పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
సత్యవంతుఁడు సావిత్రితోడ మరలి తనయాశ్రమంబునకు వచ్చుట (సం. 3-281-97)
వ. అని బహుప్రకారంబులం బలవించి కన్నీరు నించిన, నక్కాంత దుఃఖాక్రాంత యగుచు నతని నాశ్వాసించి, నవమృణాళమృదులంబులగు భుజంబులం గౌఁగిలించియెగయ నెత్తిన, మెత్తన లేచి యతండు ధూళిధూసరితం బైన శరీరంబు దుడిచికొని గమనంబున కుత్సహించిన. 266
క. ఫలభారము దుర్భర మని | వెలఁది యచట నొక్కవృక్షవిటపంబున ని
మ్ముల గరడియ దగిలిచి యు | జ్జ్వల పరశువుఁ గొనుచు మృదులసంభ్రమలీలన్‌.
267
వ. జీవితేశ్వరువామబాహువు నిజవామభుజంబుపయి నిడికొని దక్షిణహస్తంబున నతని గ్రుచ్చి కౌఁగిలించి మందగమనంబున నాశ్రమదేశంబునకు మగిడె; నంత నక్కడ. 268
ఉ. కన్నులు వచ్చి యెల్లెడలుఁ గన్గొని వృద్ధనరేంద్రుఁ డాత్మకుం
గన్నులుఁ బోలె నైన తన గాదిలిపుత్త్రుఁడు గాననంబులో
నెన్నఁడు లేని యింత తడ వేటికిఁ జిక్కెనొ యంచు నార్తితోఁ
గన్నులు లేనియ ట్లతఁడుఁ గానక యేడ్చె సతీసమేతుఁ డై.
269
తరలము కొడుకు నిందును నందు రోయుచుఁ గోరి ప్రేమభరంబునం
గొడుకుసద్గుణకోటి యెల్లను గోటిభంగుల నోలి ను
గ్గడన సేయుచు సత్యవంతునిఁ గానరే మునులార! యే
యడవిలోపల నంచు హాసుత! యంచు ధైర్యము డించుచున్‌.
270
వ. ఉన్నంతఁ, దదాశ్రమవాసులైన మునులందఱు నతనిం బొదివికొని తదీయనయనలాభంబునకు విస్మయం బందుచు నుచితవాక్యంబుల నతని నాశ్వాసించుచుండిరి; తదనంతరంబ యొక్క ముహూర్తంబునకు సావిత్రీసహితుండై చిత్రాశ్వుండు సనుదెంచిన నావృద్ధదంపతు లత్యంతహర్షంబున నతనిం గౌఁగిలించుకొని మూర్ధాఘ్రాణంబు సేసిరి; మునులు గరంబు సంతసిల్లి; రప్పు డారాజర్షి ముఖ్యుండు పుత్త్రునిం జూచి ‘యయ్యా! యి ట్లేల వనంబున మసలి?’ తని యడిగిన నతండు దాను జని పండ్లు గోయుటయును గాష్ఠదళనంబు సేయునెడం దల యేరు గదిరి నిలువనోపక విశ్రమించుటయుఁ దన్నొక పురుషుండు గలలోన నిగ్రహించుటయుం జెప్పునెడ సావిత్రి మామ కిట్లనియె. 271
సీ. ‘ఈ రాజసుతునకు నిద్దినంబున మర | ణం బని మును చెప్పె నారదుండు;
మునినాథువచనం బమోఘంబు గావున | నేమఱ కేను నేఁ డితనితోడ
నడవికి నేఁగితి; నచట నీతఁడు సుప్తుఁ | డైయున్నయెడ వచ్చె నంతకుండు;
వచ్చి యివ్విభుని జీవముఁ గొనిపోవఁగ | వెనుకన చని యేను వివిధభంగి
 
ఆ. సత్యధర్మఫణితి సంస్తుతించుటయుఁ గృ | పార్ధ్రచిత్తుఁ డగుచు నజ్జముండు
నాకు నెమ్మి నొసఁగె నాలుగువరములం | దొకట నితఁడు జీవయుక్తుఁ డయ్యె.
272
వ. మఱియు నొక్కవరంబు భవదీయనయనోన్మేషణకారణం బయ్యెఁ; దక్కిన వరద్వయంబున మీకు వైరి హృతరాజ్యసంప్రాప్తియు, మదీయజనకునకుఁ బుత్త్రశతలబ్ధియు నగు’ నని చెప్పిన నయ్యిద్దఱుఁ బరమానందకందళితశీతలశిశిరహృదయులై కోడలి కి ట్లనిరి. 273
క. ‘ఆపత్సముద్రమగ్నం | బై పోయెడు నస్మదన్వయము పెంపెసఁగం
దేప యయి కడవఁ బెట్టితి; | నీ పుణ్యచరిత్ర కీర్తనీయము తల్లీ!’
274
వ. అని యభినందించి; రప్పు డయ్యిందువదనను మునివరు లందఱుం బ్రశంసావచనంబుల నుపలాలించి, వారల దీవించి నిజగృహంబులకుం జని; రంతం గతిపయదినంబులకు. 275
సీ. ఆ సాళ్వభూవిభునాప్తమంత్రులు మూల | భృత్యులుఁ బౌరులుఁ బృథివిఁ గలుగు
పెద్దలుఁ గూడి సంప్రీతి నాతని పాలి | కేతెంచి వినయసమేతు లగుచు
‘నవనీశ! నీ శత్రుఁ డాత్మీయమిత్రభే | దనమునఁ జేసి బాంధవసహాయ
సహితుఁ డై మృతిఁబొందె; సకలజనంబులు | నేకచిత్తంబున నిపుడు నిన్నుఁ
 
ఆ. బ్రకటరాజ్యపదవిఁ బట్టంబు గట్టంగ | వచ్చినారు; నిఖిలవసుధయందు
విస్తరిల్లె నీదువిజయఘోషము; భద్ర | గజము నెక్కివేగ కదలు మింక.
276
క. ప్రాకటతపోబలంబున | నాకలితవిలోచనుండ వై యున్న నినున్‌
లోకేశ! చూడఁగంటిమి; | మా కన్నులు చల్లనయ్యె మాభాగ్యమునన్‌.’
277
వ. అనినం బ్రహృష్టహృదయుండై ద్యుమత్సేనుండు నాక్షణంబ తదాశ్రమవాసు లయిన మునుల నామంత్రణంబు సేసి, కొడుకుం దానును గజారూఢుఁడై బహుళచతురంగసేనాసంకులగమనంబునం బురంబునకుఁ జని సకలమహీరాజ్యంబునుగైకొని, చిత్రాశ్వునకుం బ్రథితయౌవరాజ్యపట్టం బొసంగి పరమైశ్వర్యధుర్యుం డయ్యె; నిత్తెఱంగున. 278
క. తన మగని నత్తమామల | జననీజనకులను దన్ను సకలంబును దా
ఘనముగ సముద్ధరించెను | జనవర! సావిత్రిధర్మచరితము కంటే!
279
తే. ఆ పతివ్రత యట్ల యీ యాజ్ఞసేని | పరమకల్యాణకర్మసంభావనీయ
యధిప! మిమ్మును మీయఖిలాన్వయంబు | నుద్ధరించు మహాభాగ్యయుక్తిఁ జేసి.
280
క. అని చెప్పి పాండుతనయుల | ననఘుల వీడ్కొని మునీంద్రుఁ డనుపమతేజో
ఘనుఁ డగు మార్కండేయుఁడు | దన యాశ్రమమునకు నరిగెఁ దద్దయు నెమ్మిన్‌.
281
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )