| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము |
| వ. | అని యొడంబఱిచి సూర్యుండు దత్సమాగమంబునం బ్రీతుండై దానికి గర్భాధానంబు సేసి గగనంబున కరిగె; నంతఁ బూర్వపక్షంబునందుఁ జంద్రుండునుం బోలె గర్భంబు గ్రమంబునఁ బ్రవర్ధనంబు నొందుచు నభివ్యక్తంబయ్యునుబ్రభాకరునిమహిమం జేసి లోకవిదితంబుగాకుండెఁ; దత్ప్రకారంబు దాదికూఁతు రొక్కతియ యెఱుంగు; నిట్లు వర్తిల్లుచుం బది యగు మాసంబున నొక్కనాఁటి నిశాసమయంబునం గన్యాంతఃపురంబునందు. | 339 |
| ఆ. |
కొడుకుఁ గనియె సహజకుండలకవచాభి | రాము విమలకమలకోమలాక్షు దీర్ఘబాహుఁ జారుదృఢదేహుఁ దరుణార్క | తేజుఁ గుంతిభోజరాజపుత్త్రి. |
340 |
| వ. | ఇట్లు జనియించిన యర్భకుం జూచి లోకాపవాదభయంబునకుం దలరి యాక్షణంబ యొక్క మంజూషలోన నబ్బాలకుం బదిలంబుగా నిడి దాని నతిదృఢంబుగాఁ దెప్పం బంధించి సఖియునుం దానును గొని పురసమీపగతంబైన యశ్వనదీప్రవాహంబున విడిచి కుంతి యెంతయు సంతాపంబున నిట్లని విలాపంబు సేసె. | 341 |
| ఆ. |
‘కొడుక! నిన్నుఁ గాంచు కొఱఁత నోములె కాని | పెంచి గారవించి పేర్మి నీదు ప్రోపుఁ గుడువఁ గాంచు పుణ్యంబు దుదిముట్ట | నేల చేయనైతి నేను గుఱ్ఱ! |
342 |
| మ. |
నెఱయం బున్నమచందురుం జెనయు నీ నెమ్మోమునం దియ్యనై చిఱునవ్వొప్పఁగఁ జూడనీక, పులకల్ చెన్నొంద నిన్ గ్రుచ్చి య క్కఱదీఱం బొరి నక్కునం గరము వేడ్కం జేర్ప నీ కిమ్మెయిన్ వఱుతం ద్రోవఁగఁ జేసెనే యకట! దైవం; బెందుఁ జొత్తున్ సుతా! |
343 |
| సీ. |
ఏపుణ్యసతికి నీ వింక నందనుఁడ వై | యెక్కడఁ బడియెదో యే నెఱుంగ; నే పుణ్యురాలొకో యెప్పుడు నినుఁ బుత్త్రుఁ | గాఁ గాంచుటకు మేలికలను గాంచు; లలిఁ బాంసుకేళి నల్లన నడయాడుచు | నవ్యక్తమధురవాక్యామృతంబు వీనులఁ గురియుచు వెడఁదకన్నులఁ బిన్న | నవ్వును శుభలక్షణములు నమరఁ |
|
| ఆ. |
దేజరిల్లు నిన్నుఁ దెఱవ యెవ్వత యొక్కొ | యడర గ్రుచ్చి యురమునందుఁ జేర్చి వేడ్క మిగుల వేనవేలభంగులఁ గొని | యాడి నగుచు ముద్దులాడుఁ గొడుక! |
344 |
| ఉ. |
లాలితయౌవనోజ్జ్వలవిలాసములం దిలకించు సుందరా భీలవిచేష్టితం బమర భీమవనోద్భవసింహరేఖమై వాలవె యింక నీ వెలమి వామవిలోచన లంగజన్మలీ లాలసలై విపక్షులు భయాలసులై ధృతి యేది చూడఁగన్. |
345 |
| ఆ. |
ఎచట నున్న నైన నెల్లప్పుడును నిన్నుఁ | గన్నులారఁ జూడఁగాంచుఁ గాన తనయ! నిన్నుఁ గనిన తపనుండు గడుధన్యుఁ | డయ్యె; మందభాగ్య నైతి నేను. |
346 |
| చ. |
ఇనుఁ డఱచేత మాటువడు టెన్నఁడుఁ గల్గునె? నిన్ను నెమ్మి నేఁ గనియెదఁ గాక యింక నొకకాలమునం దయినం దనూజ! నీ వినుతశరీరభావమును వీనుల సన్మణికుండలంబులున్ ఘనతరవజ్రవర్మముఁ బ్రకాశత నొందక యుండనేర్చునే? |
347 |
| చ. |
దివి భువి నంతరిక్షమున దిక్కుల గాడ్పున నగ్నియందు న ర్ణవములయందు ఘోరవిపినంబులయందును నీకు నెప్పుడున్ శివ మగుఁగాక! దిక్పతులు సిద్ధులు సాధ్యులు రుద్రు లాశ్వినుల్ భువనము లర్కచంద్రులును బుత్త్రక! నిన్ గృపఁ గాచుచుండెడున్.’ |
348 |
| వ. | అని యేడ్చుచుం గుంతి యచ్చటం దడయ వెఱచి గూఢప్రకారంబునఁ గన్యాంతఃపురంబునకు వచ్చి యెప్పటి యట్ల వర్తిల్లుచుండె; నట మంజూషయు నశ్వనదీవేగంబునఁ జర్మణ్వతికిం జని, యందుండి యమునాగత మయ్యె; నట చని భాగీరథిం బడి సూతవిషయంబునం బంపానగరంబు చేరువ నరుగుచుండె; నా సమయంబున. | 349 |
| సీ. |
ధృతరాష్ట్రసఖుఁ డైన యతిరథుం డనుసూతుఁ | డతివయుఁ దానును నతివిభూతి గంగలోఁ జలకేళిసంగతుండై యుండి | తుంగతరంగానుషంగవశతఁ జనుదెంచు మంజూషఁ గని కడువేడుకఁ | దనపరిజనములఁ బనిచి పట్టి తెప్పించి ధీయుక్తి యొప్ప నేకతమున | నప్పెట్టెఁ దెఱచి తా నప్పు డందు |
|
| ఆ. |
వినుతహేమకవచుఁ గనకకుండలధరు | ననుపమానతేజు ఘనుఁ గుమారుఁ గని మనంబులోన ననయంబు విస్మయం | బొనర గ్రుచ్చి యెత్తికొని ముదమున. |
350 |
| వ. | తన జీవితేశ్వరి యైన రాధం జూచి ఇట్లనియె. | 351 |
| క. |
‘అనపత్యుల మగు మనకును | మనపాలిటివేలు పిక్కుమారుని నిచ్చెన్ వనజాక్షి! వీఁడు మానుష | జనితుఁడు గాఁ; డరయ దేవసంభవుఁడు సుమీ!’ |
352 |
| క. |
అని దానిచేతి కిచ్చినఁ | గొని యురమున నదిమి కొనియెఁ గొడుకు నతివ; య వ్వనితకుఁ బాలెంత తెఱం | గునఁ జన్నులు సేఁపె నపుడు గూరిమిపేర్మిన్. |
353 |
| వ. | ఇ ట్లాదంపతులు ప్రమోదసంపద సొంపారఁ గుమారుం గొని నిజమందిరంబున కరిగి యాత్మీయకులోచితంబు లగు జాతకర్మ సంస్కారంబొనరించి సహజకుండలాలంకృతకర్ణుం డగుటం జేసి కర్ణుం డను నామకరణంబు సేసి; రంత. | 354 |
| క. |
వసువర్మధరుఁడు గావున | వసుసేనుం డనెడుపేరు వాని కిడిరి పెం పెసఁగఁగ భూసురు; లాది | త్యసుతుం డిబ్భంగి సూతతనయుం డయ్యెన్. |
355 |
| వ. | తద్వృత్తాంతంబంతయుఁ గుంతి తన యాప్తచారులవలన విని, శిథిలీకృతసంతాపయై యుండె; నతిరథుండును గ్రమంబున సంప్రాప్తయౌవనుం డయిన కొడుకుం దోడ్కొనివచ్చి ద్రోణాచార్యులయొద్ద నస్త్ర శిక్ష సేయంబెట్టె; నా సూతసూనుండు మఱియుఁ గృపాచార్యులవలనను జామదగ్న్యువలనను, వివిధాస్త్రలాభంబు నొంది, క్రమంబున దుర్యోధనుతోడ బద్ధసఖ్యుండై యతనికిఁ బ్రియంబు సేయం దివిరి దివిజరాజనందనుతో మచ్చరించుచుఁ బాండవుల కప్రియంబు సేయుచుండె. | 356 |
| ఉ. |
ఆతని యస్త్రవీర్యము, సమంచితకుండల వజ్రవర్మవి ఖ్యాతియు, నాత్మలోఁ దలఁచి కౌరవనాయక! ధర్మసూనుఁడున్ భీతమనస్కుఁడై, యతఁ డభేద్యబలుం డని సంతతంబు ధై ర్యాతిశయంబు డించి హృదయవ్యథఁ బొందుచు నుండెఁ గానలోన్. |
357 |
| వ. | అయ్యుధిష్ఠిరునకుఁ బ్రియం బాచరింపంగోరి కర్ణుకవచకుండలంబులు కొనుటకై పురందరుం డొక్కనాఁడు బ్రాహ్మణరూపంబునం జని, మధ్యాహ్నసమయంబునఁ గర్ణుండు సూర్యోపాస్తి సేయుచుండి బ్రాహ్మణుల కభీష్టధనంబు లిచ్చుతఱి నతనిం గని, ‘భిక్షాం దేహి’ యనుటయుఁ గర్ణుం డతని కిట్లనియె. | 358 |
| చ. |
‘అలసవిలాసలాలసరసాన్విత లైన నితంబినీజనుల్ వలసిన, భూరివిస్ఫురితవస్తుసమగ్రము లైన గ్రామముల్ వలసిన, నుల్లసన్మణిసువర్ణవిభూషణగోధనావళుల్ వలసినఁ గోరు మిచ్చెద ధ్రువంబుగ’ నావుడు నాతఁ డిట్లనున్. |
359 |
| క. |
విను మివి యెయ్యవియును నా | కు నభీష్టము గావు; నీదు కుండలములు నీ వినుతకవచంబు నిచ్చినఁ | గొనియెద; ని మ్మోపుదేని గుణరత్ననిధీ!. |
360 |
| చ. |
అనవుడుఁ గర్ణుఁ డిట్లనియె ‘నక్కట! యేను విశిష్టవస్తువుల్ గొనకొని యిత్తు నాఁగ నిటు గోరెదు నీవు దలంప నప్రయో జన మగు వాని భూమిసురసత్తమ! యెంతయు బేల వైతి; ము న్నెనయఁగ నిట్టి వెవ్వరును నెవ్వరి వేఁడిరె యిజ్జగంబులన్? |
361 |
| క. |
కుండలములుఁ గవచము న | ట్లుండఁగ ని మ్మనఘ! వేఁడు మొండు ధనంబుల్; నిండింతు నీమనోరథ | మొండేమియు ననకు మింక నూర్జితచరితా!.’ |
362 |
| వ. | అనిన నతం డెవ్విధంబున నొడంబడక కవచకుండలంబులయంద బద్ధాభిలాషుం డయి పలికినఁ, గర్ణుం డతనిం బ్రార్థించియుఁబూజించియు ననేకమణికనకాది ద్రవ్యంబులు నివేదించియు నెట్లును నొడంబఱుపనేరక యి ట్లనియె. | 363 |
| తే. |
‘సహజములు నాకు నిక్కవచంబుఁ గుండ | లములు నివి లేకయున్న నే సమరభూమిఁ గడిఁది శత్రులచేత భంగంబు వచ్చుఁ | గాన యీఁజాల నయ్యెద వీని నేను. |
364 |
| క. |
నానాజనపదబహుళము | నానాధనయుతము నైన నారాజ్యము స మ్మానంబున నిచ్చెదఁ గొన | వే ననుఁ గారింప కింక విప్రవరేణ్యా!’ |
365 |
| వ. | అనియును నతనియందు సుముఖత్వంబు గానక కానీనుండు దరహసితాననుం డగుచుఁ గృతకభూసురు నుపలక్షించి యి ట్లనియె. | 366 |
| చ. |
‘ఎఱిఁగితి నిన్ను నేను; విబుధేంద్రుఁడ వీవు; జగత్త్రయంబు గ్ర చ్చఱ భవదీయరక్షణమునంద వెలుంగుచునుండు; నట్టి ని న్నుఱవుగ నేను వేఁడుకొన యుక్తుఁడఁగాక, మొఱంగి నన్ను న క్కఱ పడి నీవు వేఁడు టిది కర్జమె నిర్జితదైత్య! చెప్పుమా! |
367 |
| తే. |
అనిన నింద్రుఁ డిట్లనియె ‘మీయయ్య పద్మ | హితుఁడు మున్నింతయును జెప్పె నిష్ట మెసఁగ గాన నెఱిఁగితి నీ; వింకఁ గడప నేల | యనఘ! మాబోఁటులకుఁ బ్రియమైన పనికి’. |
368 |
| వ. | అనిన రాధేయుండు ‘దేవా యట్లయిన నిఖిలశత్రుఘాతిని యయిన నీయమోఘశక్తి నాకుం గృప సేసి కవచకుండలంబులు గొను’ మనినం బాకశాసనుం డి ట్లనియె. | 369 |
| ఉ. |
‘ఇచ్చెద శక్తి నీకు; విను మేర్పడ; నాజి మదీయశత్రులం గ్రచ్చఱఁ జంపి చంపి యది గ్రమ్మఱ చేతికి వచ్చుచుండు; నీ కిచ్చుట యట్లు గాదు; భువి నెందును దుర్జయుఁ డైన నీరిపుం జెచ్చెరఁ దున్ము నొక్కరుని; చేకుఱ నన్ను భజించుఁ గ్రమ్మఱన్. |
370 |
| వ. | ఇట్టిది సమయంబుగాఁ బరిగ్రహింపు’ మనినఁ గర్ణుండు ‘నాకుం గల పగతుండును నొక్కరుండ; వాని వధియించుటయ మదీయమనోరథం’ బనుటయుఁ బురందరుండు దరహసితవదనుం డై. | 371 |
| ఉ. |
‘నీ యభిలాష మేను మది నిక్క మెఱుంగుదు; నుగ్రశౌర్యతే జోయుతుఁ బార్థు నోర్తు నని చూచెదు; నీ కది యేల తీరు రా ధేయ! దయావిధేయుఁడు విధేయజగత్త్రయుఁ డవ్యయుండు నా రాయణుఁ డమ్మహాత్మునకు రక్షకుఁ; డేరికి వాఁడు సాధ్యుఁడే?’ |
372 |
| వ. | అనినం దపననందనుం ‘డది యట్లుండె; సహజం బైన కవచం బొలిచి యిచ్చిన మదీయదేహంబు వికృతం బగు; నిది యే మని యవధరించె?’ దనిన నింద్రుండు ‘నీ శరీరంబు భవజ్జనకుం డైన యరుణకిరణువర్ణం బెట్టి దట్టిదీప్తిం జెలువొందు’ నని పలికి వానికి నమోఘశక్తి యొసంగి ‘దీని నాపత్కాలంబునం దక్కఁ బెఱయప్పుడు ప్రయోగించిన నీ కపాయంబగు’ నని చెప్పెఁ; దదనంతరంబ యవ్వీరుండు కవచ కుండలంబులం బుచ్చి యతని కిచ్చె. | 373 |
| చ. |
అలఘునిశాతశస్త్రమున నంగము లెల్లను నిర్వికారుఁ డై యొలువఁ దొడంగినట్టియెడ హో యని కిన్నర యక్ష సిద్ధ సా ధ్యులు దివినుండి యార్చుచును దూర్యరవంబు సెలంగ నద్భుతం బెలయఁగఁ బుష్పవృష్టిఁ గురియించిరి కర్ణునిపైఁ బ్రియంబునన్. |
374 |
| వ. | ఇట్లు సూతపుత్త్రుని వికృతగాత్రుం జేసి వాసవుండు ప్రమోదవికాసభాసితుం డగుచు నిజలోకంబున కరిగెఁ; దద్వృత్తాంతం బంతయు విని కౌంతేయు లత్యంతసంతోషంబునం బొదలిరి; గాంధారేయులు దుఃఖవిదారితహృదయ లయి; రని యిట్లు కవచకుండలాభిహరణంబు సవిస్తరంబుగాఁ జెప్పిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. | 375 |
| క. |
‘అనయము దుస్తర మగు న | వ్వనవాసము నిస్తరించి ద్వాదశవర్షం బున కడపట నేమి విధం | బొనరించిరి మత్పితామహులు మునినాథా!’ |
376 |
| వ. | అనిన నమ్మహీపతికి నమ్మహీదేవుం డిట్లనియె; నట్లు మార్కండేయువలనఁ బుణ్యకథలు విని పాండవు లనంతరంబ క్రమ్మఱి ద్వైతవనంబునకుం జని, యం దొక్కనాఁడు సుఖాసీనుం డయి యున్న ధర్మరాజుపాలికి నొకబ్రాహ్మణుండు సంభ్రమంబునఁ జనుదెంచి యిట్లనియె. | 377 |