పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము
మార్కండేయుఁడు ధర్మరాజునకుఁ గువలాశ్వుచరిత్రము సెప్పుట (సం. 3-192-4)
వ. ‘మునీంద్రా! యిక్ష్వాకువంశోద్భవుండైన కువలాశ్వునకు ధుంధుమారుం డను పేరెట్లు గలిగెఁ జెప్పవే!’ యని యడిగిన నతం డి ట్లనియె. 372
ఉ. ‘శంకరసన్నిభుండు జనశంకరుఁడున్‌ గరుణాకరుం డనా
తంకుఁ డుదంకుఁ డన్ముని వ్రతస్థితుఁ డై మరుభూమియందు ని
శ్శంకమతిన్‌ వసించి యనిశంబును నవ్యయు నచ్యుతున్‌ మనః
పంకజవేదిపై నిడి తపం బొనరించె ననేకవర్షముల్‌.
373
తే. అతనిభక్తికిఁ బ్రియమంది యాదిదేవుఁ | డంబుజాక్షుఁ డధోక్షజుఁ డక్షరుండు
గరుణఁ బ్రత్యక్ష మగుటయుఁ గని యతండు | ప్రణతి యొనరించి యిట్లని ప్రస్తుతించె.
374
మత్తకోకిల ‘దేవదేవ! శ్రుతిప్రమాణవిధేయ! మాధవ! జంగమ
స్థావరాత్మకమైన లోకము సర్వమున్‌ భవదీయమా
యావిధేయము విశ్వరూపుఁడ వవ్యయుండవు నీవ స
ద్భావసుస్థితి ని న్నెఱింగినఁ బాయుఁ బాపము లచ్యుతా!
375
చ. అనిమిషసిద్ధసంయమివిహంగభుజంగమముఖ్యు లెల్ల ని
న్ననిశముఁ గొల్చి నీ దయఁ గృతార్థతఁ బొందుదు; రెందు నీవు నె
మ్మనమున సంతసిల్లుదు సమస్తజగంబులు శాంతిఁ బొందు; నీ
కినుకకు మాఱు లేదు శివకీర్తిత! యీ భువనత్రయంబునన్‌.
376
మత్తకోకిల విక్రమత్రయలీల నోలిన విష్టపత్రితయంబుఁ బె
ల్లాక్రమించితి, క్రూరులైన సురారివీరులఁ బ్రస్ఫుర
చ్చక్రవిక్రమకేళిఁ ద్రుంచితి, సర్వయజ్ఞ ఫలావహ
ప్రక్రియాత్ముఁడ వీవు నిశ్చలభక్తిగమ్య! జనార్దనా!
377
వ. అనిమఱియుంబెక్కుభంగులంబ్రస్తుతించినం గరుణించిపాంచజన్యధరుండు వరంబడుగు మనిన నుదంకుండు ‘దేవా! భవదీయదివ్యరూపంబుఁ బ్రత్యక్షంబుగాఁ గంటి; నింతకంటెవరం బెయ్యది గల? దైనను నామనంబు నిత్యంబును సత్యధర్మశమంబులయందు సుస్థిరంబై నీయందు దృఢభక్తికంబు గావలయు; నిదియ నాకు వరం’ బనుటయు నద్దేవుండు ‘నీకోరినయట్ల యిచ్చితి; మత్ప్రసాదంబున నీకుం బరమజ్ఞాన యోగంబును సిద్ధించుఁ; ద్రిలోకహితం బైన కార్యం బొక్కటి నీచేత సాధితం బయ్యెడు; నది యెయ్యది యనిన వినుము; ధుంధుండను దానవుండు జగంబుల కుపద్రవంబు సేయంగలవాఁడు; తద్వధార్థం బై నీవు బృహదశ్వసూనుం డైన కువలాశ్వు నుద్యుక్తుంజేసెద; వన్నరేంద్రుండు మత్ప్రసాదలబ్ధం బైన యోగబలంబునం జేసి భవన్ని యోగంబున నయ్యసురం బరిమార్పసమర్థుండగు; నవ్విశేషంబునకు నీవలన నఖిలలోకంబులు సంతసిల్లెడు’ నని పలికి విష్ణుదేవుం డంతర్హితుండయ్యె; నుదంకుండును బూర్వప్రకారంబునం దపంబు సేయుచుండె; మఱియును. 378
సీ. అనఘుఁ డిక్ష్వాకుఁ డీ యఖిలభూచక్రంబు | నేలి నాకమునకు నేఁగుటయును
నతని నందనుఁడు శశాదుండు రాజయ్యె; | వాఁడు కకుత్‌స్థుఁ డన్వానిఁ గనియెఁ
నతఁ డనేనసుఁ డను నాత్మజుఁ బడసె నా | పృథివీపతికిఁబుట్టెఁ బృథుఁడనంగఁ
బృథుఁడు విష్వగుఁ డనుపేరి పుత్త్రకుఁ గాంచె; | నతనికి జనియించె నార్ద్రుఁ డనఁగ
 
తే. నార్ద్రునకుఁ బుట్టె యువనాశ్వుఁడను తనూజుఁ; | డాతనికిఁ బుట్టె శ్రావస్తుఁ డను విభుండు;
దత్సుతుఁడు బృహదశ్వుఁ డా ధరణిపతికి | నుగ్రతేజుండు గువలాశ్వుఁ డుదితుఁ డయ్యె.
