పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
శ్రీరాముఁడు రావణాసురుని సంహరించుట (సం. 3-274-24)
సీ. కమనీయకనకపుంఖప్రభాభాసియుఁ | దీక్ష మ్ణుఖంబును దివిజయక్ష
మునిసిద్ధసాధ్యసమ్మోదావహంబు నై | విలసిల్లు బాణ మవ్వీరవరుఁడు
గైకొని బ్రహ్మాస్త్రకలితమంత్రాభియు | క్తంబుగా నొనరించి కార్ముకమున
సంధించి జగములు జయపెట్టఁ జెచ్చెరఁ | దివిచి యేయుటయును దీవ్రభంగిఁ
 
ఆ. గడఁగి యాశరంబు గల్పాంతవహ్నియ | పోలెఁ బంక్తికంఠుఁ బొదివి నీఱు
గా నొనర్చె సూతఘన రథరథ్య స | మన్వితముగ నొక్కమాత్రలోన.
151
వ. అప్పు డంబరంబున దివ్యతూర్యనాదంబులు సెలంగం గలంగి యసురు లెల్లఁ దొలంగిరి; గంధర్వగానంబులు నప్సరోనర్తనంబులుఁబ్రవర్తిల్లె; నింద్రాదిదేవోత్తము లన్నరదేవోత్తముం బ్రస్తుతించుచుం బ్రమోదంబు నొందిరి. 152
క. ఏకోత్సవంబు లయ్యెఁ ద్రి | లోకంబులు నఖిలలోకలుంటాకుఁడు ఘో
రాకారుఁడు దశవదనుఁడు | గాకుత్‌స్థనిశాతశరముఖంబునఁ బడినన్‌.
153
ఉ. అంత ననంతకీర్తి శరణాగతరక్షణశాలి రాఘవుం
డెంతయు వేడ్కతోడ నసురేంద్రుపదంబున నవ్విభీషణున్‌
సంతతపుణ్యుఁ బుణ్యజనసంతతివర్ధనుఁ గట్టెఁ బట్ట మ
త్యంతదయాంతరంగుఁడు గృతాహితభంగుఁడు దానుఁ దమ్ముఁడున్‌.
154
వ. తదనంతరంబ యవింధ్యుండు విభీషణసహితుండై జానకి నుచితయానంబున నునిచికొని రామదేవు పాలికిం దెచ్చి ‘దేవా! దేవిం బరిగ్రహింపు’ మని విన్నవించిన నతండు. 155
చ. అతిమలినాంగి జీర్ణమలినాంబరధారిణి సంతతాశ్రుపం
కితవిలసత్కపోలఁ బరికీర్ణజటాయితకేశభార నా
యతఘనదుఃఖదూషితఁ బ్రియాంగనఁ గన్గొని యప్రియాత్ముఁడై
నుతచరితుండు దద్దయు మనోవ్యథ సేయుచు నింతి కిట్లనున్‌.
156
సీ. ‘అధికదుష్టాచారుఁ డైన దశాననుఁ | డింతకాలము తనయింటఁ బెట్టి
కొనియున్న నిన్నుఁ గైకొనిన నస్మచ్చరి | త్రమునకుఁ దొడరదే ధర్మహాని?
పరిభవంబునకునై ప్రతికారముగ వైరిఁ | గూల్చితిఁ గాని నీకొఱకుఁ గాదు;
మెలఁత! నీ చరితంబు మేలైనఁ గీడైనఁ | గానిమ్ము, నిన్ను నిక్కముగ నొల్లఁ;
 
ఆ. బరఁగఁ గుక్కవాతఁ బడిన హవ్యముభంగి | యయ్యె నీ తెఱంగు నరయ నిపుడు;
గాన యిచటఁ దడయఁ గాదు; చెచ్చెర నీకు | నిష్టమయిన యెడకు నేఁగు మతివ!’
157
ఆ. అనినఁ జెవులఁ గొఱవి గొని చూఁడినట్లైనఁ | దాల్మి పెల్లగిల్లఁ దరళనయన
మొదలు నఱక నొఱగు కదళిచందంబున | నెలఁత దల్లడమున నేల వ్రాలె.
158
క. వెఱఁగుపడి హర్షరాగము | తఱిఁగిన వెలువెల్లనై వదనములు వ్రాలం
దెఱఁగేది ఱిచ్చపడి ర | త్తఱిఁ దత్పరిజనము లెల్లఁ దద్దయు వంతన్‌.
159
తే. పడఁతి యల్లన మఱికొంతవడికిఁ దెలిసి | యలసమూర్తియై దందడి నశ్రు లురులఁ
గేలు ముకుళించి వసుమతీపాలుఁ జూచి | యెలుఁగు గుత్తుకఁ దగులంగ నిట్టు లనియె.
160
క. ‘నినుఁ గీడు వొరయకుండఁగ, | జనులకు నా నిక్క మెక్క జననాయక! యే
ననలంబుఁ జొచ్చి వెడలెదఁ; | గనుగొను; మిచ్చనవు నాకుఁ గరుణింపు దగన్‌.
161
ఉ. నాదగుబుద్ధి నీదు చరణస్మరణంబ యొనర్చుఁ గాని యొం
డేదియు నెన్నఁడుం దలఁప; దిట్టిద; యొండొకచందమైన ని
మ్మేదినియుం గృశానుఁడు సమీరుఁడు శీతకరుండు నర్కుఁడుం
గా దన కీక్షణంబ ననుఁ గాల్పరె; వేల్పులు చెట్ట సైతురే?’
162
వ. అని పలుకుటయు నప్పుడు పృథివ్యాదిభూతంబు లెలుంగులు సెలంగ నెల్లవారును వినం దమదమ నామంబు లెఱింగించి యి ట్లనిరి. 163
క. ‘విను ముత్తమురాలు సుమీ | జననాయక! జనకతనయ; సందేహపడం
బనిలేదు మాకుఁ దెల్లము; | జనులకు మము మొఱఁగరాదు సకలక్రియలన్‌.
164
వ. అనిన యనంతరంబ సకలసురముని గణసహితంబుగాఁ బితామహుండు సనుదెంచి రాఘవుచేత సత్కృతుం డై యిట్లనియె: ‘నయ్యా! నీవు సకలభూతదుస్సహుండైన రావణుం బరిమార్చి లోకహితంబు సేసితివి; వినుము! నలకూబరుశాపంబునంజేసి దశగ్రీవునకుఁ బరస్త్రీలయందు బలాత్కారంబు సెల్లదు; గావున నీధర్మపత్నియం దొక్క దురితంబును బొరయదు; నీవు నిర్విచారుండ వై యిప్పతివ్రతం బరిగ్రహించి నెమ్మదిఁ బురంబున కరుగు’ మని పలికి, యతనికిఁ బ్రియంబుగాఁ దత్సమరనిహతు లైన వానరులఁ బ్రాప్తజీవులం జేసి పరమేష్ఠి సనియెఁ; బురందరసారథియును దాశరథి వీడ్కొని హరిసహస్రయుక్తం బైన రథంబు గొని నాకలోకంబున కరిగె; నంత. 165
మ. అవిరోధంబుగ జానకీసహితుఁడై యాబద్ధరత్నప్రభా
నవపుష్పంబగు పుష్పకం బను విమానం బెక్కి యర్కాన్వయ
ప్రవరుం డిమ్ముల నేఁగె సమ్మదభరప్రాగ్భాగవారాకర
ప్లవమానుం డగుచుం బురంబునకుఁ బ్రాప్తశ్రీవిశేషోన్నతిన్‌.
166
వ. ఇ ట్లరిగి భరతాదిబంధుజనంబులు నఖిలపరిజనంబులు నభినందింప వసిష్ఠవామదేవవిహితం బయిన యభిషేకశోభనంబు వహించి రాముండు సుగ్రీవవిభీషణాది సుహృజ్జనంబులం బ్రకటబహుమానవిశేషంబుల నాదరించి వీడ్కొలిపి, యభిమతభోగంబుల నిరంతరత్యాగంబులఁ బ్రభూతయాగంబులఁ బ్రసిద్ధుం డయి బహుసహస్రసంవత్సరంబులు వసుమతీరక్షణం బొనర్చె; నిది రాఘవుచరిత్రంబు. 167
ఉ. వారక యిట్లు పూని వనవాసనిరంతర దుఃఖమున్‌ మహా
వైరికృతాపకారదురవస్థయు నోర్చి శుభంబు నొందఁడే
యారఘురాముఁ; డట్లు వసుధాధిప! నీవును దుఃఖ మింతయున్‌
సైరణ నోర్చి పొందెదవు సర్వమహీవలయాధిరాజ్యమున్‌.
168
వ. అని చెప్పిన విని యుధిష్ఠిరుండు రాముని పరాక్రమవిశేషంబు గొనియాడి, ‘జానకి పాతివ్రత్యమహిమ యింత యొప్పునే!’ యని పలికి, ‘మునీంద్రా!, పతిభక్తితాత్పర్యంబున నఖిలదుఃఖంబులు నోర్చి శుభంబు నొందిన పుణ్యసతిచరిత్రంబు వినవలతుం జెప్పవే!’ యనిన నతనికి మార్కండేయుండు ‘సావిత్రి యను రాజపుత్త్రిచరిత్రంబు విను; మది నీ ప్రశ్నంబునకు నుత్తరం బగు’ నని యిట్లనియె. 169
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )