పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
సూర్యుఁడు గర్ణునితో నింద్రుచే శక్తిఁ గైకొను మని సెప్పుట (సం. 3-286-14)
తే. ‘ఎల్లభంగుల నిశ్చయం బిదియ యేని | వత్స! విను మింక నొక్కటి; వాసవునకుఁ
గలదు దారుణంబును నమోఘంబు నైన | శక్తి; యది నీకు నడుగుము సవినయముగ.
305
క. తొలి తొలి బలసూదనుచేఁ | జెలువుగ నాదివ్యశక్తి చేకుఱఁ గొని కుం
డలములుఁ గవచంబును మఱి | యలఘుమతీ! యిమ్ము భద్ర మగు నిట్లయినన్‌.
306
ఉ. వైరులఁ జంపి చంపి వెస వచ్చుఁ గరంబున కాజిలోన న
ద్దారుణశక్తి వాసవుఁడు దానన తొల్లి సహస్రసంఖ్యలం
గ్రూరసురారిసంఘములఁ గూల్చె; మహాభుజ! నీకు నెమ్మి నా
ఘోరపు సాధనంబు దొరకొన్న నవశ్యము గెల్తు వైరులన్‌.’
307
వ. అని చెప్పి కమలహితుం డంతర్హితుం డయ్యె; కర్ణుండును వాసవురాక కెదురుసూచుచుండె; ననిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 308
మధురాక్కర ‘కలదు దేవగుహ్యం బని కమలబాంధవుఁడు గర్ణుఁ
బలికె నని చెప్పి; తది యెద్ది? బలియుఁ డా సూతజుండు
లలితకవచంబు మణికుండలములు నెమ్మెయిఁ బడసె?
వెలయ నివ్విధమంతయు వివరింపవలయు నాకు.’
309
వ. అనిన వైశంపాయనుం ‘డదియంతయుం జెప్పెద విను’ మని యిట్లనియెఁ; దొల్లి కుంతిభోజు నింటికి దుర్వాసుం డతిథియై వచ్చి వానిచేత సత్కృతుండై ‘నాకు నీయింటఁ గొంతకాలంబు వసియింప నిష్టం బైనది; నాయున్నంత కాలంబును నీవును నీయనుచరులును నిర్వ్యాజం బగు భక్తి సేయవలయు; ని ట్లోపుదే?’ యనుటయు నొడంబడి యతండు దన కూఁతుం బృథ యను కన్యం బిలిచి యమ్మహామునిం జూపి. 310
ఉ. ‘దేవసమానుఁ డీ ధరణిదేవుఁడు; వేడుక మద్గృహంబునం
దా వసియింపఁ గోరుటయు, దానికి నేనును నియ్యకొంటి, నిం
దీవరనేత్ర! నీవుఁ గడుధీరవు, సద్వినయోపచారసం
భావితవృత్త; వట్లగుట భక్తి భజింపుము బ్రాహ్మణోత్తమున్‌.
311
క. ఇతఁ డెత్తఱి నెయ్యది స | మ్మతిఁ గోరిన నది ఘటించి మచ్చిక నిడి తో
షితుఁ జేయు మిమ్మహాత్ముని | మతి యలుగక యుండవలయు మానిని! యెపుడున్‌.
312
ఆ. వినుము విప్రవరులు వెడవెడఁ గినిసిరే | నియును ధరణి యెల్ల నీఱు సేయఁ
జాలుదురు తపఃప్రశస్తులు దుర్వార | తేజు లెందు నధికధీరమతులు.
313
క. భూదేవపరాభవమునఁ | గాదే వాతాపిదండక ప్రభృతులు పెం
పేది చెడిరి; భూదేవస | మాదరమునఁ గాదె బ్రదికినవి యిజ్జగముల్‌.
314
సీ. పసిబిడ్డ వయ్యును బడఁతి! నీ వెంతయు | గుణవంతురాలవు గురులయందుఁ
బెద్దలయందును బృథివీసురులయందుఁ | గడుభక్తి సేయుదు కమలనయన!
బంధులుఁ జెలులు సంబంధిజనంబులుఁ | బురమువారలు నంతిపురమువారుఁ
బూఁబోఁడి! నిను నెమ్మిఁ బొగడనివారు లే; | రేమని వర్ణింతు నేను నిన్ను?
 
తే. యదుకులంబునఁ బుట్టి యత్యంతసౌఖ్య | మమరఁ బెరిఁగితి నాపుత్త్రి వై, త్రిలోక
సుందరము రూపు, ప్రాయంబు సొంపు, నిట్టి | దిచ్చరిత్రంబు సతులకు నెందుఁ గలదు?
315
వ. నీగౌరవం బంతయు నెఱింగి కాదె వహ్నిసమానుండైన యీ మహాముని నారాధించుటకు నీయందు భారం బెక్కించెద; నీవును దర్పంబును నహంకారంబును దూరంబున నిడి యిప్పుణ్యపురుషుం బరితుష్టుం జేసి కృతార్థతం బొందు’ మనిన నక్కన్య యి ట్లనియె. 316
ఉ. ‘కోరుదు నేను విప్రతతిఁ గొల్వఁగ నెప్పుడు నాత్మలోన; నా
కోరినకోర్కి నేఁడు దలకూడె; నరేశ్వర! యట్లుఁ గాక నీ
కోరినయట్టి యవ్విధము గోరి యొనర్చుట నాదుభాగ్యసం
భారము గాదె! యూఱడుము భారము నాపయిఁ బెట్టి నెమ్మదిన్‌.’
317
వ. అనిన సంతసిల్లి కుంతిభోజుండు దుర్వాసున కక్కన్నియం జూపి యి ట్లనియె. 318
క. ‘ఈ పిన్నది నాకూఁతురు | తాపసజనముఖ్య! మిమ్ముఁ దాఁ గొలువంగా
నోపుదు నని పూనెం బసి | పాపసుఁడీ! కినుక లేక పని గొనవలయున్‌.
319
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )