పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
ధర్మరాజునకు మార్కండేయుఁడు పుత్త్రున కుండఁదగు గుణంబులం దెల్పుట (సం. 3-196-1)
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు బహుభంగుల మార్కండేయుండు వివరింపం బుణ్యకథావిశేషంబులు విని సంతుష్టహృదయుం డై కౌంతేయపూర్వజుండు మఱియు నమ్మునీంద్రున కి ట్లనియె. 2
సీ. ‘సమధిక దర్పదుర్జయములై నిగిడెడు | నింద్రియంబులఁ గుదియించి తెచ్చి
మనసు పొందున నిడి మన సహంకారంబు | పజ్జకుఁ బాపి సద్భక్తియుక్తి
నెరయంగ ననిశంబు నిజభర్తృ శుశ్రూష | యందు సమాహిత యైన వనిత
యఖిలలోకోత్కృష్ట యని యెప్డు నూహింతు; | నరయఁ బతివ్రత లైన వారి
 
తే. చరిత మత్యంతధర్మసూక్ష్మంబుఁ గరము | దుష్కరము గాదె తలఁప నిర్ధూత దురిత!
యట్లు గావున విన వేడ్క యయ్యెఁ జెప్ప | వయ్య! పుణ్యసతీ ప్రభావంబు నాకు.
3
వ. మఱియుఁ దల్లిదండ్రు లిరువురయందును బుత్త్రనిమిత్తం బైన యాయాసం బెవ్వరి కెక్కుడు? వారలయెడం బుత్త్రుం డెట్టివాఁడు గావలయు? హీనయోని జాతుం డైన పురుషుం డేమి తెఱంగు నడవడిం బరమధార్మికుల లోకంబులు వడయు? నివి యన్నియు వివరింప నీవ యర్హుండ’ వనిన నమ్మహాముని యమ్మహీపతి కి ట్లనియె. 4
సీ. ‘జతనంబు మిగుల మాసములు దొమ్మిది యుద | రంబునం గరము భరంబుతోడ
భరియించి పదపడి ప్రాణసంశయ దశ | నొంది పుత్త్రునిఁ గాంచు నెందుఁ దల్లి;
తపములు యజ్ఞముల్‌ దానముల్‌ వ్రతములు | దేవతా సజ్జన సేవనములుఁ
గావించుఁ బుత్త్రునిఁ గామించి జనకుఁ; డి | ట్లిరువుర పాటును సరియె తలఁపఁ;
 
తే. దనయుఁ గని తల్లిదండ్రులు దమకు నతఁడు | భక్తుఁ డగుటకు ధర్మానురక్తుఁ డగుట
కాసపడుదురు; విను మట్టియాస సిద్ధిఁ | బొందఁ జేయు నతఁడ చువ్వె నందనుండు.
5
క. జననియు జనకుఁడు నెవ్వని | యనువర్తనమునఁ బ్రియంబు నందుదు రెదఁ ద
త్తనయుఁడు ధర్మముఁ గీర్తియు | ననూనముగఁ బడయుఁ బొందు నక్షయగతులన్‌.
6
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )