పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
మార్కండేయుఁడు ధర్మరాజునకు సావిత్ర్యుపాఖ్యానంబు సెప్పుట (సం. 3-277-5)
సీ. కలఁడు మద్రేశుండు ఘనుఁ డశ్వపతి యను | ధరణీశుఁ; డతఁడు సంతానకాంక్ష
నెంతయు ధృతిఁ బదునెనిమిది యేఁడులు | సావిత్రిఁ గొల్చె; నజ్జనవిభునకు
నద్దేవి ప్రత్యక్షమై ‘వర మడుగుము’ | నావుడు నతఁడు వినమ్రుఁ డగుచు
‘నాత్మజుఁ గోరెద’ ననవుడుఁ ‘గన్నియ | పుట్టు నీ’ కనియె నా భువనమాత;
 
తే. యనుడు ‘దేవి! భవత్కృప నస్మదీయ | వాంఛితము సఫలంబు గా వలదె?’ యని నృ
పోత్తముఁడు విన్నవించె; నయ్యోగమూర్తి | గాఢకారుణ్యవికచహృత్కమల యగుచు.
170
వ. ‘ఏను నీమనోరథంబుతెఱంగు మున్న చతుర్ముఖున కెఱింగించిన నతండు గన్నియఁగా నిర్దేశించె; నద్దేవునియానతి యమోఘంబు; విను మక్కన్నియ కారణంబున నీకు నొక్కవిధంబునం బిదపఁబుత్త్రశతలాభంబు నగు; సంతసిల్లు’ మని యనుగ్రహించి యద్దేవి యంతర్ధానంబు నొందె; నశ్వపతియును సావిత్రీప్రసాదంబున నిజధర్మపత్ని యయిన మాళవియందు సావిత్రి యను కూఁతుం గని, యక్కన్నియ నతిగౌరవంబునం బెనిచె నంత. 171
క. ఆ వనజాక్షి పరిస్ఫుట | యౌవనయై సిద్ధసాధ్యయక్షామరక
న్యావలిఁ దన సౌందర్య | శ్రీవిలసనరేఖ నపహసించుచు నొప్పెన్‌.
172
తే. ‘కోరి జనపతి దనకూర్మికూఁతుఁ జూచి | గుణవయోరూపముల ననుకూలుఁ డైన
భర్త నెమ్మెయి దీనికిఁ బడయువాఁడ | నొక్కొ!’ యని యెందుఁ దడవుచునుండె నెలమి.
173
వ. అదియును సాళ్వపతి యైన ద్యుమత్సేనుకొడుకు సత్యవంతుండు రూపవంతుం డనియును గుణవంతుం డనియును విని వానియందుఁ జిత్తంబు దగిలి యున్నను సిగ్గుపెంపున నెవ్వరికి నెఱింగింపకుండె; నంత నొక్కనాఁడు మద్రపతికడకు నారదుం డరుగుదెంచిన నతం డమ్మహాముని నుచితసపర్యాపరితోషితుం జేసి సద్గోష్ఠీవిశేషంబులు సలుపుచున్నయెడ. 174
క. నెచ్చెలులు దన్నుఁ గొలువఁగఁ | బచ్చవిలుతుకలిమి యెల్లఁ బద్మానన యై
యచ్చుపడినట్లు మెఱయుచు | నచ్చటి కేతెంచె భూవరాత్మజ నెమ్మిన్‌.
175
వ. ఇట్లు వచ్చి సఖీజనంబు నంతంత నిలిపి మెలపుతోడి పొలుపున నమ్ముగ్ధ లీలామధురం బగుచుండఁ దండ్రికి మ్రొక్కిన, నతండు గాఢస్నేహదోహళం బగు చిత్తంబుతో నత్తన్వి గ్రుచ్చియెత్తి నిజాంకతలంబున నునిచికొని సముచితోపలాలనకేళీపరవశుం డయ్యె; నప్పుడు నారదుం డమ్ముద్దియం జూచి యశ్వపతితోడ ‘నిక్కన్నియం దగినవరున కొసంగక యి ట్లేల యునిచినవాఁడ?’ వనిన నతండు గూఁతున కి ట్లనియె. 176
తే. ‘తల్లి! నీగుణరూపవృత్తముల కెందుఁ | దగినవరు నీవ యిమ్ముగఁ దడవి నెమ్మి
నీదు మనసున కెక్కిన నృపకుమారుఁ | గోరి వరియింపు; మిదియ నాకును బ్రియంబు’.
177
వ. అనిన నదియుఁ గొండొక లజ్జించి కోర్కిపెంపున సిగ్గు దొలంగం ద్రోచి ప్రకటకౌతూహల తరళితాంతరంగ యగుచుఁ దండ్రి కిట్లనియె. 178
క. ‘చిరకీర్తి సాళ్వభూవరు | వరతనయుం డయిన సత్యవంతుఁడు నాకున్‌
వరుఁడుగఁ గోరుదు మదిలో | నరవర! యాతనికి నిమ్ము ననుఁ బ్రీతిమెయిన్‌.
179
వ. సాళ్వపతియును నిపుడు దైవయోగంబునం జేసి విగతచక్షుం డయి తనరాజ్యంబు వైరులచేతం గోల్పడి పుత్త్రదారసహితంబుగా వనంబున నున్నవాఁ; డట్లయినను సత్యవంతున వరియింతు’ ననిన మద్రేశ్వరుండు నారదుంజూచి ‘మునీంద్రా! మీ యెఱుంగని వారు లేరు; సావిత్రిచేత వరియింపంబడిన కుమారుం డెట్టివాఁడు? వానిగుణరూపశీలంబు లెఱింగింపుఁ’ డనిన నారదుం డిట్లనియె. 180
సీ. ‘సత్యంబు వలుకుట సత్యవంతుం డన | వతఁ డొప్పు; మఱియుఁ జిత్రాశ్వుఁ డనఁగ
నామాంతరంబు నన్నరనాథసుతునకుఁ | గలదు; తేజంబునఁ గమలమిత్త్రు
బుద్ధి నింద్రాచార్యుఁ బురుడించు; శూరత | వాసవుఁ, దాలిమి వసుధఁ బోలుఁ;
గాంతిఁ జంద్రున కెనగాఁ దగు; రూపున | నాశ్వినేయుల సరియనఁ దలిర్చుఁ;
 
ఆ. దపము శమము దమము దానంబు బ్రాహ్మణ | భక్తియును మహానుభావతయును
నతనియంద కాని యన్యులయందు లే; | దింత నిక్కువము మహీతలేశ!
181
వ. వానియందుఁ గీ డొక్కటి గలదు; పరిణయంబు మొదలుగా నొక్కసంవత్సరంబునకు మృతింబొందు; నిది నీకుఁజెప్పవలయుటంజేసి చెప్పితి’ ననిన నతండు గూఁతుమొగంబు సూచి ‘తల్లీ! యిమ్మహాత్ముండు దేవరహస్యం బెఱుంగు; నీతనివచనం బమోఘంబు; నీకు నట్టివరుం డేటికి? నొండొక్కవరుని వెదకి కొ’ మ్మనిన నక్కన్యక యి ట్లనియె. 182
క. ‘వినుము మనోవాక్కాయము | లను మూఁడుతెఱంగులందు నంతఃకరణం
బనఘ! ప్రధానము గావున | మనమునఁ గైకొన్న భర్త మానుటఁ దగునే?
183
వ. సత్యవంతుం డెట్టివా డైననుం గాని; మ్మే నింక నొరుల వరియింప నొల్ల’ ననిన నశ్వపతి నారదుదెసఁ జూచుటయు, నతం డి ట్లనియె. 184
చ. ‘గొనములప్రోక నీ యనుఁగుఁ గూఁతురు; దీని తలంపు మాన్పఁగా
మనకు నశక్య; మింక ననుమానము లేల? నరేంద్ర! కూఁతుఁ జ
య్యన నృపసూతి కిమ్ము; కమలానన చేసిన పుణ్యగౌరవం
బున నయినం బ్రియుండు పరిపూర్ణచిరాయురుపేతుఁ డయ్యెడున్‌.’
185
వ. అనిన నమ్మహీపతి మునిపతికి మ్రొక్కి ‘నీవు మాకుం బరమగురుండవు; నీ యానతిచ్చినట్ల చేసెద’ ననియె; నారదుండును దాని దీవించి, దివంబునకుం జనియె; నంత. 186
సీ. అమరఁ బుణ్యదినంబునందు బాంధవమంత్రి | వృద్ధపురోహితవితతితోడ
సావిత్రిఁ దోడ్కొని జననాయకుండు వై | వాహికమహనీయవస్తుకోటి
గొనుచుఁ బుణ్యారణ్యగోచరుండై తప | స్స్థితుఁడైన యా ద్యుమత్సేనుకడకుఁ
జనిన నారాజును సంభ్రమంబున నశ్వ | పతికి నర్ఘ్యాదిసంభావనంబు
 
ఆ. లాచరించి సముచితాభిమతాలాప | పూర్వకముగ సుజనపూజ్యుఁ డతని
యాగమననిమిత్త మడిగిన, మద్రేశుఁ | డెలమి సాళ్వపతికి నిట్టు లనియె.
187
క. ‘ఈ కన్నియ నాకూఁతురు | మాకులమున కెల్లఁ దెప్ప మనుజోత్తమ! నీ
వీకన్నియఁ గోడలుగాఁ | గైకొనుము మదీయవచనగౌరవబుద్ధిన్‌.’
188
వ. అని పలికి సావిత్రి నతనికి నభివందనంబు సేయించి మఱియు నతండు. 189
క. ‘నీకొడుకు సత్యవంతున | కీ కన్నియ దగు నరేంద్ర! యీ కన్నియకున్‌
నీ కొడుకు దగు; ననన్యగు | ణాకరు లియ్యిరువురును సమంచితమూర్తుల్‌.’
190
వ. అనిన నతనికి ద్యుమత్సేనుం డిట్లనియె. 191
తే. ‘విగతరాజ్యులమై ఘోరవిపినములకు | వచ్చి యిమ్మెయిఁ దప మున్నవార మేము;
బాల సుకుమారి యిది జనపాల! యడవి | నుండి మాతోడియిడుమకు నోర్చునయ్య?’
192
వ. అనిన నశ్వపతి యతని కి ట్లనియె. 193
చ. ‘కలిమియు లేమియున్‌ సతముగా; వవి సెందినచోఁ జెలంగుచున్‌
గలఁగుచు నున్కి ధీరులప్రకారమె? లెస్సగ నింతవట్టు నేఁ
దెలియుదుఁ జెప్పెదన్‌ వసుమతీవర! పిన్న యనంగ నేల? నే
కొలఁదియుఁ గాదు; ధీరమతి గూఁతురు; పేర్కొనఁ జాలు పెంపునన్‌.
194
క. నీతోడ వియ్యమందగఁ | జేతోగతి నాసఁ జేసి చెచ్చెర ని ట్లే
నేతెంచితి మత్ప్రార్థన | బ్రాఁతిగఁ జేకొనక యునికి పాడియె నీకున్‌?’
195
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )