పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
కుంతి దుర్వాసునకుఁ బరిచర్య సేయుట (సం. 3-288-12)
చ. ఎఱుఁగక తప్పుగా మెలఁగె నేనియు దానికి సైఁచి నేరుపుల్‌
గఱపి ప్రియంబుతోఁ గొలువు గైకొనఁగాఁ దగు మీకు; బాలురుం
దెఱవలు వృద్ధులుం దమకుఁ దెల్లము దప్పులు సేసిరేనియున్‌
మఱతురుగాని యల్గరు సమగ్రశమాన్వితు లైన తాపసుల్‌.
320
వ. అని యప్పగించి యప్పార్థివేంద్రుండు మునీంద్రునకుఁ జంద్రికాధవళం బైన సౌధంబునందు శయనాసనప్రముఖోపకరణంబులు నభిమతాహారసాధనద్రవ్యంబులు నాయితంబులు సేయించి, తాను సంతసంబున నూఱడియుండె; నంత. 321
క. భావించి నాఁడునాఁటికి | వేవిధముల మిగుల భక్తివినయంబులతో
దేవోపచారముల భూ | దేవోత్తముఁ గొల్చెఁ గుంతిదేవి నియతయై.
322
సీ. అతఁడును దద్భావ మరయంగ మదిఁ గోరి | రూపించి యొకమఱి రేప వత్తు
నని పోయి నడురేయి నర్థితోఁ జనుదెంచు, | రేయి వచ్చెద నని రేప వచ్చు;
నే ప్రొద్దు వచ్చిన నింతి యప్పుడు క్రొత్త | లుగ భక్ష్యభోజ్యాదు లొగి నమర్చి;
నెయ్యదిఁ గోరిన నిచ్చకురాఁ బెట్టు; | నలయదు మదినైన నలుగ దెపుడు;
 
ఆ. ననుదినంబు నధిపుఁ డాత్మజఁ బిలిచి త | ద్వర్తనంబు లడుగ వనజముఖియుఁ
దాను గొలుచుతెఱఁగుఁ దాపసవరునిచం | దమును జెప్పుచుండుఁ దండ్రి యలర.
323
వ. అంత నొక్కసంవత్సరంబు పరిపూర్ణం బయినఁ బ్రీతుండై దుర్వాసుండు కుంతిం జూచి ‘నీచేసిన యారాధనంబునకు మెచ్చితి; నభిమతంబు లిచ్చెద నడుగు’ మనిన నమ్మానిని గృతాంజలియై ‘మీరు నావలనం బ్రసన్ను లైతిరి; దీనికి మాతండ్రియుం గరం బలరు; నింతియ చాలు; నొం డేల?’ యనిన నతం ‘డట్లేని నిది యొక్కమంత్రంబు గైకొనుము; దీనంజేసి యెయ్యేని వేల్పునాహ్వానంబు సేసెద వవ్వేల్పు సనుదెంచి నీవశంబున నుండు’ ననిన ‘నొండన వెఱచి కుంతియుం ‘బ్రసాదం’ బనియె; నమ్మునీంద్రుండు దాని కమ్మంత్రంబు విధియుక్తంబుగా నుపదేశించి నిజేచ్ఛం జనియెఁ; నంతఁ గొంతకాలంబునకు. 324
మ. ‘మదిఁ గారుణ్యము సేసి విప్రవరుఁ డీ మంత్రంబు నా కిచ్చె; నే
నిది యేచందమొ చూతు’ నంచు నొకనాఁ డిచ్చన్‌ ఋతుస్నాత యై
సుదతీరత్నము పూర్వశైలతటిపై శోభిల్లు తిగ్మాంశుఁ జూ
చి దళత్పద్మము మాడ్కి నుల్లసితమై చిత్తంబు రాగిల్లఁగన్‌.
325
వ. సహజకుండల కవచాభిరామంబైన తదీయమూర్తివిభవంబున కోటువడి ‘దేవా! భవత్సమానసుందరుం డగు నందనుం గరుణింపవే’ యని మనంబునం గోరుచు మంత్రోచ్చారణంబు చేసినఁ, బ్రభాకరుండును నిజయోగబలంబున మూర్త్యంతరంబు ధరియించి కుంతిపాలికిం జనుదెంచి మధురస్వరంబున. 326
తే. ‘అబల! నీమంత్రబలమున నరుగుదెంచి | నాఁడ; నీవాఁడ నైతి; మనఃప్రియంబు
నీకు నెయ్యది యొనరింతు; నిజము చెపుమ!’ | యనినఁ బడఁతి యిట్లనుఁ గమలాప్తుతోడ.
327
తే. ‘కార్య మొక్కటియును లేదు; కౌతుకమున | నేను మంత్రంబు నొడివితి; నింతమాత్రఁ
జేసి నీకు నిచ్చటికి విచ్చేయ నేల? | దివికి నరుగుము క్రమ్మఱ దేవ! నీవు.’
328
వ. అనిన దానికి సూర్యుం డిట్లనియె. 329
ఉ. ‘క్రమ్మఱి పోక తప్పెడినె? కామిని! యేమని మున్ను నీవు చి
త్తమ్మునఁ గోరి? తవ్విధము దప్పక యిప్పుడుఁ బల్కరాదె? తే
జమ్మున మత్సమానుఁ గవచస్ఫుటకుండలమండితాంగు స
త్సమ్మతుఁ బుత్త్రుఁ గోరవె నిజమ్ముగ నావలనం దలోదరీ!
330
వ. కావున నిప్పుడు మదీయసమాగమంబున కొడంబడుము; నీకోరినయట్టి తనయుండు జనియించు; నిట్లు సేయనినాఁడు నిన్నును భవజ్జననీజనకులను భస్మంబు సేయుదు; మఱియు నీదైనశీలవృత్తంబు లెఱుంగక మంత్రంబు గర్వంబునంజేసి నీ కుపదేశించిన తాపసు నీక్షణంబ నిర్దహింతు; నిదె యంబరంబుననుండి యింద్రాదిసురవరులు నీకతమ్మునఁ జిక్కువడియున్న నన్నుం జూచి నవ్వుచున్నవా; రిదె సూడుము దివ్యదృష్టి యిచ్చితి’ ననినం జూచి కుంతిభోజనందన డెందంబున నమందలజ్జావివశ యగుచు దినేశ్వరున కిట్లనియె. 331
క. ‘నను నిచ్చుటకుం గర్తలు | జననియు జనకుండుఁ గాక, చనునే నాకున్‌
వనితాధర్మము విడువఁగ; | ననఘా! యిట్లయిన వంశహానియుఁ గాదే?
332
ఆ. మంత్రబల మెఱుంగ; మదిఁ గోరి తప్పు సే | సితి మహాత్మ!; దీనిఁ జెట్ట గాఁగ
నవధరింప కెట్టు లైన నాబాల్యంబుఁ | గరుణ సైఁపవలయుఁ గమలమిత్త్ర!.’
333
వ. అని మఱియు ననేకప్రకారంబుల దివాకరు ననునయించి యెట్లునుం గ్రమ్మఱింపనేరక దనకారణంబునఁ గులంబునకును గురుజనంబులకును నపాయం బగు ననియుం దలపోసి భయంబు మిగులఁ దెగువసేసి యతని కిట్లనియె. 334
చ. ‘ముదము దలిర్ప బంధుజనముల్‌ గురువర్గముఁ గూడి రూఢి నొ
ప్పిదముగ ధర్మమార్గమునఁ బెండిలిసేయఁగఁ బిమ్మటన్‌ సము
న్మదరసకేళిలీలకుఁ గ్రమంబగుఁగాక కులంబు శీలమున్‌
వదలి వధూజనంబులకు వచ్చునె యిమ్మెయి వేడ్క సల్పఁగన్‌?
335
క. బంధుమతి నైన నను ని | ర్బంధముమెయి ధర్మబాహ్యపథమున నలినీ
బాంధవ! యిటు సేయుటయు న | మంధరభవదీయకీర్తి మలినము గాదే.
336
చ. జగములయందు ధర్మువును సత్యము నీయవి గావె దేవ! యే
తగవులు నీ యెఱుంగని విధంబులె? యిట్టిది నీదు బుద్ధికిం
దగ వగునేని మార్పలుకుదాననె? యే మగుఁగాక నీకు నిం
పగుతెఱఁ గాచరింపు; మట యావల నయ్యెడు నింద కోర్చెదన్‌’.
337
సీ. అనుటయు నద్దేవుఁ డయ్యిందుముఖిఁ జూచి | ‘తల్లిదండ్రులును బాంధవజనంబు
కారు నిన్నీగికిఁ గర్తలు; విను నీవ | యొడయురాలవు నీకు నుజ్జ్వలాంగి!
కామంబు లెల్లను గామించి పొందుట | నయ్యెఁ గన్యాశబ్ద మట్లుగాక
యాత్మతంత్రత్వంబునందు నీ కెగ్గు లే; | దే నేల నడతు ధర్మేతరంబు?
 
ఆ. మత్సమాగమమున మదిరాక్షి! నీదు క | న్యావ్రతంబుఁ జెడదు; నందనుండు
నధికతేజుఁ డుదయ మగు; నిన్ను నొక్కనిం | దయును బొందకుండుఁ; దథ్య మబల!
338
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )