| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము |
| వ. | అనుటయు నయ్యంధనృపతి తత్సంబంధంబునకు సంతసిల్లి నిజాశ్రమవాసు లైన మునులం గూర్చుకొని శుభలగ్నంబున సత్యవంతునకు సావిత్రిం బరిణయంబు సేసె; నయ్యశ్వపతియునుం గూఁతునకు నల్లునకు వివిధాంబరాభరణాది వస్తువిశేషంబు లొసంగి నిజపురంబున కరిగెఁ; బదంపడి. | 196 |
| తే. |
పడఁతి రమణీయభూషణాంబరవిలాస | ముజ్జగించి వనాంతరయోగ్యలీల వల్కలాజినవసనయై వదల కధిక | భక్తి భర్తృ శుశ్రూషణపరత నుండె. |
197 |
| క. |
ఆ మెలఁత సేయు సవినయ | సామకథల మృదుగభీరసంభావనలన్ మామయు నత్తయు సంతో | షామృతమునఁ దేలి రంతరంగములఁ దగన్. |
198 |
| వ. | సావిత్రియుఁ దనమగని యాయుఃప్రమాణంబు నారదముని చెప్పిన దినంబు మొదలుగా ననుదినంబును లెక్కయిడికొనుచుండె; నిట్లు వర్తిల్లుచుండ నాలుగుదివసంబులు గొఱంతగా నొక్కసంవత్సరంబు గడచిన. | 199 |
| క. |
నాలవుదినంబు పతిమృతి | కాలం బని మది నెఱింగి కడునిష్ఠమెయిం జాల భరంబుగఁ బూనెను | బాల త్రిరాత్రోపవాసపరమవ్రతమున్. |
200 |
| వ. | దానికి విస్మయంబంది ద్యుమత్సేనుండు గోడలిం బిలిచి, ‘తల్లీ! యి ట్లేల దుస్తరం బగు వ్రతంబు దొడంగి?’ తనిన నమ్మద్రరాజతనయ వినయంబుతో ని ట్లనియె. | 201 |
| క. |
‘మీరు మదీయం బగు వ్రత | భారమునకు వగవవలదు; పరమశుభంబుల్ గోరి యొనరింపఁ బూనితిఁ; | గారణమును మీకు నెఱుఁగఁగా నగుఁ బిదపన్.’ |
202 |
| వ. | అనిన నతం ‘డట్లైన మేలు గాక’ యనియె; నంతఁ జతుర్థదివసంబున. | 203 |
| సీ. |
కడురేపకడయ మేల్కని యింతి నిజభర్తృ | మరణదినం బని మానసమునఁ దద్దయు శోకసంతాపంబు గదురంగ | దినముఖోచితవిధుల్ దీర్చి భక్తిఁ బతికి సమంచితపావనపరిచర్య | యప్పుడు కడువేడ్క నాచరించి యత్తకు మామకు నచటివృద్ధులకును | వేర్వేఱ ప్రణమిల్లి వేడ్క వారు |
|
| తే. |
తనకు సౌభాగ్యభాగ్య వర్ధనము గాఁగ | నిచ్చు దీవన మదిలో గ్రహించి యున్నఁ, బ్రొద్దు జా మెక్కుటయుఁ బూవుఁబోఁడిఁ బిలిచి | మామ యిట్లని పలికె సన్మాన మెసఁగ. |
204 |
| క. |
‘కడునుగ్రం బగు వ్రత మిది | దొడఁగితి; దివసత్రయంబుతో నది సెల్లెం; బడఁతిరొ! యెంతయు డస్సితి: | దడయక పారణ యొనర్పఁదగదే యింకన్’. |
205 |
| వ. | అనిన సావిత్రి యతని కి ట్లనియె. | 206 |
| ఆ. |
‘అధిప! ప్రొద్దుగ్రుంకునంతకు నేఁడును | గుడువఁదగదు నాకుఁ; గోరి యిట్ల్లు గాఁగ వ్రతముఁ బూనుకాలంబునన యేను | నిశ్చయించుకొనిన నియమ మిదియ.’ |
207 |
| వ. | అనియె; నప్పుడు సత్యవంతుండు సమిత్కుశఫలాహరణార్థంబు వనంబునకుం గదలినం జూచి సావిత్రి యతనిఁ జేరంజని ‘వనంబున కేనును నీతోడఁ జనుదెంతుఁ; దోడ్కొనిపోవలయు’ ననిన నతండు ‘నీవు త్రిరాత్రోపవాసంబునంజేసి యెంతయు డస్సినదానవు; రానోప’ వనిన నత్తన్వి వాని కి ట్లనియె. | 208 |
| మ. |
‘ఉపవాసశ్రమ మించుకేనియును నాయుల్లంబునం దోఁప దీ విపినంబుజ్జ్వలపుష్పపల్లవఫలావిర్భూత నానాలతా గపరీతం బన విందుఁ; జూడఁగ మదిం గౌతూహలంబయ్యె; న న్నుపరోధింపకు మింతవట్టు చన వీ యుక్తుండ వెబ్భంగులన్. |
209 |
| వ. | అనిన నతం ‘డట్లకాక చనుదె’ మ్మనుటయు సావిత్రి చయ్యనంజని భార్యాసహితుం డయి యున్న తనమామకుం బ్రణమిల్లి ‘మీకొడుకు వనంబునకు నగ్నిహోత్రార్థంబు సమిధలు దేర నరిగెడు; నాకును నతనితోడన చని వనంబు సూడ వేడుక యయ్యెడు; మీరు నా కివ్వరంబు గృప సేయవలయు’ ననిన వారును ‘నిమ్మగువ యెన్నండును నెయ్యదియును నడుగ; దిత్తెఱంగు దీనికిం బ్రియంబై యున్నది; మాకు నివారింప నేల?’ యని తలంచి యనుమతించుటయు, నయ్యిరువురయడుగులం బడి వీడ్కొని. | 210 |