379
వ. అక్కువలాశ్వునకు నఖిలాస్త్రశస్త్రవిద్యావిశారదులనధికసత్త్వసంపన్నులు నైన పుత్త్రు లేకవింశతి సహస్రంబులు పుట్టి; రంత బృహదశ్వుండు నిజపుత్త్రుం గువలాశ్వుం బ్రాప్తసంతాను నత్యంతధర్మాన్వితు నఖిల మహీరాజ్యభార ధౌరేయుంగా నభిషేకించి, తపోవనంబునకుం బోవ సమకట్టి, యయోధ్యానగరంబు వెలువడు నవసరంబున నవ్వార్త విని యుదంకుండు సనుదెంచి బృహదశ్వున కిట్లనియె. 380
ఉ. ‘నీవు ప్రజాభిరక్షణము నెమ్మి నొనర్పు; మరణ్య భూమికిం
బోవఁగ నేల? రాజులకు భూప్రజఁ గాచుటఁ బోలు; ధర్మువుల్‌
భూవర! కల్గునే యడవిఁ బోయి వసించినఁ గాని కాదె? ర
క్షావిధిఁ గాదె సద్గతులు గాంచిరి తొల్లిటి రాజముఖ్యులున్‌.
381
క. నీ రక్షణంబుకతమున | ధారుణి మముబోఁటి సాధుతపసులు నిత్య
ప్రారంభధర్మకర్మో | ద్ధారు లగుట; యదియు నీదు ధర్మువు గాదే!
382
వ. విను మొక్కయద్భుతంబు సెప్పెదఁ; దొల్లి మధుకైటభు లనం బ్రఖ్యాతు లైన యసురులతనయుండు ధుంధుం డనువాఁడు మహాబలపరాక్రమ సంపన్నుండు నిజతపోబలంబునం బితామహువలన వరంబు వడసి, దేవదానవ గంధర్వాదులకు నజయ్యుం డై చరియించుచుండు; నయ్యసుర యిపుడు మదీయాశ్రమ సమీపంబున బహుయోజనవిస్తీర్ణం బగు సముద్రవాలుకాపులినతలంబునందు మహావివరంబు గావించుకొని సుఖంబున నిద్రించుచున్నవాఁడు; వాలుకాంతరితశరీరుండైన వాని నిశ్వాసపవనంబు ధూమదహనజ్వాలాభీలం బయి సంవత్సరంబున కొక్కమాటు వెలువడి భూనభోంతరంబెల్లను నిరంతరసికతారజఃపటలంబుమాఁటుకొనంజేయుఁ; దదీయ వేగంబునఁ దత్సమీప భూమి శైలకాననంబు లేడు దినంబులదాఁకఁ గంపించుచుండు; నిట్టి దారుణత్వంబుకతంబున మాకు మా యాశ్రమంబున నుండుట సంకటంబు; గావున నద్దురాత్ము వధియించి మాకును లోకంబులకును హితంబు సేసి కృతకృత్యుండవై మఱి తపోవనంబున కరుగుము. 383
తే. ‘ఎవ్వఁ డమ్మహాసురు వధియించు పనికిఁ | బూను నతనికి నాత్మీయభూరిశక్తి
యిచ్చి జయ మిత్తు’ నని యానతిచ్చె నధిప! | యాదరంబున నాకుఁ జక్రాయుధుండు.
384
వ. కావున. 385
చ. ‘అతులితవిష్ణుశక్తిసముపాహితమూర్తివి గమ్ము లెమ్ము! సం
తతభుజశక్తి నిట్టి యవధాన మొనర్పఁగ నీవ కాని యీ
క్షితి నితరుండు లేఁ; డధికకీర్తియుఁ బుణ్యముఁ జేరు నిన్ను; నూ
ర్జితగుణ! యింతవట్టుఁ దగఁ జేయుము; గావుము లోక మంతయున్‌.’
386
వ. అనినం గృతాంజలి యై యుదంకునకు బృహదశ్వుం డి ట్లనియె. 387
క. ‘విమలమతి నస్త్రసన్న్యా | సము సేసితిఁ, దప మొనర్ప సమకట్టితి, నిం
క మునీంద్ర! తపోవనగమ | నము దప్పదు నాకు; వినుము నా విన్నపమున్‌.
388
చ. అనఘుఁడు మత్సుతుండు గువలాశ్వుఁడు వీఁడె మహాబలుండు స
జ్జనహితకారి ధైర్యనిధి సంభృతకీర్తి భవత్ప్రియార్థ మై
జననుత! యమ్మహాసురునిఁ జంపుట కోపు నవార్యశౌర్యవ
ర్ధనులగుచున్న పుత్త్రులును దాను నభేద్యభుజావిభూతితోన్‌.
389
వ. నాకుం దపంబున కనుజ్ఞ యీవలయు’ నని పలికి యక్కార్యంబునకుఁ బుత్త్రు సమర్పించి యమ్మునిచేత నభినందితుండై బృహదశ్వుండు దపోవనంబునకరిగె’ ననిన విని ధర్మనందనుండు, మార్కండేయుతో ‘ధుంధుండు మధుకైటభులపుత్త్రుండని చెప్పితి; రమ్మధుకైటభు లెక్కాలంబువా? రేమి యై?’ రని యడిగిన నతం డి ట్లనియె. 390
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )