పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ప్రథమాశ్వాసము
శల్యుఁడు కర్ణునకు సారథ్యంబు సేయ నొడంబడుట (సం. 8-25-6)
క. ‘వీనులకుం బలుకులు సేఁ | దైనను జెప్పుదు హితంబులగు కార్యంబుల్‌
దానికి నోర్వఁగవలయుం | గాని యలుక వలదు నీకుఁ గర్ణున కధిపా!’
310
ఆ. అనినఁ గర్ణుఁ డిట్టులను మద్రపతితోడ | హరున కజుఁడు నరున కచ్యుతుండుఁ
బోలె హితుఁడ వగుము బుద్ధి పరాక్రమ | శాలి నాకు నీవు సంగరమున.
311
వ. అనవుడు నట్లకాక యని శల్యుండు వెండియు 312
క. ‘తగువార లొరులఁ దెగడుట | పొగడుట యగు పలుకు పొంతఁ బోవరు హితకా
ర్యగతులు సెప్పఁగఁ దెగ డగుఁ | బొగ డగు నెదురోర్వవలయు బుద్ధిగలిగినన్‌.
313
తే. శక్రుతేరైన నడపంగఁ జాలువాఁడ | నుఱవు సెప్పుదు రథికునేమఱఁగ నీను
గృష్ణసారథ్యఘనుఁడగు క్రీడి గెలువఁ | దలఁచు నీ కేను గడపుటదగు రథంబు.’
314
చ. అన విని భూవిభుండు ప్రియమారఁగఁ గర్ణునిఁ జూచి ‘దేవకీ
తనయుఁడు మద్రనాథునకుఁ దక్కువ మాతలియుం దలంప నీ
తని కెనరాఁడు భాగ్యము కతంబున సారథియయ్యె నీకు నీ
యనఁ గొని నీవు పార్థునియహంకృతి మాన్పుము ధీరమానసా!’
315
క. అని యతఁడు శల్యుఁగనుఁగొని | వినతుండై ‘నీవు లావు వెరవును మెఱయం
దనుఁగాన నంగపతి య | ర్జునుఁ గలన జయించువాఁడు రూఢిగ’ ననుడున్‌.
316
వ. అట్లయ్యెడుం గాక యని పలికి మద్రేశ్వరుండు సారథ్యంబున కనురూపంబగు సన్నాహంబున నుత్సాహంబు వాటించినం బ్రీతుం డగుచు సూతనందనుండు దన సూతు నాలోకించి తగు రథంబునకుం గల్పన యొనర్పుమని సత్వరంబుగాఁ బనిచిన వాఁడును రయంబున దృఢసుందరంబగు స్యందనంబు సుకల్పితంబుసేసి తెచ్చి దీవించి యిచ్చిన నయ్యరదంబుఁ బూజింపఁ బురోహితు నియమించి తదీయ మంగళవిధానానంతరంబ తాను నర్చించి కృతప్రదక్షిణుండై ప్రణమిల్లి భాస్కరోపస్థానం బాచరించి సవినయంబున శల్యు నారోహణంబుసేయు మనుటయు నతం డచలతటంబునకు లంఘించు సింగంబు చందంబున నొగలెక్కిన. 317
ఆ. మెఱుఁగు తోడి లలిత మేఘంబు మీఁదికిఁ | బోయి వెలుఁగుభాను పొలుపు దోఁప
మద్రరాజసహితమహితమై యొప్పు న | త్తేరు కర్ణుఁ డెక్కి తేజరిల్లె.
318
వ. అని యిట్లు కర్ణసారథిత్వంబు శల్యుండు, మెయికొనుట సంజయుండు ధృతరాష్ట్రునకుం జెప్పె ననిన విని యటమీఁది వృత్తాంతం బెఱింగింపు మనుటయు. 319
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )