| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము |
| వ. | మఱియు నిజభర్తృ శుశ్రూషయందు నిత్యాసక్తయయిన పతివ్రతకు నఖిలయజ్ఞదానతపఃఫలంబులు సులభంబు లగు; నొక్కయితిహాసంబు సెప్పెద; నందు నీ యడిగిన యర్థంబు లన్నియుఁ దేటపడు నాకర్ణింపుము; కౌశికుం డను బ్రాహ్మణుండు ధర్మతపశ్శీలుండు సంతతాధ్యయనతత్పరుం డయి యొక్క విశిష్టగ్రామంబున నుండు; నతం డొక్కనాఁడు గ్రామసమీపంబునం దొక్కవృక్షమూలంబున నాసీనుండై వేదంబులు గుణియించుచుండం దదీయ శాఖాగతం బైన యొక్క కొక్కెర యాతనిపై రెట్ట వెట్టిన, నమ్మహాద్విజుం డలిగి చూచుటయు నది యప్పుడ నిశ్చేతనం బై నేలంబడినం గనుంగొని యతండు. | 7 |
| క. |
‘అక్కట! నాహృదయము గడు | నక్కటికము లేనిదయ్యె; ననిమిత్తమ యీ కొక్కెర నిటు సేసితి; నా | కెక్కడి శాంతి?’ యని వికలహృదయుం డగుచున్. |
8 |
| వ. | పెక్కుభంగుల వగచి, మధ్యాహ్నం బగుటయుఁ గృతాహ్నికవిధానుండై గ్రామంబున కరిగి, యందు శుచు లైన విప్రగృహంబుల కరిగి భిక్షాచరణంబు సేయుచు, నం దొక్క పుణ్యగృహంబువాకిట నిలిచి ‘భిక్షాం దేహి’ యనుటయు, నా యింటియవ్వయు నతిసంభ్రమంబున భిక్ష యిడుటకుం బాత్రశోధనంబు సేయు నెడ. | 9 |
| ఉ. |
ఆ యెలనాఁగభర్త కడు నాఁకటఁ దూలుచు వచ్చె; వచ్చినం దోయజనేత్ర సంభ్రమముతోఁ దగుపీఠము వెట్టి పాద్యముం బాయక మజ్జనక్రియయు భక్తి నొనర్చి ప్రియోక్తు లొప్పఁగా నాయనఁ బ్రీతుఁ జేసె రుచిరాన్నరసంబులఁ జేసి చెచ్చెరన్. |
10 |
| చ. |
కుడిచినపిమ్మటం గుసుమకోమలి విస్తృతసంస్తరంబుగా నొడికపు సెజ్జ చేసి ప్రియుఁ డొయ్యన యందు శయింపఁ దమ్ములం బిడి చరణంబు లొత్తి మదిరేక్షణ యంతటిలోఁ దలంచె ము న్నడరఁగ భిక్షకై నిలిచినట్టి మహీసురముఖ్యు నాత్మలోన్. |
11 |
| వ. | ఇట్లు దలంచి భిక్ష గొనుచుం జనుదెంచిన నమ్మగువం జూచి కౌశికుండు రోషరంజితలోచనుం డగుచు ని ట్లనియె. | 12 |
| క. |
‘అడిగినయప్పుడ చెచ్చెరఁ | గడపినఁ బో నవ్వ! యేను గడుదుర్మతి వై పడఁతి! నను నిలిపి భిక్షం | బిడక కడు నవజ్ఞ సేసి తేల మదమునన్?’ |
13 |
| చ. |
అనినఁ బతివ్రతాతిలక మాతని కిట్లను ‘నయ్య! మత్ప్రియుం డనుపమితక్షుధాకలితుఁడై చనుదెంచిన భక్తి నమ్మహా త్మునకు సపర్యసేయుచు మిమున్ మదిలోనఁ దలంపఁజాల నై తి; నిదియుఁ దప్పుగాఁ గొనక ధీరత యొప్ప సహింపఁగాఁ దగున్.’ |
14 |
| వ. | అనిన నమ్మహీదేవుం డప్పతివ్రత కి ట్లనియె. | 15 |
| ఉ. |
‘నీ మగఁ డంత యెక్కుడె? మనీషులు భూసురు లింత తక్కువే? కోమలి! యేల యిట్లు గడుఁ గ్రొవ్వునఁ గానవు లోకవంద్యులన్? భూమిసురేంద్రులన్ దివిజపుంగవుఁ డాదిగ భక్తిఁ గొల్చుచో నేమిట నొక్కొవారు గడు నెల్లిద మై రిటు నీకు నిచ్చటన్. |
16 |
| క. |
అవమానితు లై ధరణీ | దివిజులు గ్రోధాగ్నిశిఖల దీపించి మహా ద్రి వనద్వీపంబులతో | నవని నయినఁ బొడవడంతు రప్రతికారుల్. |
17 |
| వ. | నీ వింత నెఱుంగ నొల్ల వైతివి గాకేమి’ యనిన నయ్యంగన యి ట్లనియె. | 18 |
| సీ. |
‘దేవతాసములు భూదేవతావరు లౌట | యేను దన్మాహాత్మ్య మెఱుఁగ నయ్య! యొక విప్రుఁ డలిగి పయోనిధిజలము ల | పేయముల్ గాఁగ శపింపఁ డెట్లు; దండకవిషయంబు దగ్ధంబు సేయండె | యలుకమై నొక్క మహాద్విజుండు; వాతాపి యను దైత్యవరు మ్రింగి యఱిగించు | కొనఁడె భూదేవుఁ డొక్కొరుఁడు గినిసి; |
|
| తే. |
ధరణి మఱియును బెక్కు విధంబులందు | బ్రహ్మవిదు లైన బ్రాహ్మణప్రభుల మహిమ వినమె! యెఱిఁగి యెఱింగి సద్వినుత చరిత! | కొఱవి గొని వెఱ్ఱినే తలఁ గోఁకి కొనఁగ? |
19 |
| వ. | నా తెఱంగు సెప్పెద నాకర్ణింపుము. | 20 |
| తే. |
పతియచూవె నాపాలికిఁ బరమదైవ; | మేను వాఙ్మనఃక్రియలఁ దద్ధితమ యెపుడుఁ గోరి యొనరింతు; దీని మిగులఁగ నొండు | ధర్మువులు గాన నెందును దలఁచి చూచి. |
21 |
| వ. | నీ వతిక్రోధనుండ వగుటయు నెఱుంగుదు; నీకోపంబున నొక్కకొక్కెర నిహతం బయ్యెం గాదె! యిది మదీయపాతివ్రత్యమహిమం జేసి కాంచితిం; గాన క్రోధంబు గొనియాడుట లగ్గు గా’ దని యి ట్లనియె. | 22 |
| తే. |
‘క్రోధ మోహ నామకు లైన ఘోరశత్రు | లిరువు రెరియించుచుండుదు రెపుడు నంత రంగ మయ్యుభయంబు నడంగకున్నఁ | గలదె యూరక బ్రాహ్మణ్యగౌరవంబు? |
23 |
| సీ. |
ఎవ్వఁడు సత్యంబ యెప్పుడుఁ బల్కు హిం | సావిదూరుఁడు గురుజనహితార్థి యింద్రియంబుల నోర్చి యెల్లవారలఁ దన | యట్ల కాఁ జూచు ధర్మాభిరతుఁడు గామంబు దగులండు కర్మంబు లాఱును | సముచిత సంప్రయోజ్యత నొనర్చు నట్టి పుణ్యాత్ముని ననఘు బ్రాహ్మణుఁడని | యనిశంబుఁ గీర్తింతు రమరవర్యు; |
|
| ఆ. |
లార్జవంబు శమము నధ్యయనంబును | బరమధనము సువ్వె బ్రాహ్మణునకు ధర్మగతికి నివియ తగు సాధనంబులు | వేదవిహితముఖ్యవిధులు నివియ. |
24 |
| వ. | ధర్మంబు బహుమార్గదృష్టంబయి సూక్ష్మంబయియుండు; నీవు కేవల స్వాధ్యాయపరుండవు గాని ధర్మ సూక్ష్మత యెఱుంగవు; గావునం దడయక మిథిలానగరంబున కరుగు; మందు జితేంద్రియుండును సత్యవాదియు మాతాపితృభక్తుండును నయినవాఁడు ధర్మవ్యాధుం డను కిరాతుండు నీకు నఖిలధర్మంబులు నెఱింగించి, సంశయచ్ఛేదంబు సేయు; నాదెసం బ్రసన్నుండ వగునది; వనితలకుం బరిజ్ఞానంబు లేదు గావున వా రెట్టి యపరాధంబు సేసినను సహింపవలయుఁ గదా!’ యనినఁ గౌశికుం డి ట్లనియె. | 25 |
| క. |
‘నిను దూఱఁదగదు నీకత | మున నాచిత్తము ప్రశాంతిఁ బొరసెఁ బురంధ్రీ జన వినుత! పోయి వచ్చెద | ననుపమశోభనసమృద్ధు లయ్యెడు నీకున్.’ |
26 |