పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
దుర్యోధనుని విషాదము (సం. 3-236-1)
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లతిమానుషంబైన యర్జునుపరాక్రమంబును, నత్యంతదైన్యాస్పదం బగు దుర్యోధనుపరాభవంబును, ధర్మజుదయయు నాకర్ణించి, విస్మయ జుగుప్సాకలితమానసుం డగుచు జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 2
చ. ‘అనిశముఁ బాండుపుత్త్రులకు నప్రియకార్యము రోయునట్టి దు
ర్జునుఁడు సుయోధనుం డటులు శత్రులచే నవమానితుండుఁ బే
ర్చినకృప నొప్పుచున్న కురుసింహులచేత విమోక్షితుండు నై
మనమున లజ్జ లేక మునిమండన! యెమ్మెయి నేఁగె వీటికిన్‌?
3
మత్తకోకిల మేనఁ బ్రాణముఁ దాల్చి భంగము మ్రింగి యెప్పటిచాడ్పునన్‌
మానవేంద్రుఁడ నేను దద్దయు మానినన్‌ దలఁ పాత్మలోఁ
బూను టాతని కెట్లు గల్గఁగఁ బోలు నారయ నద్భుతం
బైన తచ్చరితంబు సెప్పుమ యంతయుం బరిపాటితోన్‌.’
4
వ. అని యడిగిన నమ్మహాముని యిట్లను; నట్లు కౌంతేయులచేత బంధమోక్షితుం డై దుర్యోధనుండు లజ్జా కజ్జలితహృదయుం డగుచుఁ జెదరిన సేనలం గూర్చుకొని కొంత దవ్వరిగి యొక్కసమతలంబునం బటమందిరవిరచనంబు నిర్వర్తించి, యభ్యంతరమందిరమ్మున నొక్కరుండును దల్పంబుపయిం బడి చింతాపరవశత్వంబు నొంది, రాహుకబళనకలుషితుం డైన రోహిణీపతియునుంబోలె విషాదవివర్ణుం డయి యున్నయెడఁ గర్ణుండు వచ్చి, సముచితంబుగాఁ గని యన్నరేంద్రున కిట్లనియె. 5
చ. ‘మనుజవరేణ్య! చూడ నతిమానుష మమ్మెయిఁ గయ్య మెందుఁ గ
ల్గునె? పటువిక్రమాన్వితులఁ గ్రోధనిబద్ధులఁ గామరూపులం
జెనయఁగ వచ్చునే ఖచరసింహుల నేరికి?; నట్టివారి నే
పునఁ దునుమాడి గెల్చితి విభూతి యెలర్పఁగ నీవుఁ దమ్ములున్‌.
6
ఉ. అప్పుడు నీవు సూడఁగ ననంతములై ఖచరేంద్రసైన్యముల్‌
గప్పె ననేకసాయకనికాయములన్‌ వడి నన్ను; నేనునుం
గుప్పలు గూల నేసి రిపుకోటి వధించితి; నంతలోన న
న్నొప్పరికించె సైన్యతతి; యొక్కఁడ నై రణభూమి నొచ్చితిన్‌.
7
వ. ఆలోనన విరథుండ నై వికర్ణురథం బెక్కిన నది సమర ప్రదేశంబునకుఁ దొలంగఁ బఱచె; దేవా! నీవు బలవిక్రమాతిశయంబులం బ్రతివీరుల నోర్చి యక్షతుండ వై యుండుటఁ గనుంగొని గృతార్థుండ నైతి; నిట్టి పరాక్రమంబు సేసిన వా రిజ్జగంబున నెవ్వరు గల? రిది యత్యద్భుతం’ బనినం గౌరవేశ్వరుం డాత్మగతంబున ‘నీతండు మత్ప్రకారం బెఱుంగక యిట్లు వలికెం గాకేమి?’ యని లజ్జితుం డగుచు రాధేయున కి ట్లనియె. 8
సీ. ‘అనఘ! తమ్ములు నేను నంబరచరకోటిఁ | దలపడి పోరంగ బలయుగంబుఁ
జచ్చియు నొచ్చియుఁ జలమునఁ బెనఁగె; నా | సమయమ్మునందు విక్రమ మెలర్ప
గంధర్వపతితోడఁ గలిగెఁ గయ్యము నాకు; | నాతని శరములచేత నాజి
నేను నొచ్చితి; వేయు నేల? భార్యానుజ | సుతమిత్త్రజనసమన్వితము గాఁగ
 
తే. నన్నుఁ జెఱగొని గంధర్వనాయకుండు | నెగసె దివమున; కప్పుడు బెగడి చెదరి
పఱచి మనవార లెల్లను బాండుసుతుల | శరణు సొచ్చిరి దైన్యసంభరితు లగుచు.
9
ఉ. వారలయార్తిఁ జూచి జనవంద్యుఁడు ధర్మసుతుండు దమ్ములన్‌
భూరిబలాఢ్యులం బరమపుణ్యుఁడు నన్‌ విడిపింపఁ బంచె; న
వ్వీరులు నుక్కునం గవిసి వీఁకున ఖేచరకోటిఁ దొల్త నిం
పారఁ బ్రియోక్తులం దెలఁచి; రంతటఁ దీరద కార్య మెమ్మెయిన్‌.
10
ఆ. అంతఁ దెగువసేసి యంతకాకారు లై | భీమపార్థయములు భీమబలులు
ఖచరతతులమీఁదఁ బ్రచురబాణౌఘముల్‌ | గురిసి రాహవమున ఘోరభంగి.
11
వ. తదీయబాణపాతంబుల నొచ్చి గంధర్వులు మమ్ముం గొనుచు గగనంబునం బఱచిన, నర్జునుండు వారికిం బోవరాకుండ నతినిబిడబాణజాలంబుల నంబరమార్గంబు నిరోధించినం, జిత్రసేనుండు దనప్రియసఖుండైన శతమఖసుతుం జేరనరిగి కుశలం బడిగిన, నర్జునుండునుంబ్రీతుండైవాని ననునయించి, ‘యీ దుర్యోధనుండు మాతోడంబుట్టువు గావున నితని విడువవలయు’ ననిన నాగంధర్వనాయకుండు. 12
క. మనదుర్మంత్రిత మంతయు | ఘనుఁ డప్పార్థునకుఁ జెప్పి ‘ఘనభుజ! యిది యిం
ద్రుని పను పగుట నవశ్యం | బును నీతని విడువ’ ననియె భూరిబలుం డై.
13
క. కడు లజ్జయు దైన్యంబును | నడరి ముసుఁగు వడఁగ నాకు నాత్మగతమునం
బుడమి వివరంబు లేదే | యడఁగెద నన్నట్టి దయ్యె నప్పుడు కర్ణా!
14
వ. అంతం గౌంతేయులు గంధర్వులం దోడ్కొని ధర్మరాజుపాలికిం జని, మనదుర్మంత్రంబుకతంబున బంధగోచరుండ నయిన నన్ను నయ్యజాతశత్రుముందట నివేదించిన, నతండు విడిచి పుత్తెంచె నిది మదీయ వృత్తాంతంబు. 15
క. ఒవ్వనివారల యెదురన | యివ్విధమున భంగపడితి నే; నింక జనుల్‌
నవ్వఁగ నేటి బ్రదుకుగా | నివ్వసుమతి యేలువాఁడ? నెట్లు చరింతున్‌?
16
ఉ. అక్కట! యమ్మహారణమునందు వియచ్చరకోటితోడఁ బే
రుక్కునఁ బోరి యేను మృతి నొందఁగ నేరన; యట్టు లైన నీ
తక్కువపాటు లేక ప్రమదంబున దేవపదంబు నొందుదున్‌;
మిక్కిలి యైన కీర్తియును మేదినియందు వెలుంగు నిత్యమై.
17
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )