పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
శ్రీరాముఁడు కబంధుఁ డను రాక్షసుం జంపుట (సం. 3-263-27)
సీ. ‘మహనీయసామ్రాజ్యమహిమ వాయుటయును, | బితృమరణంబు, నాభీలవిపిన
భూములఁ గడుదుఃఖమునఁ జరించుటయు, వై | దేహిఁ గోల్పడి వగఁ దిరుగుటయును,
దుదిఁ బోయి యే నిట్టు దొడరి యీ దానవు | వాతఁ జిక్కుటయును వగవ నీకుఁ
బైపయిఁ బెక్కులాపద లయ్యె నక్కట! | ధరణీశ! నీవు నా ధరణిసుతయుఁ
 
ఆ. గలసి పూజ్యరాజ్యగౌరవంబున వెలుఁ | గంగ నెలమిఁ జూడఁ గాన నైతి
నేను దలఁప నెట్టి హీనభాగ్యుండనో!’ | యనుచు ననుజుఁ డార్తి నడలుటయును.
359
తే. విగతసంభ్రముఁ డై రామవిభుఁడు గడఁగి | ‘యన్న! లక్ష్మణ! యోడకు మన్న, యేను
గలుగ నీ కేల యాపద గలుగనేర్చు? | ననుచు గ్రక్కున నిశితమహాసి వెఱికి.
360
వ. ఆ రక్కసు డాచేయిఁ దునియ వ్రేసిన లబ్ధమోక్షణుండయి లక్ష్మణుండు ప్రకటసైంహికేయ దంష్ట్రాయంత్ర విముక్తుండయిన తిగ్మభానుండునుంబోలెఁ బ్రదీప్తుండయి తీక్ష్ణకౌక్షేయకంబునఁ దదీయ దక్షిణబాహు ఖండనంబు సేసి పార్శ్వద్వయంబు భేదించిన నాక్షణంబ కబంధుఁడు దివ్యరూపధరుం డగుటయుం గని రాఘవుండు విస్మితుండై. 361
క. ‘ఈవనమునందు రాక్షస | భావంబున నున్న నీకుఁ బ్రకటితదివ్య
త్వావాప్తి యైన కారణ | మేవిధ?’ మనుటయును నాతఁ డిట్లని చెప్పెన్‌.
362
వ. ఏను విశ్వావసుం డను గంధర్వుండ; బ్రహ్మశాపంబునం జేసి రాక్షసత్వంబు నొంది మీవలన శాపమోక్షంబు వడసితి; రావణుం డను రక్కసుండు జానకిం గొనిపోయి, లంకానగరంబున నునిచినవాఁడు; మీకు హితోపదేశంబు సేసెద; నిట పోవంబోవఁ బంపాభిధానం బయిన సరోవరంబు గలదు; దాని యావల ఋశ్యమూకం బనుశైలంబునందు వాలిసహోదరుండు సుగ్రీవుం డను వానరుండు సచివ చతుష్టయ సహితుండై యుండు; నతనితోడ సఖ్యంబు సేయుము; దానం జేసి నీకుఁ గార్యసిద్ధి యగు’ నని పలికి గంధర్వుండు వారి వీడ్కొని నిజేచ్ఛం జనియెఁ; దదనంతరంబ యట చని చని. 363
సీ. కమనీయకమలినీకహ్లారదళకేస | రాన్వితజలముల నర్ఘ్యవిధియుఁ,
దరళతరంగహస్తములఁ బాద్యంబు, ను | న్మద చక్రసారసమధుపహంస
రుతులఁ బ్రియోక్తులు, రుచిరవానీర ని | వేశనచ్ఛాయల విశ్రమంబు
మందసంచారితమారుతంబుల నురు | తాపనోదనమును దగిలి యెపుడు
 
ఆ. నాచరించుచును సమంచితాతిథి జన | సేవనమునఁ దనదుజీవనంబు
ఫలము నొంద నొప్పు పంపాసరోవరం | బెదురఁ గాంచి రన్నరేంద్రసుతులు.
364
వ. ఆ సరోవరతీరంబునం గౌసల్యానందనుండు తత్తద్విషయవిశేషోల్లాసంబులవలనం గ్రొత్తయై చిత్తజానలంబు దరికొని చేతోవృత్తంబు నెరియింపం దొడంగినఁ దాల్మి దొఱంగి జానకిం బేర్కొని యాక్రందనవచనవివశుం డగుటయు, నతనికి లక్ష్మణుం డి ట్లనియె. 365
చ. ‘పురుషవరేణ్య! యిట్లు మిముబోఁటులకుం జనునయ్య? యాపదల్‌
వొరసినచోఁ గలంగుట; ప్రభుత్వ మెలర్పఁగఁ దాల్మి యూఁది దు
స్తరతరమానసవ్యథలు దల్గుము; సంభృతపౌరుషుండ వై
యరయుము దేవి యున్నయెడ యారసి కార్యము దీర్పు నేర్పునన్‌.
366
ఆ. అధిప! శిష్యుఁడను సహాయుండు భృత్యుండ | నైన యేను గల్గ నాత్మ నీకు
నేల వగవ?’ నని మహీపతిచిత్తంబు | నలఁత డిందుపఱిచె నవరజుండు.
367
వ. తదనంతరంబ యయ్యిరువురుం బంపాసరోవరంబునం గృతస్నాను లయి దేవపితృతర్పణంబులు సేసి చని ముందట నతిబహుళబలాహకవ్యూహసన్నాహసమున్నతంబు లైన యభంగోత్తుంగ శృంగసముదయంబుల నఖిలగగన క్రోడపీడనంబు సేయుచున్న దాని ఋశ్యమూకశైలంబుఁ జేరి తదుపకంఠప్రదేశంబున విశ్రమించి యున్నంత. 368
సీ. ఆ రాజపుత్త్రుల నారూఢతేజుల | వీరుల నున్నతోదారభుజులఁ
గనుఁగొని సుగ్రీవుఁ డనఘుఁ డగ్గిరిశృంగ | ముననుండి తానును దన సచివులుఁ
జింతించి వారివృత్తాంతము నెఱుఁగంగ | సంతతోత్సాహు ధీమంతు శౌర్య
వంతు నుత్తము హిమవంతునిఁబోని య | త్యంతసుస్థిరు హనుమంతుఁ బనిచె;
 
ఆ. నతఁడు నరిగి నృపతిసుతులతెఱం గెల్ల | నెఱిఁగి వనచరేంద్రు నెఱుఁగఁ జెప్పి
యుగ్రతేజుఁ డైన సుగ్రీవుతోఁ జెల్మి | యొనర సంఘటించె మనుజపతికి.
369
వ. సుగ్రీవుండును మున్ను సీతాపరిత్యక్తంబై తమ ముందటం బడినం దారు గైకొని సంగ్రహించియున్న భూషణ నిచయంబు రామునకు నివేదించినంజూచి, యతండు సముత్సుకుండై వానికి వానరైశ్వర్యంబు ప్రతిశ్రుతంబు సేసి తదీయశత్రుం డైన వాలిం జంపఁ బ్రతిజ్ఞ సేసెఁ; గపీశ్వరుండును జానకిం దెచ్చుటకు సహాయంబుగా నొడంబడియె; నంతట నందఱుం గూడికొని వాలి నివాసం బైన కిష్కంధానగరంబున కరిగి; రప్పుడు భానుసూనుండును. 370
క. వాలిగృహద్వారంబున | వాలి మదం బెసఁగ నార్చి వారక బాహా
స్ఫాలనము సేయుటయు విని | వాలి మహారోషదుర్నివారోద్ధతుఁ డై.
371
వ. సమరసన్నాహం బమర వెలువడంబోయినఁ దదీయవల్లభ యగు తార యతని వారించి యిట్లను; ‘నేఁటిచందంబు సూడ సుగ్రీవుండు బలవత్సహాయుండై వచ్చినవాఁ; డది యెట్లనిన దశరథనందనుం డైన రాముండు రావణుచేత నపహృతదారుం డయి, నిజసహోదరుం డగు లక్ష్మణుండును దానును సుగ్రీవ సహాయత్వం బపేక్షించి యతనికార్యంబు దీర్పంబూనె నని వింటి; నదియునుంగాక మహాబలు లైన మైందద్వివిదులు నతిలోకపౌరుషుం డయిన హనుమయు బ్రసిద్ధబుద్ధి యగు జాంబవంతుండును వానికి మంత్రులై యుండుదురు; గావున నీ విప్పుడు గయ్యంబునకుఁ బోక నా కిష్టంబు గా’ దనిన, నవ్వుచు నవ్వనచరవీరుండు. 372
క. ఆ వనిత వచనములు సు | గ్రీవవిషయపక్షపాతకృత్రిమములుగా
భావించి యాదరింపక | తా వెడలె ననూనబాహుదర్పం బెసఁగన్‌.
373
వ. ఇట్లు వెడలి కట్టెదుర నున్న సుగ్రీవుం జూచి యి ట్లనియె. 374
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )