పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ప్రథమాశ్వాసము
కర్ణుని రెండవ నాఁటి యుద్ధము (సం. 8-22-10)
వ. అనినం బ్రియం బంది నీనందనుం డతనిం దగువారలను నిజనివాసంబులకుం బోవం బనిచి తానును నభ్యంతర మందిరంబున కరిగె నారాత్రి సుఖనిద్ర సేసి రేపకడ సమస్త జనంబులు సంగ్రామంబునకు నడచి రంత నక్కడ నుక్కుమిగిలి పాండవబలంబులుం దోతెంచె ధర్మనందనుండు బృహస్పతి మతంబున దుర్జయ వ్యూహంబు వన్నించినం జూచి మనవారును దానికిం బ్రతిగా మోహరించుటకై రాధేయు రాకకు నెదురు చూచుచు నొకభంగిం బన్ని’ రనిన విని యాంబికేయుండు. 218
క. శీతార్తజనంబులు ప్ర | ద్యోతను నుదయంబు గోరుచున్న కరణిఁ దా
నేతేరఁ గోరు జనులకు | నాతఁడు నిజ తేజమునఁ బ్రియం బొసఁగెనొకో?
219
ఉ. అమ్మెయి ధర్మనందనుని యగ్గలికం దొలునాఁడు రాజు బ
న్నమ్ములపాటు సూచుచు రణంబుకడంక దొఱంగి చన్న బం
టెమ్మెయి నద్దినంబున నహీనపరాక్రమలీల సూపెనో
తమ్ము నెఱుంగరేమియు నతండును నాతఁడు నేమి సేయుదున్‌?
220
తే. కర్ణుఁ డట్టె? కలనఁ గౌంతేయ వర్గంబుఁ | గృష్ణయుతముగాఁగ గెలవఁ జాలు
నేమి సెప్పఁ గలదు? మీ మానవేంద్రుని చిత్తమాంద్య మతనిఁ జెఱుపకున్నె?
221
క. సౌబలు నీతియుఁ గర్ణు భు | జాబలమును గూడి తనకు సామ్రాజ్యం బీఁ
గా బలసి వెలయు వాఁడై | యా బే లూఱడు మనంబునం దేప్రొద్దున్‌.
222
క. జూదంబునాఁడు మొలచిన | యాదుర్దశ పెరిఁగి సంజయా! నిర్భర దుః
ఖోదయపరంపరా సం | పాదినియై మనసునిట్లు పఱిగొనియెడినే?
223
క. దుర్యోధనుచేసిన యవ | కార్యంబున వచ్చినట్టి కష్టంబులు దా
త్పర్యంబున వినియెదఁ బ్రతి | కార్యంబులు గామి మనసు గందుచునుండన్‌.
224
క. పాండునృపుసుతులలో నొ | క్కండైనను నొవ్వఁ డింతకును మును వనితా
మండలి చేరువ మెలఁగెడు | గండున మెఱసెదరు కురునికాయము నడుమన్‌.
225
వ. దైవంబు బలవంతం’ బనిన విని సంజయుం డజ్జననాథునితో ‘దేవా! వినుము. వగచినం గృతపడిన కార్యంబు గ్రమ్మఱం బొడమునే? డెందము గుందునంతియకాక యట్లుంగాక నీవుసేసిన యదియ చూవె ఫలించె భండనంబు వలదని యెన్ని భంగులం జెప్పినం బాండవులకుం గీడు దలంచి యప్పలుకులు గైకొనవైతివి వారలవలన ము న్ననేక పాపంబు లాచరించితి నీవలన జనక్షయంబు వాటిల్లెం గావునఁ గడవంబడిన దానికి వగవం బనిలేదు దారుణంబైన రణప్రకారంబు విను’ మనుటయు నతండు ‘కర్ణుండట్లు దడసిన కారణంబుఁ దొడంగి యెఱిఁగింపు’ మనుటయు నమ్మానవేశ్వరునకు నా సూతనందనుం డిట్లనియె. 226
క. రేపకడ సకల బలములు | భూపాలురు వెడలి నడువఁ బోరికి బిదపన్‌
నీపుత్త్రుఁడు వెడలెను సా | టోపతఁ దమ్ములును గర్ణుఁడును దో నడవన్‌.
227
వ. అయ్యవసరంబున. 228
సీ. రథము రథమ్ముఁ జేరఁగఁదెచ్చి యమ్మేది | నీశ్వరుతోఁ గర్ణుఁ డిట్టు లనియె
‘నాకుఁ గృత్యంబు లనేకముల్‌ గలిగె ము | న్నా ధనంజయునకు నట్ల కాన
యీరసంబున మాకు నిద్దఱ కొండొరు | విడువక పెనఁగఁ జొప్పడద యింకఁ
గలహ మొక్క మొగంబు గావున నేఁ డేము | దలపడి పోరుదు మలవుఁ జలము
 
ఆ. నుల్లసిల్ల నొక్క రొకరుని నొంపను | జంపఁ జూతు మా నిలింపనాథు
వలనఁగన్నశక్తి వొలియుట నా మీఁద | నలుకు లేక తఱుము నాతఁ డధిప!
229
వ. అప్పుడు చే నెత్తురు గాకుండ నక్కిరీటి గీటడంగించు విధం బూహింపుము. 230
చ. సరి యగు నాకు దివ్యశరజాలములం దలపోసి చూడ న
న్నరుఁడు దృఢత్వ లాఘవగుణంబులఁ దక్కువ దూరపాత వి
స్ఫురణఁ గరంబు వట్రపడు భూవర! సౌష్ఠవరేఖ నేమియున్‌
దొరయఁడు ధైర్యశౌర్య పటు దోర్విభవంబుల హీనుఁడెంతయున్‌.
231
క. మును విశ్వకర్మ దేవేం | ద్రునకై నిర్మించె మహిత రూపము విజయం
బను చాపము దానను బహు | దనుజుల మర్దించె నతఁ డుదగ్రస్ఫూర్తిన్‌.
232
చ. పరిచయసక్తచిత్తుఁడయి భార్గవరామున కాతఁ డిచ్చినం
బరుష పరాక్రమమ్మున నృపాలుర నెల్లను నమ్మహాభుజుం
డిరువదియొక్కమాఱు సమయించెఁ దదీయ నితాంతశక్తి న
ప్పరమదయాపరుం డొసఁగెఁ బార్థివ! నాకది గూర్మి పెంపునన్‌.
233
ఉ. ఆ మహనీయ చాపమున నర్జును దర్పమడంచి నేఁడు సం
గ్రామము నుజ్జగించెద నకంటక సుస్థితి గల్గ మేటినై
భూమి యమర్చెదం గొనుము భూవర! నీదగు పుత్త్ర పౌత్త్రులన్‌
శ్రీమహిమన్‌ సమస్తజన సేవ్య మహోన్నతిఁ బొందు’ నట్లుగన్‌.’
234
వ. అని పలికి వెండియు నిట్లను ‘నా విజయంబును విజయు గాండీవంబును నొక్కరూప యతనికి నక్షయ తూణీరంబులు నగ్నిదేవుం డిచ్చిన యభేద్యరథంబును నవధ్య రథ్యంబులును గల వవి యెక్కుడయినను దాని కంతఁ జింతింప. 235
క. నారాచము లాదిగఁ గల | ఘోరప్రదరములు బండ్లఁ గొని వచ్చెద బల్‌
తేరులు దృఢవాజులు నా | తేరి వెనుకఁ బె క్కమర్చి తెచ్చెద నధిపా!
236
వ. మఱియు నొక్కం డాకర్ణింపుము; భువన ప్రవర్తకుండయిన కృష్ణుండు సారథ్యంబు సేయుట నప్పార్థు పరాక్రమం బసాధ్యంబై యుండు నట్లగుటం జేసి. 237
తే. భండనము నేర్పుమెయిఁ గృష్ణుపాటియనఁగ | మహిఁ బొగడ్తకు నెక్కిన మద్రనాథు
నాకు సారథిగాఁగ నొనర్ప వలయు | గెలుతు నట్లైన నన్నరు నలవు మెఱయ.
238
క. హరి కెక్కు డరయ మద్రే | శ్వరుఁ డశ్వజ్ఞానమున నసంశయ మే న
న్నరునకు మిక్కిలి బలవి | స్ఫురణంబునఁ గర్మకుశలబుద్ధిఁ దలంపన్‌.
239
క. కావున నవ్వర మి మ్మటు | గావించుట యెల్లహితముఁ గావించిన య
ట్టై వెలయు! నింత సేసి మ | హీవర! ననుఁ జూడు పోర నె ట్లేచెదనో.
240
క. విను మి త్తెఱఁగున నే న | య్య నిమిషవర్గంబునైన నాజి జయింతున్‌
మనుజులు పాండుతనూజులు | జననాయక! నాకు నొక్క సరకే? తలఁపన్‌.’
241
వ. అనిన విని నీ పుత్రుండు ప్రీతుం డయి రాధేయు నగ్గించి నీకెల్ల భంగిని శల్యు సారథిం గావించెదనని పలికి యుత్సాహదీప్తుం డై. 242
క. అమ్ముల బండ్లును రథ ర | థ్యమ్ములునుం బెక్కుదెత్తు నవనీశులు నా
తమ్ములు నేనును నీ పా | ర్శ్వమ్మున నడచెదము బరవసం బుగ్రముగన్‌.
243
క. అని చెప్పి ప్రీతుఁ డగు నా | తనిఁ దోడ్కొని నడచి సముచితంబుగ శల్యుం
గని భక్తిఁ బ్రణతుఁడై యి | ట్లను దుర్యోధనుఁడు సవినయముగ నతనితోన్‌.
244
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )