| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము |
| క. |
‘తరుశాఖఁ దగిల్చిన నా | యరణి యొకమృగంబు వచ్చి యతిరయమున న త్తరువును నొరసి కొనంగా | ధరణీశ్వర! తగిలెఁ జువ్వె తచ్ఛృంగమునన్. |
378 |
| క. |
దానిఁ గొని పఱచె నమ్మృగ | మానతరిపులోక! నాకు నయ్యరణిఁ దగం గా నిపుడు దేరఁ బనుపవె | భూనుత! నిత్యవిధిలోపమునఁ జనకుండన్.’ |
379 |
| చ. |
అనవుడు నా క్షణంబ మనుజాధిపుఁ డుద్ధతచాపహస్తుఁడై యనుజులుఁ దాను నెంతయు రయంబున నాహరిణేంద్రుపజ్జఁ గై కొని చని కూడముట్టి మెఱుఁగుల్ నిగుడం బటుసాయకంబు లే సిన నొకయమ్ము నమ్మృగము సెందద చేరద యద్భుతంబుగన్. |
380 |
| వ. | అదియును వారి నతిదూరంబుగా నెలయించికొని చని యొక్కఘోరవిపినంబున నదృశ్యంబైనఁ, బ్రయత్నంబు విఫలం బగుటకు విషాదంబు నందుచు నయ్యేవురు నతిశ్రాంతులై శీతలచ్ఛాయం బగు నొక్కవటమహీరుహంబు క్రింద విశ్రమించి; రప్పుడు నకులుండు ధర్మనందనున కి ట్లనియె. | 381 |
| క. |
‘కులశీలోన్నతియు విని | శ్చలకరుణారతియు ధర్మసంగ్రహమతియుం గల మనకు నివ్విధంబున | నలజడి వచ్చుటకు మూల మది యెయ్యదియో!’ |
382 |
| వ. | అనిన నమ్మహాప్రాజ్ఞుండతని కిట్లనియె. | 383 |
| క. |
‘వినుము సుఖమునకు దుఃఖం | బునకుం గారణము దనదుపూర్వకృతం బై చను కర్మమ; కారణ మిది | యని యన్యము గలుగనేర దం దొక్కటియున్. |
384 |
| వ. | అనుటయు భీమసేనుండు నకులున కి ట్లనియె. | 385 |
| ఆ. |
‘ప్రాతికామి వోయి పాంచాలిఁ గొలువులో | పలికిఁ దెచ్చి నపుడ యలుక యెసఁగ నాంబికేయసుతుల నందఱఁ దునుమక | యునికి నిట్టియెడరు మనకుఁ బుట్టె’. |
386 |
| చ. |
అనవుడు నర్జునుం డనియె ‘నాసభ సూతసుతుండు పేర్చి ప ల్కిన పటువాక్యముల్ వినియుఁ గిన్కకుఁ బూనక యేఁ దొలంగి కా ననమున కిట్లు కాతరజనంబులచాడ్పున నేఁగుదెంచుటన్ మనకు దురంతదుఃఖములు మానక పైకొని వచ్చెఁ దమ్ముఁడా!’ |
387 |
| వ. | అనిన యనంతరంబ సహదేవుం డిట్లనియె. | 388 |
| ఆ. |
‘దుష్టశీలుఁ డైన దుర్ద్యూతపరుని గాం | ధారుఁ బట్టి యేను దడయ కపుడ తునుమకునికి నిట్టి దుర్దశ పాలైతి | మనఘ! మనము కాననాంతరమున. |
389 |
| వ. | అని యి ట్లందఱు నన్ని తెఱంగులఁ బలుకుచుండ నజాతశత్రుండు నకులుం జూచి ‘భవదీయసోదరు లత్యంత పిపాసితు లైన వారు; నీ విమ్మహీరుహం బెక్కిజలంబు లున్నయెడ యరయు’ మనిన నతండును నవ్వనస్పతి సమారోహణంబు సేసి దెసలు కలయం బరికించి ‘దూరంబున సలిలంబు లున్న’ వని యన్న కెఱింగించిన, నతం ‘డట్లేని నీవు పోయి జలపానంబు సేసి మాకును జలంబులు గొనిర’మ్మని పనుచుటయు, మాద్రేయుండు వృక్షావతీర్ణుం డయి రయంబునం జని ముందట నతిమనోహరం బగు తటాకంబుఁ గని జలంబులు ద్రావంబోయిన నొక్కయశరీరభూతం బిట్లనియె. | 390 |