| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము |
| వ. | అని యా క్షణంబ యమ్మహాద్విజుండు ధర్మవ్యాధ దర్శనలాలసుండై కదలి పతివ్రతయెఱుకకు విస్మయం బందుచు దన్నుం గృతాపరాధునింగాఁ దలంచుచు ననేకనగర గ్రామంబు లతిక్రమించి చని, యనుపమానశోభాసనాథం బయిన మిథిలానగరంబు సొచ్చి, రాజమార్గంబు దఱిసి, యచ్చటి జనంబుల ధర్మవ్యాధుం డున్నయెడ నడిగి, వా రెఱింగింప నట యేఁగి ముందట నల్పమృగమాంసఖండంబు లంగడిం బచరించి యమ్ముచున్నవాని, ననవరత విక్రయాగత జనసమావృతు నక్కిరాతుం గని, యతిజుగుప్సితం బయిన సూనాపణంబు సేర నొల్లక తొలంగి యొక్కయెడ నుండె; నంత. | 27 |
| ఆ. |
వాఁడు నతనిరాక పోఁడిగ నిజబుద్ధి | నెఱిఁగి యతనియున్నయెడకు వచ్చి పరమభక్తిమ్రొక్కి ధరణీసురేశ్వరుఁ | గుశల మడిగి ప్రియము గొనలు నిగుడ. |
28 |
| చ. |
‘అనఘ! నితంబినీతిలక మైన పతివ్రత నా తెఱంగు సె ప్పినఁ జనుదెంచి తీవు ననుఁ బ్రీతిఁ గనుంగొన; నీమనోరథం బును మదిలో నెఱుంగుదుఁ; బ్రమోదముఁ బొందితి; రమ్మ మద్గృహం బున’ కని పల్కి తోడుకొనిపోయె నతండు మహీసురోత్తమున్. |
29 |
| వ. | కౌశికుండును ధర్మవ్యాధునెఱుక కచ్చెరు వంది పతివ్రతయెఱుకయుం దలంచి ‘యిది రెండవు నాశ్చర్యంబు గంటి పొ’ మ్మని తలంచుచుఁదదీయభవనంబున కరిగి వానిచేతంబూజితుం డయి యిష్టకథాప్రసంగంబున నుండి యతని కి ట్లనియె. | 30 |
| తే. |
‘నీవు గడు ధర్మవిదుఁడవు జీవహింస | జీవనంబుగ నడచుట శిష్టపథమె? యకట! యీ ఘోరకర్మంబునకు మదీయ | బుద్ధి దద్దయు దుఃఖంబు వొందె నిపుడు. |
31 |
| వ. | అనుటయు లుబ్ధకుం డి ట్లనియె; ‘బ్రాహ్మణులకుఁ దపస్స్వాధ్యాయ సత్యశౌచబ్రహ్మచర్యంబులును, రాజులకు దండనీతియు, వైశ్యులకుఁ గృషిపశుపాలనవాణిజ్యంబులును, శూద్రులకు శుశ్రూషయు నెట్లు పరమధర్మం బయి చెల్లు; నట్ల మాకును మృగమాంసోపజీవనంబు పరమధర్మంబు; విశేషించి యిది వంశక్రమాగతం బయిన యాచారంబు; విను; మదియునుం గాక యీ దేశంబునకు రాజైన జనకుండు రాజధర్మతత్పరుండయి సకలవర్ణధర్మరక్షణంబు వదలకుండు; నట్లుగాన యాత్మకర్మంబులు విడుచువానిం దనపుత్త్రునైనను దండితుం జేయుఁ గావున నేనును నిజకర్మపరిత్యాగంబు సేయ నోడుదు; నీదృశప్రవర్తనుండ నయ్యును. | 32 |
| తే. |
జీవహింస యెన్నండును జేయ ననఘ! | యొరులు సంపి తెచ్చిన మాంస మొనర విలిచి తగిన వెల కమ్మి బ్రదుకుదుఁ; దద్ధనమున | నమలమానసశాంతి నా యర్థ మెందు. |
33 |
| చ. |
వినయము విస్తరిల్ల గురువృద్ధజనాతిథి విప్ర దేవతా ర్చన లొనరింతు, సత్యమును శౌచము నేమఱ, నీగి మన్ననం దనుపుదు భృత్యబంధుతతిఁ, దాల్మి వహింతు, నసూయఁ జేయ, నెం దును మదిఁ దృష్ణ సొన్పఁ, బరదోషకథావిముఖుండ నెప్పుడున్. |
34 |
| క. |
సతతోపవాసనియమ | వ్రతములఁ జరియింతు నేకవనితాప్రియుఁడన్ ఋతుకాలరతుఁడ నిందా | స్తుతులందు మనంబు నాకుఁ దుల్యత నుండున్. |
35 |
| వ. | అట్లగుటం జేసి హీనయోనిజుండ నయ్యును నిర్మలుండ నైతిం; బ్రసంగవశంబున నింత సెప్పవలసె; నీవు ధర్మబోధార్థంబు నాయున్నయెడకుం జనుదెంచితి గావున నీకు ధర్మవిశేషంబు లెఱింగించెద; నవధానతత్పరుండ వయి యాకర్ణింపుము. | 36 |