| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
ఆ సమయంబున నమ్మునీంద్రుల భార్య | లందఱు సుస్నాన మొందఁ జేసి రమణీయ మాల్యాంబర విభూషణాద్యలం | కారంబు లొనరించి గారవమునఁ జనుదెంచి పతులకు సన్మతిం బరిచర్య | సేయుచు మెలఁగంగ వాయుసఖుఁడు మెలఁతల వాలిక మెఱుఁగుఁ గన్నుల యొప్పుఁ | దెలినవ్వుమొగముల విలసనములు |
|
| తే. |
నడబెడంగులు నన్నువనడుములందు | వెలయు వళులభావంబులు వలుఁదచన్నుఁ గవల నిక్కును నేర్పడఁ గని, కరంగి | మదనమార్గణ విదళిత హృదయుఁడయ్యె. |
195 |
| వ. | ఇట్లు వికలేంద్రియుండై వైశ్వానరుం డమ్మునిపత్నులయందుఁ దగిలిన డెందంబు మగిడింప నేరక వారలం గదియ నప్పళించి గార్హపత్యకుండంబునం దావేశించి. | 196 |
| చ. |
అతివలు దన్నుఁ జేరుటకు నాసపడుం, బొరిఁ జేరుచోట నా యత విలసచ్ఛిఖాగ్రముల నల్లన వారల నంటుఁ, గౌతుకం బతిశయమై తదంగలత లాదటఁ గౌఁగిటఁ జేర్పఁ గోరుఁ, గం పిత ధృతి యై కలంగుఁ, గడుఁబెల్లగు రాగరసంబు ముంపఁగన్. |
197 |
| వ. | అంత నమ్మునీంద్రుల హోమవిధి సమాప్తం బగుటయు, జాతవేదుండు మదనవేదనాభరంబు సహింప నోపక నిర్జనం బయిన వనంబునకుం జని మునిపత్నీసమాగమంబు దుర్లభంబుగా వగచి వెగడంది శరీరంబు దిగ విడువ సమకట్టు నెడ, తదీయవల్లభ యైన స్వాహాదేవి తత్ప్రకారం బంతయు నెఱింగి, యతనికిం బ్రియంబు సేయునది యై సప్తమునులలో నంగిరసుభార్య శివ యను దాని రూపంబు గైకొని చని, యేకతంబ యున్న హుతాశనుం గనుంగొని యిట్లనియె. | 198 |
| తే. |
‘అంగిరసుభార్య నేను శివాభిధాన; | ననఘ! నాకును నాతోడి యంగనలకు ననుదినంబును నతిమనోహర విలాస | మైన నీమూర్తిపైఁ గోర్కి యడరియుండు. |
199 |
| ఉ. |
నీ మదిచంద మిట్టి దని నిక్క మెఱుంగక మే మజస్రముం గామశరాహతిం గలఁగి కాఱియ వొందుదు మాత్మలందు; నీ కామము మాదెసం గలిమి కౌతుకచేష్టలయం దెఱింగి యు ద్దామ మనోరథప్రచలితస్థితి నందఱముం గ్రమంబునన్. |
200 |
| చ. |
నినుఁ గవయందలంచి యిట నెమ్మిమెయిం జనుదెంచినార మిం పునఁ జెలు లెల్లఁ; దొల్త ననుఁ బొమ్మని పంచిన వచ్చితిన్; మనం బనవరతానురాగమున నంగజకేళి భజింపు మింక నొం డని యెడ సేసితేనిఁ గుసుమాస్త్రుఁడు సైఁపఁడు నన్నుఁ బావకా!’ |
201 |
| వ. | అనిన సంతసిల్లి యగ్నిదేవుండు దానిం గైకొనియె; నదియును నతని నభిమత భోగంబులం బ్రీతునిం జేసి, తదీయ తేజోధాతువు ధరియించి యచ్చోటు వాసి యాక్షణంబ గరుడి యై గగనంబునకు నెగసి యతిత్వరిత గమనంబున శ్వేతపర్వతంబునకుం జని యందొక్కయెడ శరవణస్తంబ సంవృతం బైన కాంచనకుండంబు నందు నిజభర్తశుక్లంబు సంగ్రహించి, మఱియును. | 202 |
| క. |
మునిపత్నులరూపులు గై | కొని యిట్టుల వరుసఁ బుష్పకోమలి ప్రియుఁ బ్రీ తునిఁ జేయుచు రేతస్కం | దన మొనరించుచును వచ్చెఁ దత్కలశమునన్. |
203 |
| తే. |
విను, పతివ్రతాతిలక మై వెలయునట్టి | యయ్యరుంధతి రూపంబు నలవరింప నెట్లు నేరద కాని యయ్యింతి యున్న | యువిద లార్వుర రూపులు నొనరఁ దాల్చె. |
204 |
| వ. | ఇవ్విధంబున నాఱుమాఱులు ప్రస్కందితం బైన యగ్నితేజంబున. | 205 |