ఇతిహాసములు భారతము ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
నకులాదులు యక్షుని నిరాకరించి నీరు ద్రావి మూర్ఛితు లగుట (సం. 3-296-12)
క. ‘ఓ యన్న! యీ తటాకము | నాయది; నీ వీ జలము గొనఁగ వలతేనిన్‌
నా యడిగిన ప్రశ్నములకు | ధీయుత! యుత్తరము లిమ్ము తేటపడంగన్‌.’
391
క. అనుటయు నవ్వాక్యముదెస | ననాదరము చేసి నకులుఁ డక్కొలనం ది
య్యని నీరు ద్రావి నిశ్చే | తనుఁడై యాక్షణమ పడియెఁ దత్తీరమునన్‌.
392
వ. అట ధర్మపుత్త్రుండు సహదేవుం గనుంగొని ‘నకులుండు జలంబులకుం జని తడసె; నీ వరిగి యతనిం దోడ్కొని జలంబులు గొనుచు ర’మ్మనిన నక్కుమారుం డతి శీఘ్రగమనంబునంబోయి యాపద్మాకరతీరంబునం బడియున్న యన్నతెఱంగుఁ జూచి విస్మయశోకవ్యాకులహృదయుం డగుచు, ‘నిది యేమి నిమిత్తంబున నయ్యెనో!’ యని యూహించుచుఁబెల్లడరు తృష్ణాభరంబు సహింప నోపక జలంబులదెస నాసఁ జేసి కొలనికి డిగ్గిన నెప్పటిభూతం బి ట్లనియె. 393
ఆ. ‘అనఘ! యీజలాశయము నాయధీనంబు; | సాహసంబుఁజేసి చనదు చొరఁగ;
నాదు ప్రశ్నములకు నలి నుత్తరము లిచ్చి | వారిఁ గొనుము నీకు వలసినట్లు’.
394
క. అనిన నది యాదరింపక | ఘనుఁ డాసలిలములు ద్రావి గ్రక్కున విష మె
క్కినవిధమునఁ బరవశుఁడై | ఘనసాలమహీరుహంబు కైవడిఁ బడియెన్‌.
395
సీ. అంత నంతకసూనుఁ డంతరంగంబున | సంతాప మెసఁగ వాసవతనూజుఁ
గనుఁగొని ‘యన్న! నీ యనుగుఁదమ్ములు వోయి | కడుఁ దడవయ్యె; నిక్కాననమున
నెయ్యది వుట్టెనో? చయ్యన నీ వేఁగి | వారిని దోడ్కొని వారిఁ గొనుచుఁ
జనుదెమ్ము’ నావుడు ఘనభుజుం డధికర | యంబున నరిగి జలాశయంబు
 
ఆ. తీరభూమిఁ బడిన వారి నవారిత | మహితశౌర్యధనుల మాద్రిసుతులఁ
జూచి, విస్మయైకగోచరుఁడై సవ్య | సాచి యుల్లమున విషాద మడర.
396
క. నాలుఁగుదిక్కులు గనుఁగొని | యాలో నెవ్వరిని గాన కత్యంతపిపా
సాలసుఁడై సలిలంబులు | గ్రోలఁగ సమకట్టి యొయ్యఁ గొలనికి డాసెన్‌.
397
వ. డాయుటయు నయ్యశరీరభూతం బి ట్లనియె. 398
మ. ‘బలిమిం జొచ్చిన నెట్టివారికయినం బ్రాణంబుపై వచ్చు; నీ
సలిలావాసము మత్పరిగ్రహము; తృష్ణాఖేదమారం జలం
బులు ద్రావన్‌ వలతేనిఁ బ్రశ్నములకుం బొం దొందఁగా నుత్తరం
బులు నా కి’ మ్మనుడున్‌ మనంబునఁ బృథాపుత్త్రుండు సక్రోధుఁడై.
399
ఉ. ‘మ్రుచ్చిలి నిల్చి దుర్వచనముల్‌ పచరించినఁ జెల్లనిత్తునే?
చెచ్చెర నీయెలుం గడఁగఁ జేసెద నిప్పుడు సూడు’ మంచు వి
వ్వచ్చుఁడు శబ్దభేదిశరవర్గముఁ దద్వచనంబుచక్కటిం
గ్రచ్చఱ నించె మౌర్విరవకంపితసర్వదిగంతరాళుఁడై.
400
ఆ. ఇట్టు లేయుటయును నెప్పటివాక్యంబు | మఱియు వినఁగఁబడిన మఘవసూనుఁ
డలసి కొలనుఁ జొచ్చి యంబుపానము చేసి | యిలకు నొఱగె వివశహృదయుఁ డగుచు.
401
వ. తదనంతరంబ యుధిష్ఠిరుండు భీమసేను నాలోకించి ‘కవలును గవ్వడియును నింతదడయుటకు నిమిత్తం బెయ్యదియో నీ వరుగు’ మనినం గిమ్మీరవైరి మారుతజవంబున నమ్మువ్వురుఁ జనిన చొప్పునం జని పద్మాకరకూలంబున నిద్రాపరవశులుం బోలెఁ బడియున్న తమ్ములం గని దుఃఖితుండై. 402
తరలము ‘ఇది మనుష్యకృతంబు గాదు సురేంద్ర కిన్నర పన్నగ
త్రిదశనిర్మిత మైన కర్మము; దీని నింతయు నేర్పడం
బిదపఁ జూచెదఁగాక’ యంచును భీతిదూరుఁడు నీరువ
ట్టొదవఁ దత్సలిలాశయంబు సముత్సుకుం డయి చొచ్చినన్‌.
403
వ. అంతరిక్షగోచరం బైన వచనం బిట్లని వినంబడియె: ‘నయ్యా! నీ వి ట్లేల సాహసంబు సేసెద; విక్కొలను మత్పూర్వపరిగ్రహంబు; నీ వోపుదేని నా యడిగిన యర్థంబులకు నుత్తరంబు లిచ్చి జలంబులు ద్రావు’ మనిన నప్పలుకులు గైకొనక వృకోదరుండు నిపీతసలిలుండై యచ్చోటన మూర్ఛితుండై పడియె; నిట బాండవాగ్రజుండు. 404
క. తమ్ములు నలువురు నొక్కట | నమ్మెయి మసలుటకు నాత్మ నత్యంతవిషా
ద మ్మొలయ సముత్థితుఁ డై | క్రమ్మఱ నమ్మార్గ మపుడు గైకొని నడచెన్‌.
405
సీ. అపగత జనశబ్దమై, యనభివ్యక్త | మార్గమై, యవిరళదుర్గశైల
తరుగుల్మవల్లీవితానమై, గజసింహ | శరభ శార్దూల సూకర లులాయ
బహుళమై, బహువిధపక్షికోలాహల | భయదమై, కడుఁ బరపైన యడవి
ననుజుల వెదకుచు ననఘుండు సని కాంచెఁ | గమలాకరంబుతీరమునఁ బడిన
 
ఆ. వారిఁ బూరువంశవరుల భీమార్జున | యముల నమితబలుల విమలమతులఁ
బ్రళయపతితలోకపాలసంకాశుల | భూరిపుణ్యధనుల వీరవరుల.
406
మ. కని డెందంబునఁ దల్లడం బడర దీర్ఘశ్వాస వైవర్ణ్యముల్‌
దనుకం దాల్మి చలింప విస్మయపరీతస్వాంతుఁడై శోకబా
ష్పనిరుద్ధాకులలోచనుం డగుచు మూర్ఛల్‌ పైకొనం గొంతసే
పు నరేంద్రోత్తముఁ డుండెఁ జిత్రమున రూపుంబోలెఁ దా నచ్చటన్‌.
407
వ. పదంపడి డెందంబున ధృతి పొందుపఱుచుకొని యతం డన్నలువుర నుపలక్షించి నలుదెసలుం బరికించి యాత్మగతంబున. 408
తే. ‘ఒరులు వచ్చిన చొప్పు లే; దరిగినట్టి | చొప్పు లేదు; పెనంగిన చొప్పు లేదు;
ఘనభుజుల యంగకంబులు గనుఁగొనంగ | నక్షతము; లేల యొక్కొ యి ట్లయిరి వీరు?
409
ఉ. క్రూరుఁడు ధార్తరాష్ట్రుఁ డతికుత్సితుఁ; డెంతయుఁ బాపబుద్ధి గాం
ధారుఁడు పెక్కుమాయలకుఁ దావల; మక్కట! యద్దురాత్మకుల్‌
వారక యెద్దియేని యొకవంచనమై యిటు సేసిరొక్కొ! యె
వ్వారలు నాత్మ నమ్ముదురె వక్రవిచారులఁ బాపకర్ములన్‌.
410
క. వదనంబుల తెలివియుఁ గర | పదరుచియుం జెడదు; వీరు వడుటకుఁ గత మీ
యుదకము విషదుష్ట మనియు | మదిఁ దలఁపం బోల; దేమి మాయయొ యెఱుఁగన్‌.
411
చ. పుడమియు సర్వసంపదలుఁ బొల్పఱ వైరుల పాలుసేసి యీ
యడవికి వచ్చి భీకరమృగావలిపొందున నున్న వీరి వె
న్నడికొని యిట్లు సేసెనె యనాథులఁబోలె విధాతృఁ; డింక నె
క్కడఁ జనువాఁడ? నేది గడగాఁ దరియింతు దురంతదుఃఖమున్‌?
412
సీ. పుత్త్రులు దుఃఖార్తిఁ బొగులుట కనిశంబుఁ | బొక్కచునున్న యప్పుణ్యచరిత
మాతల్లి పాండునిమహిషి నా కెదురుగా | వచ్చి కౌఁగిటఁజేర్చి ‘వత్స! నాఁడు
నీతమ్ముఁగుఱ్ఱలు నీవును నడవుల | కరిగితి, రిప్పు డయ్యనుజు లెందుఁ
జనిరి? నీ వొకడవ చనుదెంచి; తిది యేమి?’ | యనిన నాయమతోడ నప్పు డేమి
 
ఆ. యనఁగ నేర్చువాఁడ? నాచార్యవిదుర శాం | తనవకృపులు నను ముదంబుతోడఁ
గుశల మడిగి రేనిఁ గుశల మే మనువాఁడ? | నెందుఁ దలఁగరాని యెడరు దగిలె.’
413
వ. అని పెక్కుతెఱంగుల వగచి యా ధర్మజుండు దప్పి కోర్వక నీళ్ళు ద్రావుటకై సరోవరంబులోనికి డిగ్గుటయు నెప్పటియట్ల యశరీరభూతం బిట్లనియె. 414
మ. ‘విను మే నొక్క బకంబ; నిక్కొలను పృథ్వీనాథ! నాసొమ్ము; నీ
యనుజుల్‌ మద్వచనంబుఁ గైకొనక తోయాస్వాదులై యివ్విధం
బునఁ బ్రాణచ్యుతిఁ బొంది; రీవును గడున్‌ మోహంబునన్‌ సాహసం
బునకుం జొచ్చిన నట్ల యయ్యెడు సుమీ! మున్ముట్ట వారించితిన్‌.
415
క. ఏ నడిగిన యర్థములకు | భూనుత! యుత్తరము లిచ్చి పొలుపొందఁ బయః
పానంబు సేయు’ మనవుడు | నా నిర్మలచరితుఁ డంబరాభిముఖుండై.
416
వ. ‘అయ్యా! నీవు బకరూపధరుండ వైన రుద్రుండవో, పావకుండవో, పవనుండవో! యట్లు గానినాఁడు కులపర్వతప్రతిము లయిన నాతమ్ములం బడఁద్రోచునట్టిబలంబు పులుఁగుల కెందునుం గలుగదు. దేవాసురగంధర్వయక్షాదులకు దుర్జయులైన యవ్వీరుల నిట్లు సేసి నీవు గాని వాఁడవ పోలెం దొలంగియున్నవాఁడవు; నాకు నద్భుతభయకౌతుకంబు లొక్కటం బొడమెడు; నీ వెవ్వండవు? నీతలంపెయ్యది? చెప్పి నాహృదయవేదన నపనయింపవే’ యనిన నదృశ్యభూతంబు. 417
ఆ. ‘కౌరవేంద్ర! బకమఁ గాను నే; విను మొక్క | యక్షవరుఁడ; నిచట నస్మదీయ
నికృతిఁ జేసి పడిరి నీతమ్ము లందఱు’ | ననుచు నాక్షణంబ యతని యెదుర.
418
మ. నిలిచెం దాళసముచ్ఛ్రితాంగుఁడు మహానిర్ఘోషసంతర్జితా
ఖిలభూతప్రకరుండు దీర్ఘవిపులగ్రీవుండు దంష్ట్రాసము
జ్జ్వలవక్త్రుండు విరూపలోచనుఁడు తీవ్రస్ఫారతేజోఘనుం
డలఘుం డా సరసీతటాంతమున నయ్యక్షుండు ఘోరాకృతిన్‌.
419
వ. ఇట్లు నిలిచి కౌంతేయాగ్రజున కి ట్లనియె. 420
క. ‘నాయనుమతి లేకుండఁగ | నీయుదకము ద్రావిరేని యెవ్వా రైనన్‌
ధీయుత! చత్తురు; నీ వటు | సేయవు సమ్యగ్విచారశీలుఁడ వగుటన్‌.
421
వ. కావున మదీయంబులగుప్రశ్నంబుల కుత్తరంబుసెప్పు మనిన నతండు ‘మహాత్మా! నీ చిత్తంబునకు వచ్చునట్లుగాఁ జెప్పనాబోఁటివానికి శక్యం బగునే? యైనను నా నేర్చువిధంబునఁజెప్పెద నడుగు’ మనిన నయ్యక్షుం డి ట్లనియె. 422
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )