పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
సూర్యుఁడు బ్రాహ్మణవేషంబునఁ గర్ణునకు హితంబు సెప్పుట (సం. 3-284-4)
వ. అని చెప్పిన విని జనమేజయుండు వైశంపాయనుతో ‘మునీంద్రా! యింద్రుండు గర్ణుకవచకుండలంబు లెవ్విధంబున నపహరించెం జెప్పవే’ యని యడిగిన నతం డి ట్లనియె. 282
సీ. వనమున నప్పాండుతనయు లుండఁగ నందు | వరుసఁ బండ్రెం డగు వత్సరంబు
కడపట నింద్రుఁడు గడఁగి పాండవహిత | కారియై కర్ణుని కవచకుండ
లములు మాయాప్రయోగమున హరింపంగఁ | దలఁచిన నాతని తలఁ పెఱింగి
జలజాప్తుఁ డొకనాఁడు వెలయ రాధేయున | కది యెల్ల నెఱిఁగింతు నని తలంచి
 
ఆ. లోకనుతుఁడు బ్రాహ్మణాకార మొప్పంగ | నతనియున్నయెడకు నరుగుదెంచి
యేకతంబ యున్న యా కర్ణుతోడ న | భీష్టభంగి దోఁప నిట్టు లనియె.
283
క. ‘ఓకర్ణ! సుజనవినుత గు | ణాకల్ప! భవద్ధితార్థమై యొకకార్యం
బేకతమ చెప్ప వచ్చితిఁ | బ్రాకటముగ వినుము నాదు పలుకులు ప్రీతిన్‌.
284
వ. పాండవపక్షపాతియై పాకశాసనుండు భవదీయంబు లైన కవచకుండలంబులు హరియింపంగోరి, నీవు బ్రాహ్మణప్రియుండ వనియును బ్రాహ్మణు లడిగిన నెయ్యదియైనను వంచనసేయ కొసంగుదు వనియును నెఱుంగుం గావునఁ, గపటబ్రాహ్మణుండై వచ్చి యడుగం గలవాఁడు; నీవును గవచకుండలంబు లీవలవదు; రత్నకాంచనప్రముఖంబు లయిన పదార్థంబులు సూపియుం బ్రార్ధించియు మఱియు నెవ్విధంబున నైనం గడపి పుచ్చవలయు; నట్లుగాక వీని నతని కిచ్చితేని మృత్యువశంబునం బొందఁగలవాఁడవు. 285
చ. అమృతమయంబు సువ్వె సుగుణాకర! యిమ్మహనీయవస్తుయు
గ్మము; నివి యుండు నేనిఁ ద్రిజగంబులయందు నశేషశత్రులో
కమునకు నీవు వధ్యుఁడవు గావు, నిరంతరసౌఖ్యసాంద్రమో
దమున వెలుంగు; దే నిది హితంబుగఁ జెప్పితి మోసపోకుమీ!’
286
క. అనిన విని సూతతనయుఁడు | వినయంబున నిట్టు లనియె ‘విప్రాకారం
బున వచ్చిన వేల్పవు నీ | వనఘా! యెవ్వఁడవు? నాకు నానతి యీవే.’
287
క. అనుడు నతఁ ‘డేను సూర్యుఁడ | మనమున నీయందుఁ గలుగు మక్కువఁ గర్జం
బొనరఁగ నుపదేశింపఁగఁ | జనుదెంచితి’ ననిన నతఁడు సంభ్రమ మొప్పన్‌.
288
వ. అభివందనంబు సేసి, ‘దేవా! దేవరవు నాకత్యంతహితుండ వగుటంజేసి కృతార్థుండనైతి; నింకొక్క విన్నపంబు సేసెద నవధరింపుము. 289
ఉ. భూసురకోటి వేఁడుటయుఁ బోఁడిగ ప్రాణము లైన నీగి నా
బాస; దినేశ! లోకమునఁ బ్రస్ఫుట మింతయు; నట్లు గాకయున్‌
వాసవుఁ డట్టె! న న్నడుగవచ్చుఁ బ్రియంపడి నాకు నొక్క బ్రాఁ
తే సురలోకవందిత! మదిం గవచంబును గుండలంబులున్‌.
290
క. జగముల నెల్లను నిండిన | పొగడిత గడు వెలితి సేసి, పొల్లయొడలికై
తగవే జన్మవ్రత మిటు | దిగవిడువఁగ నేఁడు నాకుఁ ద్రిభువనదీపా!
291
మ. మతిఁ గుంతీసుతపక్షపాతి యగుచున్‌ మాయాస్వరూపంబుతో
జితదైత్యుండు శతక్రతుండు నను భిక్షింపంగ నేతెంచు న
ట్టి తెఱంగైనఁ దదీయకీర్తియ చుమీ డిందుం; ద్రిలోకీసము
న్నతమై యొప్పు మదీయకీర్తి; యిదిసూ నాపుణ్య మెబ్భంగులన్‌.
292
ఆ. కీర్తి విడువఁజాలఁ; గీర్తితో మెలఁగంగఁ | జావు వచ్చెనేనిఁ జత్తుఁ; గాని
జగములోన నెల్ల ‘సడికంటెఁ జావు మే’ | లనఁగఁ బరఁగు మాట యనఘ! వినవె?
293
ఉ. ‘కీర్తియ యిచ్చుఁ బుణ్యగతిఁ; గీర్తియ తల్లియుఁబోలెఁ బ్రోచు; స
త్కీర్తియ యాయువున్‌ సిరియుఁ; గీర్తివిహీనుఁడచూ శవంబు; దు
ష్కీర్తను నెల్లచేటులును గిట్టి హరించు’ ననండె తొల్లి భ
క్తార్తిహరుండు నాఁబరఁగు నంబుజసూతి జగద్ధితంబుగన్‌.
294
సీ. విప్రులు గడు నర్థి వేఁడినఁ గలిమిలోఁ | బొచ్చెంబు సేయక యిచ్చు టొకటి,
బలితంపుఁబగతురఁ బరిమార్చు టొక్కటి, | దండియై యనిఁ జచ్చు టొండె నొకటి,
శరణాగతుని నెట్టి శత్రువు నైనను | గరుణించి చంపక కాచు టొకటి,
భామినీద్విజవృద్ధబాలాతురుల కైన | యాపద చెచ్చెరఁ బాపు టొకటి
 
ఆ. యనఁగ నివి వ్రతంబులై చెల్లు నాకు; నిం | దొకటి తప్పెనేని వికలకీర్తి
నగుదుఁ; గాన నిత్తు నఖిలమ్ము నెఱుఁగ నా | ఖండలునకుఁ గవచకుండలములు.’
295
వ. అనినఁ గర్ణునకు సూర్యుం డిట్లనియె. 296
క. ‘కడు నెయ్యురు హితముగఁ జె | ప్పెడు పలుకులు వినవు; గరము బేలవు; నీ వె
క్కడ? బుద్ధితెరువు లెక్కడ? | చెడక వినుము నీకుఁ దెలియఁ జెప్పెదఁ గర్ణా!
297
క. తనకుఁ దనయులకు సతులకు | జననీజనకులకు బంధుజనులకుఁ గీడొం
దని తెరువునఁ గీర్తి గనినఁ | జనుఁగా కందఱును జెడుయశం బేమిటికిన్‌?
298
ఉ. కావున నీవు ప్రాణములు గావుము; కీర్తి యటుండనిమ్ము; నీ
జీవిత మున్నఁ గీర్తి మఱి చేరదె; కీర్తి యనంగ నొక్కఁ డే
లా? వనితల్‌ దనూభవులు లక్ష్ములు బంధులు సార్వభౌమతే
జోవిభవంబు నిమ్మడరఁ జొప్పడుఁ బ్రాణ మొకండు గల్గినన్‌.
299
క. మృతుఁ డైన నరుఁడు వెస భ | స్మితుఁడై చనుఁగాక, కీర్తిమేలిమి గనునే?
మృతదేహంబునకు నలం | కృతిఁ జేసినయట్ల మృతునికీర్తి తలంపన్‌.
300
వ. నీవు నాకు నత్యంతభక్తుండ వగుటంజేసి భక్తజనరక్షణంబు గర్తవ్యం బగుట ని ట్లన్నియుం జెప్పవలసె; మఱియు దేవనిర్మితం బైన రహస్యం బొక్కటి గలదు; దాననసేసి నీయందు నాకు వాత్సల్యంబు మిగిలియుండు; నది యిప్పు డేను జెప్పఁ; బిదపఁ దనయంతన యెఱుఁగంబడు; నీకు నర్జునునకుం దెగని పగయై యుండు; మీకుఁ గయ్యంబు నయ్యెడు; నందు నీవు సహజకవచకుండలమండితుండ వగుటంజేసి యర్జునున కజేయుండ వయ్యెద; వట్లుంగాక వీనిం గోలుపోయితివేని యెంతయు దెప్పరం బగు’ ననినం గర్ణుం డిట్లనియె; 301
మ. ‘కరుణామూర్తివి నీవు సంతతము భక్తశ్రీసమాధానత
త్పరచిత్తుండవు గావునం గడఁగి నాపై మక్కువం బద్మినీ
వర! మే లానతి యిచ్చి తింకొకటి దేవా! నిన్నుఁ బ్రార్థించెదం;
గరుణన్‌ నా ప్రతికూలదుర్లపిత వాక్యంబుల్‌ సహింపం దగున్‌.
302
క. అనృతమున కెంత వెఱతును | విను మంతకునకును నంత వెఱవ; మును వహిం
చినవ్రతము విడిచి దుర్గతిఁ | జనఁ జాలుదు నయ్య! నన్నుఁ జనునే మాన్పన్‌?
303
వ. అర్జునుండు దుర్జయుం డని చూడవలవదు, నీవును మదీయంబు లగు దివ్యాస్త్రంబు లెఱుంగుదు; జామదగ్న్యుండును ద్రోణుండును నాకు నొసంగినదివ్యాస్త్రంబు లల్పంబులు గావు, గావున నవశ్యంబును సమరంబున నమరరాజనందనుం దెగటార్పనోపుదు; నీ వింక నొండు దలంపక నాకు ననుజ్ఞ యి’ మ్మనిన నొక్కింత విచారించి యాదేవుండు రాధేయున కి ట్లనియె. 304
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )