పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
సావిత్రి యమునివలన నభీష్టవరంబులు వడయుట (సం. 3-281-26)
చ. అనవుడు మద్రరాజసుత ప్రాంజలియై సమవర్తితోడ ని
ట్లను ‘రిపుకోటిచే నపజయంబును బొంది వనాంతరంబునం
దనవరతవ్రతాభిరతుఁ డైన మహాత్ముఁడు సాళ్వభూవిభుం
డనఘుఁడు లబ్ధచక్షుఁ డగు నట్టులుగాఁ గరుణింపవే మదిన్‌.’
225
క. నావుడు ‘నట్టుల యయ్యెడు; | నీ విట రావలవ దుడుగు నెమ్మి’ నని వెసం
బోవఁ దొడంగెను బితృపతి; | యా వెలఁదియు నంత నిలువ కరిగెఁ బిఱుందన్‌.
226
వ. ఇట్లు సనిచని మఱియు నిట్లనియె. 227
చ. ‘ఎడపక వాఙ్మనఃక్రియల నేరికి హింస యొనర్పఁబూన; రె
య్యెడలను దీనులం గరుణ యేర్పడఁ బ్రోవఁగఁజూతు; రిచ్చుచోఁ
గడమ వడంగ నీ కెదిరి కాంక్షితముల్‌ దుదిముట్టఁ దీర్తు; రె
క్కుడు మదిఁ గూర్తు రాశ్రితులకున్‌; విను మిన్నియు నార్యధర్మముల్‌.
228
క. నీ వెఱుఁగనియది యెయ్యది | దేవోత్తమ! ధర్మగతులతెఱఁ గెల్ల భవ
ద్భావాధీన మగుటఁ గా | దే వెలసితి నీవు ధర్మదేవత వనఁ గాన్‌.
229
క. సమబుద్ధితోడఁ దత్త | త్సముచిత కర్మఫల మఖిలజంతుతతులకున్‌
సమకూర్చుట నీ కయ్యెను | సమవర్తి యనంగఁ బేరు జగదభినుతమై.
230
క. యముఁ డండ్రు నిన్ను నార్యులు | యమియింపుదు భూతతతుల నట్లగుటఁ దగన్‌;
శమనుండ వైతి కల్మష | శమనంబునఁ జేసి నీవు జలజాప్తసుతా!’
231
వ. అనినం బ్రేతపతి యాపుణ్యసతి కి ట్లనియె. 232
క. ‘తృషితుఁ డగు వాని శీతల | తుషారతోయములు మోదితునిఁ జేయుగతిన్‌
హృషితాత్ముఁ జేసె ననుఁ గ | ల్మషహరణము లైన నీ సమంజసఫణితుల్‌.
233
వ. ‘కావున సత్యవంతునిప్రాణంబు దక్కందక్కినకోర్కియెయ్యది యైనం జెప్పుము; సఫలంబు సేసెద’ ననిన సావిత్రి ‘దేవా! వైరులచేత నపహృతం బైన రాజ్యం బెప్పటియట్ల ద్యుమత్సేనుం బ్రాపించు నట్లుగా ననుగ్రహింపవే’ యని వేడుటయు, వైవస్వతుం ‘డట్ల యగు’ నని పలికి యి ట్లనియె. 234
ఆ. ‘వలదు నిలువు మింక; వదలక నీభక్తి | మగని కెక్కె; దుర్గమంపుఁ ద్రోవ
యిది; కృతంబు లయ్యె నెల్లయు; నీ విట | వచ్చు సెలవు లేదు వనజనయన!’
235
వ. అనిన నమ్మహాభాగ యతని కి ట్లనియె. 236
క. ‘ధర్మాత్ములు దమ సలిపెడు | ధర్మక్రియ దప్ప రెట్టి దశలందును మో
హోర్ములుఁ దాపముఁ బుట్టవు | ధార్మికహృదయములఁ బ్రథమధర్మాధ్యక్షా!
237
క. కావునఁ బతియనుగమనం | బేవిధమున విడువఁదగునె? యెట్లయినను మో
హావేశముఁ బొందక ధ | ర్మావస్థితి సలుప వలదె యవహితబుద్ధిన్‌.
238
తే. అనిన నంతకుఁ డిట్లను ‘నతివ! నీవు | ప్రకటధర్మవిశేష తత్పరవు గాన
యింక నొక వర మిత్తుఁ; బ్రాణేశు బ్రతుకు | వలదు గాని యొం డడుగుము వలయుదాని.’
239
వ. అనుటయు నక్కాంత గృతాంజలియై ‘మాతండ్రిమద్రేశ్వరుం డపుత్త్రకుం; డతనికిఁ బుత్త్రశతలాభంబు గావలయు’ నని యభ్యర్థించిన నట్ల కా నిచ్చితి’ నని పల్కి ధర్మరాజు ‘నీవు గడుదూరంబు వచ్చి డస్సి; తింక మగుడుట లెస్స’ యని పలికిన నప్పతివ్రత యి ట్లనియె. 240
తే. ‘నాకు డప్పి యెక్కడిది? మనంబు భర్తృ | చరణపంకజాసక్తమై కరము భక్తి
నలరుచున్నది; సతులకు నన్య మెట్టి | దియును ధర్మమె భర్తృసంశ్రయము కాక!
241
వ. మఱియు నొక్కవిన్నపంబు సేసెద. 242
ఆ. ఆత్మధర్మనిరతు లైన పుణ్యాత్ములు | దుర్లభులు సమస్తదురితములును
శాంతిఁ బొందు వారి సంసర్గమునఁదీర్థ | భూతమతులు వారు భూతలమున.
243
ఉ. వారల పేర్మిఁ గాదె శశివారిజమిత్త్రులు నిర్వికారసం
చారత నుల్లసిల్లెదరు, సర్వపయోనిధులున్‌ నిరాకులా
కారతఁ గ్రాలెడుం, గులనగంబులు నిశ్చలరూఢిఁ జాల నొ
ప్పారెడు భూతధాత్రి నిఖిలైకధురీణతఁ బేర్మిఁ బొందెడున్‌.’
244
వ. అని పలికి మఱియు నిట్లనియె. 245
తే. ‘ఏడుమాట లాడినయంత నెట్టివారు | నార్యజనులకుఁ జుట్టంబు లగుదు రనినఁ
జిరసమాలాపసంసిద్ధిఁ జేసి నీకు | నేను జుట్టమ నని చెప్ప నేల వేఱ?
246
వ. కావున మిత్త్రమనోరథం బవశ్యకర్తవ్యంబుగాఁ జిత్తగింపు’ మనిన నమ్మహానుభావుం డబ్భామినిదెసం గనుంగొని ‘నీకుం బ్రసన్నుండ నైతి నీ కిష్టం బైన వరం బొక్కటి యిచ్చెద; నడుగు’ మనిన నమ్మానిని యిట్లనియె. 247
క. ‘మది సత్యవంతుజీవిత | మది యిమ్ముగఁ దొలఁగఁ బెట్టి యన్యంబుల ని
చ్చెద నని పలుకుదు మును నీ; | వది యిప్పుడు లేద; యింక నడిగెదఁ బ్రీతిన్‌.
248
చ. పతివిరహంబు దుస్సహము; భర్తృవినాకృత యైన కాంత దూ
షిత యగు సర్వమంగళవిశేషములందును గాన మత్ప్రియుం
డతులితకీర్తిశాలి సుగుణాఢ్యుఁడు సాళ్వసుతుండు లబ్ధజీ
వితుఁడుగ నిమ్ము ధర్మపదవీపరిరక్షణ! పుణ్యవీక్షణా!
249
వ. అనిన ‘నట్లచేయుదు’ నని యాక్షణంబ కృతాంతుండు సత్యవంతు నపగతపాశుం జేసి యాసుందరి కిట్లనియె. 250
చ. ‘కొను మిదె నీమనఃప్రియునిఁ గోమలి! వీఁడు చతుశ్శతాబ్దముల్‌
మను నిటమీఁదఁ; బుత్త్రులఁ గ్రమంబున నూర్వురఁ గాంచుఁ; గీర్తివ
ర్ధనుఁ డగు; సంతతాధ్వరవితానములం బరితుష్టి సేయు న
య్యనిమిషకోటి కెల్లను; నిజాన్వయమౌళివిభూషణం బగున్‌.’
251
వ. అని యాదేశించి యంతర్హితుం డయ్యె; నక్కాంతయుఁగ్రమ్మఱి చని యెప్పటియట్ల జీవితేశ్వరు తల తొడలపై నిడుకొని కూర్చున్న యెడం గొండొకవడికి లబ్ధచేతనుండై సత్యవంతుండు దెలిసి నిజవల్లభం జూచి యిట్లనియె. 252
క. ‘కడుఁ దడవు నిద్ర వోయితిఁ; | బడఁతీ! ననుఁ దెలుపవలదె; బలియుఁ డొకరుఁ డె
క్కుడు జవమునఁ బట్టి బలం | బెడలఁగ ననుఁ దిగిచె; నాతఁ డెవ్వఁడు సెపుమా!
253
చ. అది కల గాదు, నిక్కువమ యైనటు లున్నది; నాకు నెంతయున్‌
మది వెఱపుట్టె’ నావుడును మానిని యిట్లను ‘నీకు నంతయున్‌
ముదమున రేపు సెప్పెదఁ; దమోమయమై యిదె శర్వరీముఖం
బొదవె; విలంబనం బిచట నొప్పదు లెమ్ము నరేంద్రనందనా!’
254
మ. అదె నక్తంచరు లిందు నందును మహోగ్రాకారులై క్రందుగా
మెదలం జొచ్చిరి, ఘోరఫేరవరుతుల్‌ మిన్నందెఁ దీవ్రంబులై,
పదశబ్దంబులు మీఱెఁ జూడు కలయంబాఱం దొడంగెం బెనుం
గదుపుల్‌ గట్టి మృగంబు; లెంతయు భయోత్కంపంబు నా కయ్యెడున్‌.
255
క. విను! నీవు దడయుటకు మీ | జననియు జనకుండుఁ గరము సంతాపభరం
బునఁ బొందుదు రింతకుఁ; గ్ర | న్నన వారికి సంతసం బొనర్పవె యధిపా!
256
వ. అని పలికి తదీయవిషాదచేష్టితంబు లుపలక్షించి వెండియు. 257
చ. ‘తమమును బెల్లుగాఁ బరఁగె, దవ్వు నిజాశ్రమభూమియున్‌, మదిన్‌
శ్రమమును బాయ దిప్పు డనుచందమ యైనఁ జనంగ నేల? యిం
పమరఁగ నింతప్రొద్దు సుగుణాకర! యిచ్చట నిల్చి రేపు వో
దమె? తెఱఁ గెద్ది?’ నావుడును దన్వికి సాళ్వతనూజుఁ డిట్లనున్‌.
258
క. ‘మానె శిరోవేదన, నా | మేనికిఁ దగ లావు వచ్చె, మెల్లన జరుగం
గా నేర్తుఁ, దల్లిదండ్రులఁ | గానక యే నెట్లు నిలుతుఁ గాననభూమిన్‌?
259
క. ఇంతకు మున్నెన్నఁడు నే | నింత తడవు వారిఁ బాసి యెందుఁ దడయ; నేఁ
డింతవడి మసలుటకు వా | రెంత వడిరొ! యేమి యైరొ! యెట్లున్నారో!
260
ఆ. సంధ్యప్రొద్దు నన్ను జనని యెన్నఁడు నిల్లు | వెడలనీదు; నేఁడు విపినభూమి
మధ్యరాత్రివేళ మసలుట కాయమ | యెట్టిపాటు పడెనొ, యే నెఱుంగ.
261
సీ. కౌఁగిట ననుఁ జిక్కఁ గదియించి శిరము మూ | ర్కొంచును బాష్పముల్‌ గురియుచుండఁ
బట్టి ‘మాయొడలులఁ బ్రాణంబులును నెల్ల | యర్థముల్‌ నీవ; మాయన్న! నీవు
దెప్పగా సంసారతీరంబు సేరెద | మని తలంచెదము సు మ్మన్న! యన్న!
కన్నులు లేని మాకన్నులుఁ గాళులు | నీవ కదన్న! మా నిఖిలవంశ
 
ఆ. మును సముద్ధరించు మోపు నీ యదియ క | దన్న!’ యనుచు నిట్టు లగ్గలంపుఁ
బ్రేమ ననుదినంబుఁ బ్రేముడింతురు వృద్ధు | లక్కటకట! యేమి యైరొ నేఁడు?
262
ఆ. అడవి కేఁగుదెంచి యడరంగ ఫలమూల | తతులు గొనుచు నేను దడయ కపుడ
పోవఁగాన నైతి; దైవోపహతి నింత | చిక్కువడితి; నేమి సేయువాఁడ!
263
క. నా యున్నచో టెఱుంగక | యా యాశ్రమవాసులైన యందఱ నతిదుః
ఖాయత్తుఁ డగుచు నడుగును | మాయయ్య దలంకి మాటిమాటికి నింకన్‌.
264
క. నావార్త వినక యింతకు | నావృద్ధులు భిన్నహృదయులై ప్రాణంబుల్‌
పోవిడుతురు గా కచటికిఁ | బోవం బనిగలదె యేనుఁ బుచ్చెద నసువుల్‌.
265
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )