పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
ద్రౌపది సత్యభామకుఁ బతివ్రతాధర్మంబులు సెప్పుట (సం. 3-223-1)
క. పతిమనసు నాఁచికొనియెడు | చతురోపాయంబు నీకుఁ జపలాక్షి! సుని
శ్చిత మతిఁ జెప్పెద విను మూ | ర్జితమును ధర్మాన్వితము సుశీలంబునుగన్‌.
313
చ. పతిఁ గడవంగ దైవతము భామల కెందును లేదు; ప్రీతుఁడై
పతి గరుణించెనేనిఁ గలభాషిణి! భాసురభూషణాంబరా
న్విత ధనధాన్యగౌరవము విశ్రుతసంతతియున్‌ యశంబు స
ద్గతియును గల్గు; నొండుమెయిఁ గల్గునె యెన్నితెఱంగు లారయన్‌?
314
ఆ. కరము దుఃఖపడినఁ గాని యొక్కింత సౌ | ఖ్యంబు ధర్మగతియుఁ గలుగ దెందుఁ,
జూడు మబల! భర్తృశుశ్రూష ఫలము సం | తత శుభంబు గలదు, ధర్ము వొదవు.
315
క. కావున నిత్యము సమ్య | గ్భావము ప్రేమంబు వెరవు భక్తియుఁ బ్రియముం
గావింపుము నీ ప్రియునెడ | భావముఁ దా నెఱిఁగి భర్త బాగుగ మరగున్‌.
316
మ. వనజాక్షుండు గడంగి నీ దగు గృహద్వారంబు సేరంగ వ
చ్చెననంగా విని లెమ్ము సంభ్రమముతోఁ జెన్నొందు నభ్యంతరం
బునకున్‌ వచ్చిన నాసనాదికరణంబుల్‌ దీర్పఁ దత్తజ్జనం
బు నియోగించితి నంచు నుండక ప్రియంబుల్‌ సేయు మీవుం దగన్‌.
317
చ. తివిరి మురారి నీకుఁ గడు తీపుగఁ జెప్పిన పల్కు గల్గినం
గువలయనేత్ర! నీ మనసు గూడినవారికి నైన నెప్డుఁ జె
ప్పవలదు; దాన నొండొక నెపంబు ఘటింతు రెఱింగి రేని నీ
సవతులు కృష్ణుబుద్ధి విరసంబగు నీదెసఁ దత్ప్రయుక్తిచేన్‌.
318
చ. పతికి ననుంగు లైన తగు బంధుల మిత్త్రుల భోజనాది స
త్కృతముల నాదరించుచు నకృత్రిమభక్తినియుక్తి సంతతో
త్థితమతివై చరింపుము; తదీయ హితేతరవృత్తు లైన వా
రతివ! భవత్సుహృజ్జనము లైనను గైకొనకుండు మెప్పుడున్‌.
319
క. విను, ప్రద్యుమ్నాది భవ | త్తనయులయెడ నైన నేకతంబున నేకా
సనమున నుండుట దూష్యం | బని యెఱుఁగుము; సతులచరిత లతిదుష్కరముల్‌.
320
క. కులవతులును సతులును ని | ర్మల మతులును నయిన యట్టి మగువలతోడం
జెలిమి యొనరించునది; దు | ర్విలసిత వనితాభియుక్తి విడువుము తరుణీ!
321
వ. ఇది నీకుఁ బరమసౌభాగ్యమూలం బయిన యుపాయం’ బనినం బ్రీతచిత్తయై సత్యభామ యిట్లనియె. 322
సీ. ‘నీవు ధర్మజ్ఞవు, దేవసన్నిభులు నీ | భర్తలు మహనీయ కీర్తిధనులు
ధైర్యతేజోబలశౌర్యసంపన్నులు | గావున వీరికి నే విధమున
ధారుణీరాజ్యంబు సేరెడుఁ దడయక | మీ కెగ్గు సేసిన లోకనింద్య
చరితుండు గౌరవధరణీశువనితలు | దిక్కులే కలమటఁ బొక్కుచుండఁ
 
తే. గని ముదంబునఁ బొందెదు వనిత! నీవు | సుతుల నత్యంతనిర్మలమతుల శౌర్య
యుతులఁ గాంచిన సద్గుణాన్వితవు వగపు | వలదు చిత్తంబులో నీకు జలజనయన!
323
వ. ప్రతివింధ్యాదు లైన నీ పుత్త్రు లేన్‌వురు నిప్పుడు వచ్చి యదుపురంబున నున్నవారు; వారికి నొక్కటం గొఱంత లేదు; రుక్మిణియు సుభద్రయుఁ దక్కినవారలు నక్కుమారుల యెడం దమ కొడుకుల కంటె గారవంబు సేయుదురు; వారి దెస నిశ్చింతవు గ’ మ్మనియె; నయ్యవసరంబునం గృష్ణుండు పాండవుల వీడ్కొని మార్కండేయాది విప్రజనంబు నామంత్రణంబు సేసి గమనోన్ముఖుం డగుటయు, సత్యభామ యాజ్ఞసేనిం గౌఁగిలించుకొని సగౌరవంబుగా వీడ్కొనియె; నంత వాసుదేవుండును బ్రియాసహితంబుగా రథారూఢుం డై ద్వారవతీపురంబున కరిగె; మార్కండేయుండును బాండవేయుల నాశ్వాసించి నిజాశ్రమంబునకుం జనియె; నని చెప్పిన వైశంపాయనునకు జనమేజయుం డి ట్లనియె. 324
క. ‘వనముల ని ట్లనిశంబును | ఘనతర దుఃఖానుభవ వికల్పితు లగుచున్‌
మనుజోత్తము లప్పార్థులు | జననుత! యటమీఁద నెట్లు చరియించి రొకో!’
325
వ. అనిన నమ్మునీశ్వరుం డిట్లని చెప్పెఁ; ‘గృష్ణుండు సనిన యనంతరంబ పాండవులు గామ్యకవన నివాసంబు పరిత్యజించి, యనేక వన శైల నదనదీ విశేషంబు లాలోకించుచు ద్వైతవనంబునకుం జని, యం దున్న యెడం గరిపురంబున నుండి యొక్క బ్రాహ్మణుండు సరసకథాకథనకుశలుండు సనుదెంచి, కౌంతేయులం గని, యుచితసల్లాపంబు సేసి, మగిడి ధృతరాష్ట్రుపాలికిం జనిన, నమ్మహీపాలుండు పాండవుల కుశలం బడుగుటయు, నవ్విప్రుండు వా రేవురు ననవరతశీతవాతాతపకర్శితాంగులై బహుదుఃఖసాగరంబున మునింగియున్న వా రనియు, వీరనాథ యయ్యును ననాథయుం బోలెఁ బాంచాలి పరమశోకార్తయై యున్నది యనియుం జెప్పిన విని, వైచిత్రవీర్యుండు విషణ్ణహృదయుండై కన్నీరు దొరుఁగం గొండొకసేపు వలుక కుండి, పదంపడి నిట్టూర్పు నిగిడించి గద్గదకంఠుం డగుచు నిట్లనియె. 326
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )