలం జక్కని చూడ్కిఁ జూడు; మిది చాల నధర్మము’ నావుడున్ విభుం ‘డెక్కడి మాట? నాసతికి నెగ్గొనరించెఁ గడంగి భేకముల్.’ |
332 |
| క. |
‘నా యిష్టవనిత మ్రింగిన | మాయపుఁబుర్వు లివి వీని మడియింతు మునీం ద్రా! యుడుగుము నీ’ వనుటయు | నాయన యత్యంతదుఃఖితాత్ముం డగుచున్. |
333 |
| వ. | ‘ఏను మండూకనాయకుఁడ; నాయు వనువాఁడ; నమ్మగువ నా కూతురు సుశోభన యనునది; దానిచేత ననేకులుబేలువడిరి; నీవెంతవాఁడ?’ వనిన నప్పరిక్షితుం ‘డట్లేని నాకు నమ్మెలఁతుకఁదెచ్చి యొప్పింపవలయు’ నని ప్రార్థించిన నతండు నవ్వుచు నవ్వామనయనం దలంపున రావించి యారాజునకు నిచ్చి, దానిం జూచి కోపించి ‘నీవు గడుం జెట్టవు; ప్రసిద్ధు లగు రాజులం బెక్కండ్రం జిక్కులం బెట్టితివి గావున నీకుం బుట్టెడు కొడుకులు కపటవర్తను లయ్యెడు’ మని కూఁతు శపియించి, మండూకరాజు నిజేచ్ఛం జనియెఁ; బరిక్షితుండును సంప్రాప్తమనోరథుండయి సుశోభనయందుఁగ్రమంబున శలుండును నలుండును వలుండును నను మువ్వురు గొడుకులం బడసి, యం దగ్రజుండయిన శలు నభిషిక్తుం జేసి తపోవనంబున కరిగె; నంత. | 334 |
| క. |
శలుఁ డొక్కనాఁడు కనకో | జ్జ్వల మగు రథ మెక్కి వేఁట సని పెక్కుమృగం బులఁ జంపఁగ నొక్క మృగం | బలఘుతరశరాగ్రవిద్ధమై వెసఁ బఱచెన్. |
335 |
| ఆ. |
ఇట్లు పఱచుటయును నెంతయు రయమున | నమ్మృగంబువెనుక నరిగి యరిగి యెయిద లేక ధారుణీశుండు సారథిఁ | బదరి ‘తేరు వేగ పఱపు’ మనియె. |
336 |
| సీ. |
అనవుడు సూతుఁ డిట్లను ‘దేవ! మన మెంత | దఱిమిన మృగము దద్దయు జవంబు గలదు; రథ్యంబులు గడుకొని కూడంగఁ | జాలవు; వలవని జాలి యేల? మన తేరిహరులు వామ్యము లైన నమ్మృగ | మగపడు; లేకున్న నలవి గాదు’ నా విని’ వామ్యముల్ నాఁగ నెవ్వని హయం | బులు సెప్పు’ మనియె నబ్భూవిభుండు; |
|
| తే. |
వామదేవమహామునివరుని హరులు | వామ్యములు నాఁగఁ జను’ నని వాఁడు సెప్పె; ‘నతని యాశ్రమ మెచ్చట? నచటి కిపుడ | తేరు వోవ ని’ మ్మనియె ధాత్రీవిభుండు. |
337 |
| వ. | వాఁడును రథంబు సత్వరంబుగా వామదేవునాశ్రమంబునకుం బఱపినం జని, యాతం డాతపోనిధిం గని నమస్కరించి, ‘మునీంద్రా! నాచేత నేటువడి యొక్కమృగంబు రయంబునం బఱచె; నమ్మృగంబు వధియింపవలయు; భవదీయహయంబుల నీవలయు’ ననిన నతండు’ నీవు కృతకార్యుండవై మా హయంబులం దడయక యొప్పింపవలయు, నట్లేనిం గొనిపొ’ మ్మనిన వల్లె యని వామ్యంబులం గొని రథయుక్తంబులం గావించి తదీయజవంబునకు మెచ్చుచు ముహూర్తమాత్రంబునఁ గూడముట్టి మృగంబు సమయించి మగిడి నిజపురంబునకు వచ్చి. | 338 |
| మత్తకోకిల |
‘రాజయోగ్యము లైన యీ హయరత్నముల్ జవసత్త్వ వి భ్రాజితంబులు వాని కేటికిఁ బాఱువానికి’ నంచు నా రాజు రాజసబుద్ధి నంతిపురంబునం దిడఁ బంచె న వ్వాజియుగ్మము; వేడ్క నూనినవాఁడు దోస మెఱుంగునే? |
339 |
| వ. | అట వామదేవుండును దనయశ్వంబుల శలుండు గొనిపోయి మగుడ నొప్పింపక తడయుటకాత్మగతంబున. | 340 |
| తే. |
‘రాజపుత్త్రుండు బలియుండు రాజసుండుఁ | గొండి; కాతండు వేడుకఁ గొనుచు నరిగె నశ్వములఁ గ్రమ్మఱఁగ నిత్తు నను విచార | మెవ్విధంబున నతనికి నేల కలుగు?’ |
341 |
| వ. | అని శంకించి నిజశిష్యునాత్రేయుండనువానింజూచి’ శలుండు మన వామ్యంబులం గొనిపోయి యొక్కమాసం బరుగుదెంచె; వాఁడును దనయంతఁ దెచ్చుట గలుగనేరదు; నీ వరిగి మనతురంగరత్నంబులం గొని ర’మ్మని పంచిన, నప్పుడ కదలి యయోధ్యానగరంబునకుం జని. | 342 |
| క. |
మనుజపతిఁ గాంచి యాతఁడు | ‘మునిపతి పుత్తేర నధిపముఖ్య! యిచటి కేఁ జనుదెంచితి మా హయముల | నెనసిన నెయ్యంబుతోడ నిమ్మని యడిగెన్. |
343 |
| క. |
అనవుడు శలుఁ డిట్లనియెం | ‘జను నినుఁ బుత్తేర నతఁడు, సాలుదు వీవుం గొనిపోవఁ దురంగంబులఁ, | జనుమీ! దుర్భాషణములు సైఁపవు మాకున్.’ |
344 |
| వ. | అనిన నమ్ముని కుమారుండు గ్రమ్మఱి చని గురునకు నవ్విధం బెఱింగించిన, వామదేవుండు క్రోధపరీతచేతస్కుం డై శలునిపాలి కరిగి యి ట్లనియె. | 345 |
| క. |
‘ఇమ్ము నరేశ్వర! మా తుర | గమ్ముల; నీ కార్య మయ్యెఁగాదే; కడులో భమ్మున నొండుల సొమ్ములు | రమ్మనినన్ వచ్చునే? యెరవు సతత మగునే? |
346 |
| క. |
పరధనహరణము దురితము | పరికింపుము; వరుణుచేతిపాశంబుల ని ష్ఠురముగఁ గట్టువడకు; ని | ర్భరనరకకృశాను శిఖలఁ బడకుము మీఁదన్.’ |
347 |
| చ. |
అనుటయు నాతఁ డిట్లనియె ‘నాఱడివిప్రుల కేల యశ్వముల్? ఘనతరసత్త్వమూర్తు లనఁ గాఁ దగు నెడ్లను రెంటి నిచ్చెదన్; విను మటుగాక బల్లిదపువేసడముల్ వలతేని నిత్తుఁ గై కొనుము తగంగ; వామ్యములఁ గోరక పొ; మ్మడియాస లేటికిన్?’ |
348 |
| క. |
అనిన ‘నివి యేటి మాటలు? | వినువారలు నవ్వ నకట! విప్రులధనముల్ గొని వేఱ యొంటి నిచ్చెద | నను టిది యేనాఁటిచంద?’ మని ముని పలికెన్. |
349 |
| క. |
పలుకుటయు నలిగి శలుఁ ‘డి | ప్పలుగుఁ దపసి నంటఁ గట్టి పటుశూలములం బొలియింపుఁ’ డనుచు భీకర | బలుల నియోగించెఁ దనదు పార్శ్వజనములన్. |
350 |
| వ. | అంతయుం జూచి వామదేవుండు ఘనరోషభీషణ ప్రహాసదుర్నిరీక్ష్యముఖుం డగుటయు, నాక్షణంబ ఘోరాకారు లగు రాక్షసు లనేకులు పుట్టి నిశాతశూలంబుల నా భూపాలుంబొడిచి కాలగోచరుం జేసిరి; మునీంద్రుఁడు నిజేచ్ఛం జనియెఁ; దదనంతరంబ శలానుజుండు నలుం డనువాఁడు నిజరాజ్యపట్టభద్రుండై సుఖంబుండఁ గొండొకకాలంబునకు వామదేవుండు సనుదెంచివానింగని’ ‘మహాత్మా! నీవు ధర్మపరుండవు; ధర్మువుదప్పనోడుదేని, మా హయంబుల ని’ మ్మనుటయు, నలుం డలిగి నిజసమీపంబున నున్న సారథిం జూచి యిట్లనియె. | 351 |
| సీ. |
‘కడుఁ గ్రొవ్వి తేఁకువ సెడియె నీ పాఱుండు | వీఁకమై నిప్పుడు వీని ఱొమ్ము వ్రయ్యంగ నేసెదఁ జయ్యన విషదిగ్ధ | సాయకమును శరాసనముఁ దెమ్ము’ నావుడు నమ్మహీదేవుండు నగుచు ని | ట్లనియె; ‘న న్నేయఁ దెమ్మనిన విశిఖ మంతఃపురంబున సంతసంబున నున్న | యనఘు భవత్సుతుఁ దునుముఁగాక!’ |
|
| తే. |
యనఁగఁ దదనంతరంబ ఘోరాస్త్రనిహతుఁ | డైన బాలునిఁ గొనుచు హాహారవంబు లెసఁగ నంతిపురంబువా రెల్ల వచ్చి; | రది ధ్రువంబుగఁ గనియును నవ్విభుండు. |
352 |
| వ. | కోపావేశఘూర్ణమాన విగ్రహుం డగుచుఁ దన దురాగ్రహంబు విడువక సమీపవర్తులం జూచి. | 353 |
| మ. |
‘వినుఁడీ సర్వజనంబులుం గడఁగి యీ విప్రున్ దురాలాపు దు ర్జనునిం దున్మెద నస్మదీయసుమహచ్చాపోగ్రనిర్ముక్త బా ణనిపాతచ్ఛిదురాంగరక్తజలశోణక్షోణిసంగస్థుఁగాఁ గనుఁడీ యీ దురితాత్ము’ నంచు నతి శీఘ్రప్రాప్తకోదండుఁ డై. |
354 |
| క. |
శర మరిఁ బోయుటయును ద | త్కరయుగ్మము బాణకార్ముకంబులతోఁ జె చ్చెర సంస్తంభము నొందుడు | నరనాథుఁడు విస్మయోపనతమానసుఁడై. |
355 |
| క. |
పుల్లవడి చలము రోషముఁ | బొల్లయు నై చనఁగఁ గొంతప్రొద్దు మొగమునన్ వెల్లఁదనము గదుర నిలిచి | యెల్లజనులు వినఁగ మఱియు నిట్లని పలికెన్. |
356 |
| ఉ. |
‘ఆడితిఁ బెక్కుమాట; లవి యెల్లను వమ్మయి పోయె; నస్త్రసం తాడనశక్తి గీడ్పడియెఁ; దథ్యము బ్రాహ్మణశక్తి యెక్కు; డే నోడితి వామదేవునకు; నో జనసంఘములార! సజ్జనా మ్రేడితకీర్తి నిమ్ముని నమిత్రనిషూదను నాశ్రయించెదన్’. |
357 |
| వ. | అని యివ్విధంబున నతం డేపు దప్పి జోహారు వెట్టుటయుఁ, దదీయ బంధుమిత్త్ర జనంబులు భయసంభ్రమంబులతో నమ్మునినాథు శరణు సొచ్చి యనునయించినఁ, బ్రసన్నుండై యమ్మహాత్ముండు దత్కరయుగస్తంభనంబు మాన ననుగ్రహించి, తదీయనందను ప్రాణంబు లొసంగె; నంత నమ్మహీకాంతుండు భార్యాసహితంబుగా నతనికిఁ బ్రణమిల్లి హయంబులఁ దెచ్చి యొప్పించినం గైకొని వామదేవుఁ డరిగె; ‘నిట్టిది బ్రాహ్మణప్రభావం’ బని చెప్పిన విని. | 358 |
| క. |
మునిపతికి మ్రొక్కి కుంతీ | తనయుఁడు ‘మీకంటె వృద్ధతముఁ డగు పురుషుం డనఘా! కలఁడె జగమ్మున?’ | నని యడిగిన నాతఁ డిట్టులని యెఱిఁగించెన్. |
359 |