| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
ఘనుఁ డింద్రద్యుమ్నుం డను | జనపతి గలఁ; డాతఁ డింద్రసదనమున ముదం బున నుండఁగ బహుకాలం | బున కాతని కీర్తి లోకమున మాయుటయున్. |
360 |
| తే. |
అమరు ‘లిచ్చోట నుండలే వరుగు’ మనుచు | నుర్విఁ ద్రోచిన నతఁడు నా యున్నకడకు నర్థిఁ జనుదెంచి యిట్లను ‘ననఘ! నన్ను | నిద్ధపుణ్యు నింద్రద్యుమ్ను నెఱుఁగు దయ్య?’ |
361 |
| సీ. |
అనుడు నే నిట్లంటి నయ్య! ని న్నెఱుఁగంగఁ | జాలనయ్యెద; హిమశైలశృంగ వాసియై యుండు ప్రావారకర్ణుం డను | పేరి ఘూకము గడు పెద్ద; యదియు నాకంటె నిన్ను నిర్ణయముగ నెఱుఁగుఁ బొ | మ్మనుటయు; నన్ను రమ్మనియె నతఁడు; ఘనరసాయనఘుటికాప్రయోగంబున | దేహతాపంబు వర్ధిల్లె నందుఁ |
|
| తే. |
గదలి రాఁజాల నే నంటిఁ; గడఁగి యన్న | రేంద్రుఁ డశ్వమై ననుఁ బ్రీతి నెత్తికొనుచు నయ్యులూకముపాలికి నరిగి నన్ను | నడిగినట్టుల దానిని నడుగుటయును. |
362 |
| వ. | అదియునుం గొండొకసేపు దలపోసి చూచి ‘యేను నిన్ను నిక్కువంబుగా నెఱుంగనేర; నింద్రద్యుమ్నం బను కొలనియందు నాళీకజంఘుం డనుపేరి బకవల్లభుండు వసియించు; నవ్విహంగంబు నాకుఁ బెద్ద; నిన్నెఱుంగు నరుగు’ మనిన నమ్మనుజపతి నాతోడఁగూడ నయ్యులూకంబు మోచికొని నాళీకజంఘునొద్దకుం జని తనపేరు సెప్పి ‘నన్నెఱుంగుదే?’ యనిన నదియు ‘నే నిన్నెఱుంగంజాల నాకంటెఁ జిరకాలజీవి యైన యకూపారుండను కచ్ఛపంబు గల; దదియును నిక్కొలన నుండు నజ్జలచరము నిన్నెఱుంగంబోలు; నడిగి చూతముగాక’ యని యక్కమఠంబుఁబేర్కొని’ యొక్క సందేహంబు నిర్ణయించుట కయి యీయార్యజనంబులు నిన్ను గుఱించి వచ్చినవారు; నీవు సనుదేరవలయు’ నని పలుకుటయును. | 363 |
| తే. |
కొలను వెలువడి చనుదెంచెఁ గూర్మవిభుఁడు; | వార లడిగి ‘రింద్రద్యుమ్నధారుణీశు నెఱుఁగుదే?’ యన నదియు నొక్కింతతడవు | దలఁచికొని కన్నుఁగవ నశ్రుజలము లొలుక. |
364 |
| వ. | ఎలుంగు రాలుపడ వారలం గనుంగొని యి ట్లనియె. | 365 |
| ఉ. |
‘అక్కట! నే నెఱుంగనె మహాగుణభూషణు నమ్మహాత్ము న న్నిక్కడఁ బెక్కుమాఱులు ననేకభయంబులఁ బొందకుండఁగా నక్కటికంబుతోడఁ దగ నాతఁడు గైకొని కాచెఁ గాదె! పెం పెక్కిన యన్నరోత్తముని నెన్నఁటికిన్ మఱవంగవచ్చునే? |
366 |
| తే. |
అమ్మహాత్ముండు బహువిధయజ్ఞదక్షి | ణార్థముగ విప్రవరులకు నర్థి నిచ్చు గోగణంబుల గొరిజల గ్రొచ్చియయ్యెఁ | గాదె యీ సరోవరము జగన్నుతముగ.’ |
367 |
| వ. | అనిన యనంతరంబ దేవదూతలు విమానంబు గొనుచుఁ జనుదెంచి యింద్రద్యుమ్నుం గని ‘మహాత్మా! నీ కీర్తి జగంబునందు శాశ్వతంబై నిలిచె; నీకుఁ ద్రిదివనివాసంబు సుస్థిరం బయ్యె; నరుగుదెమ్ము; విమానం బెక్కు’ మని, వెండియు. | 368 |
| క. |
‘తన కీర్తి యెంతకాలము | వినఁబడు నిజ్జగమునందు వెలయఁగ నందాఁ కను బుణ్యలోకసౌఖ్యం | బున నెంతయు నుల్లసిల్లుఁ బురుషుం డనఘా!’ |
369 |
| వ. | అనిన నమ్మహీకాంతుండు దివిజకింకరులంజూచి ‘యిమ్ముదుసలి తాపసుని, వృద్ధవిహంగంబును గార్యార్థంబు సహాయులుగాఁదెచ్చితి; వీరిని నిజస్థానంబుల నునిచివచ్చెద; నించుకనిలువుం’ డని వారిచేత ననుజ్ఞాతుండై నన్నును నులూకంబును నెప్పటి నెలవులం బెట్టి తానును దేవయానంబున దివంబున కరిగె’ నని చెప్పినఁ బ్రీతుఁడై పృథానందనుండు. | 370 |
| క. |
‘నీకంటె వృద్ధతముని గు | ణాకర! యెఱిఁగించి; తిది మహాద్భుత!’ మని సు శ్లోకుఁడు మునివరునకుఁ బు | ణ్యాకృతికిఁ గృతప్రణాముఁడై కడుభక్తిన్. |
371 |