| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము |
| ఉ. |
‘ఓరి దురాత్మ! యీ యబల నోడక యేటికిఁ బట్టినాడ వం భోరుహనేత్ర విడ్వు; మెట వోయినఁ బ్రాణము గొందు నింకఁ బ్ర స్ఫారమహీధరప్రకరభంగవిహారధురీణ ముగ్ర దై త్యారుణరంజితోగ్ర కులిశాస్త్రము సు మ్మిదె’ యంచు డాసినన్. |
179 |
| మత్తకోకిల |
ఘోరవిక్రముఁడైన కేశియుఁ గ్రోధఘూర్ణితచిత్తుఁ డై ధీరుఁ డుక్కున నిల్చి యగ్గదఁ ద్రిప్పి వాసవు వైచె; న వ్వీరుఁడున్ గద చూర్ణితంబుగ వ్రేసె నాసుర భంగిఁ బొం గారి దారుణవజ్రపాతరయంబునం బటుహస్తుఁడై. |
180 |
| ఆ. |
అసుర వీఁక నొక మహాచలశృంగంబు | విఱిచి వైచె నమరవిభునిమీఁద గోత్రవైరి ఘోరకులిశాభిహతి వ్రయ్య | నడిచె దానిఁ జదల నదరు లెగయ. |
181 |
| వ. | ఇట్లు దన సాధనంబులు విఫలంబు లైనం దలంకి దానవుం డక్కన్నియ దిగవిడిచి పఱచిన, నింద్రుండు దానిం జేరంజని ‘నీ వెవ్వరిదాన? వీ రక్కసుచేత నెట్లు పట్టువడి?’ తనిన నది యతని కిట్లనియె ‘నయ్యా! యే నరిష్టనేమి యను ప్రజాపతి కూఁతుర, దేవసేనయనుదాన, ధైత్యసేన చెలియల; నేనును మాయప్పయుం గేళికౌతుకంబునఁ దండ్రియనుమతంబు వడసి సఖీజన సహితంబుగా వెడలి యిమ్మానసనగంబు సాను దేశంబులం గ్రుమ్మరుచుండం గేశి నామధేయుం డైన యీ యసురాధముండు. | 182 |
| క. |
పలుమాఱు వచ్చి తన దు | ర్విలసితములు మాకుఁ జూపు వేడుక దోఁపన్ బలుకును మేలమునఁ జెనకఁ | దలఁచుఁ గదియు మదనకదనదళితహృదయుఁ డై. |
183 |
| తే. |
వాని చేష్టలన్నియు దైత్యసేన కభిమ | తంబు లై యుండు; నాకు నెంతయును దుస్స హముల; వినవె! యిమ్మెయిన యక్కమలనయనఁ | గోరి దానవుఁ డెలయించి కొంచుఁ జనియె. |
184 |
| తే. |
అంతఁ బోక వెండియు వచ్చి యింత సేసె | నద్దురాత్ముఁడు నన్ను; మీ దైన కరుణఁ దొడరి దుఃఖసాగరమునఁ బడుట దప్పె’ | ననిన నయ్యింద్రుఁ డనియె నయ్యతివఁ జూచి. |
185 |
| క. |
‘విను, దక్షతనూజలు మా | జననియు మీ తల్లియును; నిజంబుగ మా కీ వనుజ వయితి; వనజానన! | యొనరంగా వేఁడు నీకు నొక వర మిత్తున్’. |
186 |
| వ. | అనిన దేవసేన దేవేంద్రున కి ట్లనియె. | 187 |
| తే. |
‘అనఘ! మాతండ్రి యొక్కనాఁ డతిముదమున | నన్ను నుపలాలనము సేసి ‘నాతి! నీవు ప్రథిత పౌరుషుఁ డగు భర్తఁ బడయు’ దనియె; | నట్టి వానిని నీవు నా కరయవలయు. |
188 |
| చ. |
అనిమిష దానవేంద్రులకు నైన నజయ్యుఁడు, నుగ్రవైరిభం జనుఁడు, త్రిలోకరక్షణవశంవదుఁడున్, భవదిష్టమిత్రుఁడున్ ఘనగుణకీర్తనుండు నగు కాంతునిఁ గోరెద; నా మనోరథం బు నెరయ సంఘటించి సురపుంగవ! నన్నుఁ గృతార్థఁ జేయవే!’ |
189 |
| వ. | అనిన నింద్రుండు దీనికిం బతి యెవ్వం డగు నొకో! యని కొండొక విచారించు నెడ, నమ్ముహూర్తంబు రౌద్ర నామకంబయి సోమ సూర్యసంగమ కారణం బయిన యమావాస్యాముఖం బై యుండం, బూర్వసంధ్యారాగ రక్తాంబుద ప్రతిబింబ పటల పాటలితోదకం బయిన జలనిధి సమీపంబున నమరాసుర సమర సంకులంబుగా నరుణకిరణుం డుదయించుచుండఁ దత్కాలంబున భృగ్వంగిరఃప్రముఖు లైన మునులు వేల్చు హవ్యంబులు మోచికొని హవ్యవహనుండు సూర్యమండలంబు ప్రవేశించుచుండం గనుంగొని, యిది సూర్యసోమాగ్ని సమాగమం బయిన రౌద్ర నామక ముహూర్తంబు గావున సూర్యసోమాగ్ని తేజంబున జనియించిన వాఁడు దీనికిఁ బ్రియుండు గావలయు నని మనంబున నిశ్చయించి, యతం డా క్షణంబ. | 190 |
| క. |
బాలం దోడ్కొని యబ్జజు | పాలికిఁజని మ్రొక్కి త్రిదశపాలుఁడు ‘దేవా! యీ లలనకుఁ దగు వరునిఁ గృ | పాలుఁడవై యొసఁగు’ మనినఁ బద్మజుఁ డనియెన్. |
191 |
| ఉ. |
‘దీపితవిక్రమాస్పదుఁడు దీనికి వల్లభుఁ డయ్యెడుం ద్రిలో కీపరిరక్షణక్షముఁడు గీర్తితమూర్తి యొకండు; వాఁడ మీ యాపదలెల్లఁ బాపుటకునై ధృతిఁ బూను నశేష దేవసే నాపతి భావమున్ విబుధనాయక! శీఘ్రమ భావ్య మింతయున్.’ |
192 |
| వ. | అనినం బ్రీతుం డై పితామహు వీడ్కొని యింద్రుండు సనియెఁ; దదనంతరంబ వసిష్ఠ ప్రముఖులైన సప్త మహామును లమావాస్యాహోమంబు సేయ సమకట్టిన, నమరు లందఱు నందుల హవిర్భాగంబులు గొనుటకు నాసన్ను లగుటయు. | 193 |
| క. |
ఆహవనీయ ముఖంబున | నాహూతుం డై హుతాశుఁ డమ్మును లిడఁగా నాహుతులు గొని దివిజ సం | దోహమునకు వరుస నొసఁగఁ దొడఁగెం బ్రీతిన్. |
194 |