పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
దుర్యోధనుండు ప్రాయోపవేశంబు సేయఁబూనుట (సం. 3-238-10)
వ. కావున నిట్టి దురవస్థపాలైతి; నేను ప్రాయోపవేశంబునఁ బ్రాణపరిత్యాగంబుఁ జేసెద; మీరందఱు దుశ్శాసనుం బురస్కరించుకొని పురంబున కరుగునది; మిత్రులకుఁబ్రమోదంబును శత్రులకు నిర్వేదనంబునుం జేయుచు మను నట్టియేను నేఁడు పోఁడిమిసెడి, పగతురచేత శిరస్తాడనంబు సేయంబడి సిగ్గువడక బంధు జనంబులలోని కేమని యరుగుదు? నాంబికేయుం గని యే మని పలుకుదుఁ? గురువృద్ధు లైన భీష్మబాహ్లికులయు నాచార్యులయిన కృప ద్రోణులయు సమ్ముఖంబున నెట్లు నిలుతుఁ? బరిజనులుం బౌరులుం బురోహితులు నన్నుం గనిన నేమని సంభాషింతు? నిది యాత్మదోషంబున నైన యపాయంబు, నా కవశ్యభోక్తవ్యంబు. 18
క. విను దుర్వినయాత్మకుఁ డగు | జనుఁ డుజ్జ్వల మైన సిరియు సద్విద్యయుఁ గ
ల్గిన నందు మెలఁగనేరక | చెనఁటి తెఱంగునకుఁ జొచ్చి చెడిపోవుఁ దుదిన్‌.
19
క. అకటకట యిట్టికష్టము | నకు వచ్చితి నయ్య యేను; నన్నటె వైరి
ప్రకరము లనిఁ బట్టినఁ గృప | నొకరుఁడు విడిపించె దైవ మోపదె యెట్లున్‌.
20
క. మానము సెడియును నిమ్మై | మేనం బ్రాణంబు లెట్లు మేకొని తాల్తుం?
గాన యిది నిశ్చయముగాఁ | బూనితి నాతెగువ మాన్పఁ బోల దొరులకున్‌.’
21
వ. అని పలికి సమీపగతుం డయిన దుశ్శాసను నాలోకించి యమ్మహీపాలుం డి ట్లనియె. 22
సీ. ‘అన్న! దుశ్శాసన! నిన్ను రాజ్యమునకుఁ | బట్టంబు గట్టెదఁ బతివి గమ్ము;
శకునికర్ణులు దీర్పఁ బ్రకటవసుంధరా | వలయమంతయు మహోజ్జ్వలత నేలు;
భ్రాతృవర్గమునకుఁ బ్రీతి సేయుము; బంధుఁ | జనుల బోషింపుము; సద్ద్విజులకు
నుత్తమంబుగఁ దగువృత్తులు సెల్లింపు; | గురుజనంబుల భక్తిఁ గొలువు మెపుడు;
 
తే. నింద్రుఁ డమరగణంబుల నేలునట్లు | ధరణి పతుల నేలుము; బాహుదర్ప మొప్పఁ
బగఱ నుక్కడఁగింపుము; పరమమిత్త్రు | లైన శూరులఁ గొనియాడు మర్హభంగి’.
23
వ. అనిన నమ్మాట దనహృదయంబునకు నిశితశూలంబయిన, నతండు నిలువ నోపక యగ్రజు పాదంబులపయిం బడి, ‘దేవా! యిట్లానతీఁ దగదు; నాకుం బ్రసన్నుండ వగు’ మని నిజనేత్రజలంబులం దదీయ చరణయుగళం బభిషేకించుచు నిట్లనియె. 24
చ. ‘అవని విదీర్ణ మైనను, హిమాద్రి చలించుట గల్గినన్‌, మహా
ర్ణవ మది యింకినన్‌, దివసనాథుఁడుఁ జంద్రుఁడు దేజ మేదినం,
గువలయనాథ! నీకు నొక కుత్సితభావముఁ గల్గ నేర్చునే!
భవదుపయోగ్య మైన నృపభారము నాకు వహింప శక్యమే?
25
క. హితు లైనవారిఁ బ్రోచుచు | సతతంబును రిపుల నెల్లఁ జమరుచు నిఖిల
క్షితితలము నీవ యేలుము | శతసంవత్సరము లధిప! జయశీలుఁడవై.’
26
వ. అనుచునయ్యువరాజు దుఃఖాతిభారవిహ్వలుండై యెలుంగెత్తి యేడ్చిన, నయ్యన్నయుంగన్నీరొలుక నూరకుండె; నప్పుడు కర్ణుండు వారలంజూచి’ యిట్లేల బాలిశులుంబోలెనేడ్చెదరు? ధైర్యంబులు ధరియించి శోకవ్యసనంబులు విడువుండు; శోకశీలురం జూచి పగతురు సంతసిల్లుదురు; శోకశీలురకుఁ బైపై శోకంబులు వొందు’ నని దుర్యోధనుం బేర్కొని యిట్లనియె. 27
క. ‘ఒకయల్పమనుజు క్రియ సో | మకులోత్తమ! నీకు నిట్లు మహనీయసుఖ
ప్రకృతి యగు నిజశరీరం | బకట! విడువఁ దలఁపనగునె? యవిహితబుద్ధిన్‌.
28
తే. శోకమగ్నుండ వగు నిన్నుఁ జూచి బెగడి | యధిప! నీతమ్ములును నేను నధికదుఃఖ
వహ్ని పాల్పడ మయ్య! మావలనఁ గరుణ | గలిగి తీర్పవె యిందఱఁ గౌరవేంద్ర!
29
వ. పాండవులచేత విముక్తుండ నైతి నని వగచె; దంతియకాని నీకుం గార్యగతియందు వివేకంబు సాల; దది యెట్లనిన, నేరాజు రాజ్యంబున నిశ్చింతు లయిన జనులు తమతమ జీవనంబుల వర్తింతు రారాజునకు నట్టిజనులుబంట్లు; గావునఁదా రమ్మహీపతికిం దీఱమిగల్గిన చోట్ల నెల్లనుందమపౌరుషంబులు నెఱపవలయుఁ; గౌంతేయులు నీదేశంబున నుండి నీయాజ్ఞవలనం గృతారంభులై యున్న వా రగుటంజేసి వారు నీకింకరులు; నీకునైన యక్కఱ దీర్చుట వారి కర్హ కృత్యంబు; దీని కింత వనర నేల?; యదియునుంగాక పాండవులు జూదంబునాఁడ నీకు దాసు లైరి; తదీయంబు లైన మణికనకాదివస్తువులును భవదధీనంబులై యున్నయవి; వారు నిన్నుం గొలిచియుండుట లేకుండెనేనియు నింతటి కెలసంబు దీర్ప నేనియు వలదే; యిది యంతయు నూహించి వలవనివగలం బొగులక లెమ్ము! పురంబునకు నడువుము; నామాట వినక నిర్బంధపరుండ వైతేనియు ని న్నేమనవచ్చు; నిందఱము నీపోయిన గతిన పోవంగలవారము; నీవు లోకంబు చేత నగుఁబాటును బొందెద; వింతియ’ యని కర్ణుండు సెప్పిన విని దుర్యోధనుండు వెండియుం బ్రాయోపవేశంబునందు నిశ్చయంబు వదలకున్నం గనుంగొని శకుని యి ట్లనియె. 30
క. ‘కర్ణుని యాడిన మాటలు | నిర్ణయమున కింత యొప్పునే! యిప్పలుకుల్‌
కర్ణంబులఁ జొనుపుము; దుః | ఖార్ణవపారంబుఁ బొందు మవనీనాథా!
31
తరలము కడఁగి బుద్ధిబలంబునంద యకంటకంబుగఁ జేసి యేఁ
బుడమిరాజ్యము సర్వముం దగఁ బుచ్చి యిచ్చిన నిమ్ములం
గుడువ నేరక దీని నిచ్చటఁ గూలఁ దన్ని శరీరమున్‌
విడుతుఁ గా కని నిశ్చయించెదు వెఱ్ఱి వైతె నరేశ్వరా!
32
ఆ. నీకు వృద్ధసేవ లేకున్కి యిప్పుడు | నాకుఁ దెల్లమయ్యెఁ బ్రాకటముగఁ
గోపమును మనోనుతాపంబుఁ బొందుచో | ధీరుఁ డపుడ యడఁప నేరవలదె.
33
తే. పిఱికితనము నేమఱుటయు నొఱువతనము | మెత్తఁబాటును గార్యంబు నత్తెఱంగు
నేరమియు విషయంబులఁ గూరుటయును | గలుగు పతికి నుండదు సిరి దొలఁగి పోవు.
34
వ. కావునఁ గార్యజ్ఞుండ వగుము; కార్యజ్ఞానం బెట్టి దనిన. 35
ఉ. కౌరవనాథ! నీకు నుపకారము సేసిరి పాండవేయు ల
వ్వీరులయందు నెయ్యమును వేడ్కయు నొప్పఁగ నీ వభీష్టస
త్కారముసేఁత యుక్తమగుఁ గాక ప్రియంపడ నర్హమైనచో
దారుణశోకవహ్నిపరితాపముఁ బొందుట యిప్డు ధర్మువే?
36
చ. కృతముఁ దలంచి చిత్తమునఁ గిల్బిషమంతయు నుజ్జగించి స
న్మతులఁ బృథాతనూజుల నమానుషతేజులఁ బిల్వఁ బంచి, త
త్పితృధన మైన రాజ్యము నభీష్టముగాఁ దగ నిమ్ము; నీకు నీ
క్షితివలయంబునం బరమకీర్తియుఁ బుణ్యముఁ గల్గు భూవరా!
37
క. వారలు నీతోఁబుట్టువు; | లీరాజ్యము మీరు వారు నేకం బై పెం
పారఁగ నేలుఁడు; దీనం | గౌరవకులనాథ! సౌఖ్యగౌరవ మొందున్‌.’
38
వ. అని శకుని చెప్పుచుండ నగ్గాంధారీనందనుండు నిజచరణసమీపంబునం బడి యున్న దుశ్శాసనుం గ్రుచ్చి యెత్తి మూర్ధాఘ్రాణంబు సేసి కర్ణసౌబలులం జూచి ‘మీ రేల నన్నుఁగారించెదరు? ధర్మైశ్వర్యధనభోగంబులందు నా కభిలాషంబు లేదు; ప్రాయోపవేశంబునందుఁ గృతనిశ్చయుండ నైతి; మీ రింక నొండు విఘ్నంబులు సేయక యూరక మీ వలయునెడకుం బొం’ డనిన వారలు ‘దేవా! నీవిధం బిట్టిద యయ్యె నేని మే మెందుఁ జేరెదము? నీతోడివారము కాక’ యని; రంతం గమలహితుండు పశ్చిమాచల సమీపగతుం డగుటయు నన్నరనాథుండు సురలోకగమనకుతూహలి యై శుచిస్నానంబు సేసి వల్కలంబులు ధరియించి, సంధ్యాసమయ సముచితంబులగు కరణీయంబులు నిర్వర్తించి, వివిక్తదేశంబునందు దర్భాస్తరణంబున నాసీనుండై వాఙ్నియతుండై. 39
క. క్రమమున బాహ్యేంద్రియక | ర్మము లెల్లను వదల విడిచి మహిత సమాధి
క్రమదశ నుండె నివాత | స్తిమితంబై వెలుఁగుచున్న దీపము పోలెన్‌.
40
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )