పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము
మార్కండేయుఁడు ధర్మరాజునకు మధుకైటభుల చరిత్రము సెప్పుట (సం. 3-194-13)
సీ. ‘అధిప! తొల్లి జగత్త్రయంబు నేకార్ణవ | మై యుండఁగా నప్డు హరి యొకండ
భాసుర భోగీంద్రపర్యంకమున భవ్య | యోగనిద్రాసుఖయుక్తి నలర
నతిదీర్ఘమగు కాల మరిగెఁ; బదంపడి | దైత్యు లిద్దఱు మహోదాత్తబలులు
మధుకైటభులు నాఁగ మథితశాత్రవు లేఁగు | దెంచి యప్పరమాత్ము దివ్యనాభి
 
ఆ. కమలమున వెలుంగు కమలాసనునిఁ గని | దర్పదోషనిహతిఁ దలర వ్రేయ,
నతఁడు భీతి నొంది యాక్రోశ మొనరించె | ‘నాదిపురుష! నన్ను నరయు’ మనుచు.
391
ఉ. ఆ తెఱఁ గాత్మఁ గాంచి కమలాక్షుఁడు మేల్కని ఘోరవిక్రమో
పేతుల దైత్యసింహుల నపేతభయాత్ములఁ జూచి ‘మీర లి
ట్లీతని నుక్కునం బఱుప నేల? భవద్బలశౌర్యయుక్తికిం
బ్రీతుఁడ నైతిఁ; జెచ్చెర నభీష్టవరంబులు వేఁడుఁ డిచ్చెదన్‌.’
392
తే. అనినఁ గలకల నవ్వి యయ్యసురవరులు | ‘నీవు మా కేమి యిచ్చెదు? నీకు నేము
వరము లిచ్చెద మడుగుము వలచితేని’ | ననిన వారల కిట్లను నవ్విభుండు.
393
క. ‘సత్యవ్రతులార! వరం | బత్యంతప్రీతి మిమ్ము నడిగెద లోక
ప్రీత్యర్థముగా నాచే | మృత్యువునం బొందుఁ డిపుడ మీర లిరువురున్‌.’
394
వ. అనిన వార లొండొరువుల మొగంబులు చూచికొని యా చక్రధరున కిట్లనిరి. 395
చ. ‘నగి నగి యేనియున్‌ విను జనార్దన! యెన్నఁడు బొంకు పల్క; మ
త్యగణిత విక్రమోరుబలధైర్యసమగ్రుల; మెల్ల భంగిఁ గా
లగతి దొలంగఁ ద్రోవఁగఁ దలం బగునే? ; యగుఁ గాక! నీకు మె
చ్చుగ నిదె ప్రాణ మిచ్చెదము; స్రుక్కము చావున కాత్మ నేమియున్‌.
396
ఆ. చంపెదేని మమ్ము జలములు లేని దే | శమునఁ జంపవలయుఁ గమలనాభ!
నిక్కమింత వట్టు; నీచేత మడియంగఁ | దగుదు’ మనిన నగుచు నగధరుండు.
397
వ. త్రైలోక్యంబును జలమయం బగుట నాలోకించి. 398
క. పరమేశుఁడు దన యూరులు | పరపుగ నొనరించి వానిపైఁ దచ్ఛిరముల్‌
పరుషతరశితసుదర్శన | ఖరధారానిహతిఁ జేసి గ్రక్కునఁ దునిమెన్‌.
399
తే. పరఁగ నమ్మధుకైటభాసురులసుతుఁడు | సువ్వె ధరణీశ! ధుంధుఁడన్‌ శూరవరుఁడు
వాఁడు వరగర్వమునఁ జేసి వాఁడి మిగిలి | యమరపతిఁ దొట్టి వేల్పుల నభిభవించె’.
400
వ. అని చెప్పి యమ్మునీంద్రుం డి ట్లనియె: నట్లు బృహదశ్వుచేత ననుజ్ఞాతుండై కువలాశ్వుండు శుభదినంబున నుదంకపురస్సరంబుగాఁ గృతప్రస్థానుం డై. 401
తరలము దనుజనిర్మథనైకతత్పరతావిజృంభణ మొప్ప స
ద్వినుతతేజుఁడు ఘోరసంగరవిక్రమోత్సవలీలమై
ఘనభుజాబలభూరిదుర్వహగర్వసంగ్రహు లైన నం
దను లనేకసహస్రసంఖ్యులు దన్నుఁ గొల్వ నుదగ్రుఁడై.
402
మ. చతురంగధ్వజినీపదప్రవిహతిన్‌ సర్వంసహాచక్ర మా
తతకంపంబుగ నేఁగె; నప్పుడు దగం దైత్యారి యారాజునం
దతులం బైన నిజాంశశక్తి సొనిపెన్‌; హర్షించి రింద్రాది దే
వతలున్‌ సన్మునిముఖ్యులున్‌ నృపతి కైశ్వర్యోన్నతిం జేయుచున్‌.
403
ఆ. మొరసి దివ్యతూర్యములు నందనద్రుమ | సురభికుసుమవృష్టి గురిసెఁ గలయ
సప్రతీపభంగి యగు మందపవనవి | చేష్టితంబు గర మభీష్ట మయ్యె.
404
క. గగనమున సురవిమానము | లగణితముగఁ గ్రందుకొనియె; ననుకూలము లై
మృగపక్షిగతులు శోభన | మగు టేర్పడఁ జెప్పె నజ్జనాధిపుయాత్రన్‌.
405
వ. ఇట్లు సని కువలాశ్వుండు సముద్రతీరంబున విడిసి నిజపుత్త్రుల నానాస్త్రశస్త్రజ్ఞుల ననేకసహస్ర సంఖ్యలగు వారల నవారితజవసత్త్వుల నవ్వాలుకాపులినఖననంబు సేయ నియోగించిన. 406
మ. నరనాథోత్తము నందనుల్‌ గడఁగి నానా శూలకుద్దాల ము
ద్గర కాష్ఠాదుల నయ్యుదగ్రసికతౌఘంబంతయున్‌ సప్త వా
సరముల్‌ వాయక పాయ గ్రొచ్చి నడుమన్‌ సంసుప్తుఁడై యున్న యా
సురవైరిం గని రుగ్రనిశ్వసననిష్ఠ్యూతాగ్ని కీలావృతున్‌.
407
చ. అడరి నిశాతపట్టిస గదాసి పరశ్వధశూలహస్తు లై
తడయక వార లందఱును దానవుదేహము వీఁక వ్రేసియుం
బొడిచియు నొంప నెంతయును బ్రొద్దున కయ్యసురాధముండు బి
ట్టొడలు గదల్చి నీల్గి వివృతోగ్రముఖుం డయి యావులించినన్‌.
408
ఉ. భోరున విస్ఫులింగములు వొడ్మఁగఁ దన్ముఖనేత్రనాసికా
ద్వారములందు వెల్వడియె దారుణవహ్ని శిఖాకలాపముల్‌
వారక యందు మ్రంది రనివార్యులు రాజకుమారు లందఱున్‌
ఘోరత సాగరుల్‌ గపిలుకోపమునన్‌ నశియించు చాడ్పునన్‌.
409
వ. ఇట్లు దృఢాశ్వ కపిలాశ్వ భద్రాశ్వులు దక్కం దక్కిన కొడుకులందఱుఁ బొడవడంగినఁ గడంగి కినుకం గువలాశ్వుండు సంహారసమయ సప్తాశ్వుండునుం బోలె నుజ్జ్వలుం డయి కదియుటయు, నద్దానవుండు క్రోధసంరంభంబున సముత్థితుండై యొక్కశూలంబెత్తికొని కవిసె నప్పుడమ్మహీవిభుండు తదీయదేహజనితం బై మండుచున్న యనలం బాత్మీయయోగవిద్యాప్రభవం బగు జలప్రవాహంబునం బ్రశాంతంబు గావించి బ్రహ్మాస్త్రంబు ప్రయోగించిన. 410
క. ఆ దివ్యాస్త్ర జ్వలనము | భూదిగ్గగనములు వెలుఁగఁ బొదివి మహోగ్రం
బై దానవేంద్రుదేహము | బూదిగ నొనరించెఁ జిత్రముగ నొకమాత్రన్‌.
411
వ. అంత. 412
క. ‘సురశత్రుఁడైన ధుంధునిఁ | బరిమార్చితి వీవు జగదభయకారివి భూ
వర! ధుంధుమారుఁ డనఁగాఁ | బరఁగు’ మనిరి సురలు మునులు పార్థివముఖ్యా!
413
వ. ఇట్లు ప్రసన్నులై యింద్రాదిదేవతలు నుదంకప్రముఖ సంయమి వరులును నమ్మహీవరు నభినందించి ‘నీ కెయ్యది యిష్టంబు వేఁడు’ మనిన, నతండు బ్రాహ్మణభక్తియు ననవరతదానశీలతయు విష్ణునితోడి సఖ్యంబును వరంబులుగాఁ దనకుఁ గోరిన, నట్ల యొసంగి, వారలందఱు నిజనివాసంబుల కరిగిరి; కువలాశ్వుండును విజయోల్లాసభాసితుండై పురంబున కరిగి, సముజ్జ్వల సామ్రాజ్యసౌఖ్యంబులంబరఁగెనని మార్కండేయుండు ధర్మరాజునకుఁ గువలాశ్వుండు ధుంధుమారుం డైన విధంబు సెప్పె నని వైశంపాయనుండు జనమేజయున కెఱింగించిన తెఱంగు. 414
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )