పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ప్రథమాశ్వాసము
ధృతరాష్ట్రుని కడకు వేదవ్యాసుండు వచ్చుట (సం. 6-2-1)
క. దేవా! జనమేజయ వసు | ధా వల్లభుఁ డధిక వినయ తత్పరుఁడై సం
భావించి కుతూహలమునఁ | దా వైశంపాయనునకుఁ దగ ని ట్లనియెన్‌.
2
క. ఒండొరుల గెలుచు తలఁపునఁ | బాండవులును గౌరవులును బాహా గర్వో
ద్దండత నెట్లు దొడంగిరి? | భండన మెప్పాటఁ జెల్లెఁ బరమమునీంద్రా!’
3
క. అనుటయు వైశంపాయనుఁ | డనుమోద రసార్ద్రహృదయుఁడై యిట్లనియెన్‌
జనమేజయు మనమున సం | జనితంబగు కౌతుకంబు సఫలతఁ బొందన్‌.
4
వ. పుణ్యక్షేత్రోత్తమం బయిన యా కురుక్షేత్రంబున నా రెండు దెఱంగుల వారి కటకంబులును విడిసి కయ్యంబునకుఁ గాలు ద్రవ్వునట్టి సమయంబున ధృతరాష్ట్రుండు గొడుకుల దుర్వినయంబునకు నిర్వేదనంబు నొంది, సంజయద్వితీయుండై చింతించుచున్న యెడకుం ద్రికాలవేదియగు వేదవ్యాసుండు విజయం చేసి యమ్మహీపతి సేయు నర్చనంబులం గైకొని యతని కిట్లనియె: 5
క. ‘కాలం బగుటయు నృపులకు | నాలము సమకూరె; దీని కడలకు మది నీ
వాలోకింపఁగ వలసిన | నే లోనికి దివ్యదృష్టి నిచ్చెదఁ బుత్త్రా!’
6
చ. అనుడు నతండు ‘ఘోరముగ నన్నలుఁ దమ్ములుఁ బోరు క్రూరతం
గనుఁగొనఁజాల, నేను వినఁగా వలతుం; దదనుగ్రహంబు సే
సినఁ గడు లెస్స’యన్న ముని చిత్తమునం గరుణించి సంజయుం
బనిచె మహారణంబు పరిపాటిమెయిన్‌ సకలంబుఁ జెప్పఁగన్‌.
7
వ. ఇట్లు ధృతరాష్ట్రునకుం గయ్యంబు తెఱంగు వినిపింప నియోగించి యా సూతనందనునకు నా రెండు తెఱంగులవారి, దివారాత్ర ప్రవర్తనంబులు గనునట్లును, రహస్య ప్రకార భాషణంబులు వినునట్లును మనోవృత్తంబు లెఱుంగు నట్లునుంగా వరం బిచ్చి, యతి శీఘ్ర గమనంబు నొసంగి, భారత సమర ధరణిం దిరిగినను శస్త్రాస్త్రంబు లెవ్వియుం దాకకుండు నట్టి ప్రభావంబుఁ బ్రసాదించి, దివ్యుల యాలాపంబులు రూపంబులుం దలంపులుం దేటపడునట్టి మహనీయ బోధంబును గలుగ ననుగ్రహించి, యావైచిత్ర వీర్యు నాలోకించి ‘యిది ప్రాప్తకాలంబై వచ్చిన భూప్రజాక్షయంబు; దీనికి వగవం బని లేదు ‘ధర్మోజయ’ తనుచు నిశ్చింతంబున నుండు; మేనును గురుపాండవుల కీర్తిఁ బ్రకటింపంగలవాఁడ’ నని యతని నాశ్వాసించి సాత్యవతేయుండు వెండియు. 8
క. ‘మొగుళులు లేకయు నుఱుములు | గగనక్షోభంబు సేసెఁ; గరి హయ తతిఁ బె
ల్లుగ నశ్రు లురలఁ జొచ్చెను; | మృగములు పక్షులను, బసులు మృగముల నీనెన్‌.
9
క. నలువురు నేవురు బిడ్డలు | గలిగెద రొక్కొక్క వనిత గర్భంబున; వా
రలు పుట్టినపుడ యాడుచుఁ | గలకల నవ్వుచుఁ జెలంగఁ గనియెద మెందున్‌.
10
తే. అర్కు నుదయాస్తమయములయందుఁ గృష్ణ | కాంతి ఘోరకబంధంబు గప్పఁ జొచ్చె;
నిందు లాంఛన స్థితి తలక్రిందుగాఁగఁ | దోఁచుచున్నది ప్రజ యెల్లఁ ద్రుంగకున్నె.
11
వ. విశేషించియుం గౌరవ నికేతనంబులఁ గేతనంబులఁ బొగ లెగయుటయు, నాయుధంబులు మండుటయు, నివి మొదలుగా ననేక దుర్నిమిత్తంబులు వుట్టుచున్నయవి; కులక్షయంబును నానా నరేంద్ర నాశంబును నగు; నుపేక్షింపం దగదు; దుష్పథవర్తులగు దుర్యోధనాది కుమారుల వారించి నీ తమ్మునిపా లతని కొడుకుల కొసంగి శాంతి సేయుట మేలు; మము బోంట్ల మనంబులకుం బ్రియంబు గాని యీ రాజ్యంబు నీ కేటి?’ కనిన విని యమ్మనుజేంద్రుం డమ్మునీంద్రున కిట్లనియె: 12
చ. ‘హితమును ధర్మముం దలఁచి యిమ్మెయిఁ జెప్పితి రిట్లు మున్ను; నా
సుతుల నయంబుమైఁ దఱిమి చూచితి; వారలఁ బంపు సేయ నేఁ
జతురుఁడఁ గాను; బ్రాభవము సాలదు; నాదెసఁ దప్పులేమి మీ
మతిఁ దలపోసి యీ పలుకు మానుఁడు పాకము దప్పెఁ గార్యముల్‌.’
13
వ. అనిన విని పరాశరసూనుండది యట్లుండ ని మ్మింక నేనేమియుం జెప్పవలయు నది గలదే?’ యని పలికిన నాంబికేయుండు గయ్యంబున గెలుపుఁ దెలుపు నిమిత్తంబు లడిగిన నమ్మునివరేణ్యుండు వహ్నులు హోమకాలంబునం బుణ్యగంధములతోఁ బ్రదక్షిణార్చు లగుటయు భేరీ ప్రముఖంబులు గంభీర ఘోషంబు లగుటయు వాయువు లనుకూల మృదు మనోహర ప్రచారంబు లగుటయు నివి మొదలుగాఁ గొన్ని శుభ సూచకంబులు నిర్దేశించి, ‘కొంచెంబు పెద్ద యన లేదు; సమరంబున జయంబు దైవాధీనంబు గావునం బెద్దలు పెనఁకువ లొప్పవని చెప్పుదు; రేను బోయివచ్చెద నని చెప్పి సముచిత ప్రకారంబున నంతర్ధానంబు సేసెఁ; దదనంతరంబ యక్కౌరవేంద్రుండు గొండొకసేపు చింతించి నిట్టూర్పు నిగుడించి సంజయున కిట్లనియె. 14
ఉ. భూమికిఁ గాఁగఁ బ్రాణముల పోక దలంపక రౌద్ర ఘోర సం
గ్రామము సేయుచుండుదురు రాజులు దొల్లియు; నెంత దీపొకో
భూమి; మునీంద్రసంగతి సుబుద్ధము నీకు జగంబు; నాకు నీ
భూమి తెఱంగు సెప్పుము ప్రబోధ నిరూఢముగా సమస్తమున్‌.
15
వ. అనిన విని సంజయుం డతని కిట్లను ‘నా యెఱింగి నంతయు నెఱింగించెద భూతత్త్వప్రకారం బవధరింపుము.’ 16
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )