| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అనిన విని సంజయునకు ధృతరాష్ట్రుం డిట్లనియెఁ ‘గర్ణుండు దన మొన యె ట్లాయితంబు సేసెఁ? గౌంతేయ ముఖ్యసైన్య సన్నాహం బెట్టి? దతం డతనిం బొదివిన యప్పుడు గవ్వడి యెవ్వలన నుండె? నవ్వీరుం డన్న కడ నున్న నా సూతనందనున కట్లు సేయ వశంబగునే? వాసవుండు సకల సురగణంబులతోఁ బన్ని యన్నరునిపై వచ్చి ఖాండవంబు గాల్పకుండఁ గావం జాలెనే? బ్రదుకున కాసపడు మగల కతని మార్కొనవచ్చునే? రాధేయునకు వచ్చుంగాక? యనుటయు. | 143 |
| తే. |
ఇట్టు లను సంజయుం డమ్మహీశ్వరునకు | ‘నంగపతి మోహరంబు తెఱంగు, ధర్మ సుతుని యొడ్డు విధంబు, నర్జునుఁడు వారి | పోరునెడ లేమియును మీఁది పోరు వినుము. |
144 |
| వ. | కృపాచార్యుండును గృతవర్మయు మాగధులు వలపట, శకునియు నులూకుండును గుఱ్ఱపు దడంబులతో వారికెలనను, సంశప్తక గణం బిరువది నాలుగు వేలు రథిక ముఖ్యు లగ్గలిక నుల్లసిల్లి దాపటను, నీ కొడుకులందుఁ గొందఱు కాంభోజ శక యవన సైన్య సమేతంబుగా వారియవులను, బాహుబల భాసితుండై దుశ్శాసనుండు వెనుకనుం, గతిపయసోదర పరివృతుండై, కురురాజు పిఱుందను, నశ్వత్థామ ప్రముఖ యోధులు గరినికరకృత సన్నాహులై యన్నరపతి నియోగింప నతనిపజ్జ నిలువ నిజపుత్రులుఁ దన చుట్టునుఁ, గదిసి యెసకమెసఁగు పరవశంబున మెఱయ సూతసూనుండు సేనాముఖంబునకుం దిలకంబై నిలిచి వొలిచె నట్లు మోహరించి మదకల మాతంగంబుల తఱచు కతంబున మొయిళ్ళ మొత్తంబుల కైవడిం గాఱుకొను నమ్మొన నురవడి నడిపించు నా కర్ణునిం గనుంగొని కౌంతేయాగ్రజుండు గాండీవి రావించి యి ట్లనియె. | 145 |
| ఉ. |
‘సూతతనూజు మోహరము సూచితె? యెంతయు గట్టియై సము ద్ద్యోతిత భంగిఁ దోచె నది యుక్కునఁ బైఁబడి యిబ్బలంబు ని ర్ధూతము సేయకుండఁగ నెదుర్కొని యెమ్మెయి నిల్వరింత మ న్నీతి విధింపుమా? బలుపు నేర్పును దద్‌జ్ఞులు పిచ్చలింపఁగన్.’ |
146 |
| వ. | అనుటయు సంక్రందన నందనుండు. | 147 |
| తే. |
సారవంత మై కర్ణుని సైన్య మురవ | ణించుఁ గా కేమి దీనికి నృపవరేణ్య! పూని చేయంవగలయుఁ బ్రధానకార్య | మతని సమయించుటయ; నాకు నది భరంబె?’ |
148 |
| వ. | అనిన విని యమ్మనుజపతి యతని కిట్లను ‘నట్లేని నీవు రాధేయుని గెలుపుము; భీమసేనుండు సుయోధనుని, నకులుండు వృషసేనుని, సహదేవుండు సౌబలుని, శతానీకుండు దుశ్శాసనుని, సాత్యకి కృతవర్మను, ధృష్టద్యుమ్నుండు ద్రోణపుత్రుని, ద్రౌపదేయులు శిఖండియుం దారును దక్కటి ధార్తరాష్ట్రులం దలపడువా; రేను గృపాచార్యుని తోడం బెనంగెద’ ననుటయు ‘నట్లకాక’ యని యతండు మున్ను దను నిలిచిన నెలవునకుం జనునెడ నయ్యుధిష్ఠిరు పనుపు తెఱంగు వారలందఱకు నెఱింగించె; నతండు వలపటి వలన సైన్యాగ్రవర్తి యయ్యును, వృకోదరుండు వామపార్శ్వవర్తి యయ్యును. శైనేయ ద్రౌపదేయ సమేతంబుగా నప్పాండవాగ్రజుండు మధ్యభాగస్థుండయ్యు నున్న యమ్మోహరం బా సూతనందను మొన యురవడి సరకు గొనక మార్కొనియె’ ననవుడు నాంబికేయుండు. | 149 |
| మ. |
‘నరుఁ డమ్మై విని వచ్చె నన్నరునకు న్సంశప్తకశ్రేణికి న్దుర మత్యుద్భట భంగిఁ జెల్లుటయు మున్సూచించితీ వయ్యుధి ష్ఠిరునిం గర్ణుఁడు దాఁకి యోర్చె ననియుం జెప్పంగ వింటిన్ రణం బరయం జిత్రము; సెప్పు మత్తెఱఁగు సువ్యక్తంబుగా సంజయా!’ |
150 |
| వ. | అని యడిగిన సంజయుం డమ్మానవపతి కిట్లను ‘నట్లు ధర్మజుండు సెప్పెఁ; గాని యయ్యిరువాఁగుం గదిసినప్పు డన్నియమంబు నడవక కయ్యంపు టౌచిత్యంబున నొండు దెఱంగు సెల్లె నది యెఱింగించెద నవధరింపు; మవ్విధంబున మొనలు రెండును నొండొంటిం దార్కొను సమయంబున సవ్యసాచి కర్ణు నడచు చక్కటికి నడరం గడంగినఁ గ్రాలు కపికేతనంబు గనుంగొని తెంపు పెంపునఁ బొంపిరివోవుచుఁ ద్రిగర్తాది సంశప్తకులు సరభసంబుగా నడ్డపడి పైకొని తఱిమి పొంగిన పయోనిధిం బోలిన నబ్బలియుండు సెలియలికట్టం బోలి నిలువరించి మాతంగ ప్రముఖ సేనాంగ సకలాంగ శకలంబుల నిలాతలంబు గప్పుచుండ నొండొండ పేర్చి యా బలం బా బలమర్దన నందను నరదంబు ముంచికొనిన నవ్వీరుండు విజృంభిత విక్రముండై బడబాగ్ని కీలాకలాపంబు చందం బగు సాయక నికాయంబు నిగిడించుచు నెక్కుడుమదంబున నమ్మూఁకలం ద్రెక్కొనుచుండఁ దత్ప్రకారం బాలోకించి రాధేయునకు శల్యుం డి ట్లనియె. | 151 |
| ఉ. |
‘అల్లదె యర్జున ధ్వజ విహారము గానఁగనయ్యెడుం గపీం ద్రోల్లసనంబునన్ మెఱపి యుద్భటులైన త్రిగర్తు లేపు శో భిల్లఁగ వారె! యన్నరుని బెట్టుగఁ దాఁకి; రతండు నంప సె న్వెల్లి నిగిడ్చి ముంచె నదె నింగి గుణధ్వని వొంగ వారలన్.’ |
152 |
| వ. | అని చెప్పి చూపెఁ బదంపడి భారద్వాజ పుత్రుని బరవసంపు మాటల నాటోపంబు మిగిలి మన రథికులు గవిసిన దారుణ రణం బయ్యె నని యాకర్ణించి తది యేర్పడ వినుము వివరించెద. | 153 |
| సీ. |
కృపుఁడు సౌబలుఁడును గృతవర్మయును నలిఁ జెలఁగు మూఁకలతోడఁ బెలుచఁ గవిసి కాశ కైకయ మాత్స్య కోసల పాండ్యాది | బలములఁ దాఁకి రగ్గలిక మెఱయ నా రెండు వాఁగుల నాయుధంబుల యెఱ | మంటలుఁ బొళ్ళును మింటఁ బుడమిఁ జూడ నక్కజముగ శోణిత ధారలు | ప్రచుర ధూళీ తిమిరముల నడఁప |
|
| తే. |
భగ్న రథములు నిపతితేభములు నిహత | హయములును మృతభటులును రయమునకు వి ఘాత మొనరింప నున్మద గమనభంగు | లందు వెరవులు మెఱయ బోరాడి రధిప! |
154 |
| వ. | ఆ లోన. | 155 |