పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము
కర్ణుఁడు పాంచాల కుమారుల ననేకులం జంపుట (సం. 8-43 (కుంభ))
ఉ. మేలి మదావళంబులును మేటి హయంబులుఁ దమ్ము పిండు నా
భీలతఁ జుట్టిరాఁగ రథబృందముతోఁ గురురాజు కర్ణుదో
ర్లీలకుఁ దోడ్పడం గడఁగె రేణు వుదీర్ణముగా నతండు పాం
చాల బలంబుపై నడరె శౌర్య సముద్భటబాహువీర్యుఁ డై.
156
వ. అబ్బలంబునకు బాసటయై చేది సైన్యంబును బెనుఁబ్రాపై పాండవానీకంబునుం దఱిమినఁ బెఱిగిన దర్పంబునం బ్రదీప్తుండయి యక్కర్ణుం డా గట్టి మూఁకలం దఱిసి మెఱుంగు వాలమ్ములు వఱప. నవి పీనుంగు పెంటలగుచుండ నుఱక యుక్కునం బొదివిన బలు మగలకుం గీర్తియు స్వర్గంబును నొసంగి, తమ వారికంటెఁ బ్రమోద భరితులం జేయుచు సాయకాసారంబులు వరఁగించుచు బహువిధ రథ ప్రచారంబు లుల్లసిల్ల నా సేనలును గృప కృతవర్మాది యోధ బృందంబులతోఁ బెనంగు మొనలును నొక్కటిగాఁ గలంచి యందు శోణిత జలంబునను మాంసమజ్జా మస్తిష్క కర్దమంబులను బతితాతపత్ర హంసంబులనుం బొలుచునట్టి నదీ ప్రవాహంబులు వఱపె ననుటయు ధృతరాష్ట్రుండు ధర్మనందనుం గర్ణుండు గదియు నప్పు డతని కక్కడ నడ్డపడుట కెవ్వరు గడంగి? రిక్కడ నితనికిఁ దోడ్పడ నెవ్వారు గలిగి రనుటయు సంజయుం డవ్విభున కి ట్లనియె. 157
తే. ఇవ్విధంబున సేనల క్రొ వ్వడంచి | సూతసూనుండు ధర్మజు కేతనంబు
దెసకు నడర ధృష్టద్యుమ్నుఁ డెసకమెసఁగ | బంధులును దాను వడి నడ్డపడియె నధిప!
158
క. వారలఁ గడచి ప్రభద్రకు | లా రాధేయు పయిఁ గవియ నాతండు మహో
దారుల నేడ్వుర భద్రా | కారుల నారాచ సప్తకంబునఁ గూల్చెన్‌.
159
క. కని పాంచాలురు గోపం | బును దర్పము నెఱయ మెఱయఁ బొదివిన రాధా
తనయుం డిరువదియేవురఁ | దునిమె నిరువదేను వెడఁద తూపులఁ బెలుచన్‌.
160
క. వెండియు నేపునఁ బైకొని | చండ శర ప్రకరములు వెసం గురియఁగ ను
ద్దండతఁ బాంచాలురఁ గ | ర్ణుం డేవురఁ జంపె నైదు క్రూరాస్త్రములన్‌.
161
వ. ఇట్లు భానుదేవ చిత్రసేన సేనాబిందు తపన శూరసేనులం గీటడంచి యాటోప దీపితుండయి చక్ర రక్షకులగు సుషేణ సత్యసేనులు వెనుక బలసివచ్చు వృషసేనుండు నిమ్మువ్వురు గొడుకులుఁ గడిమి రూఢి కెక్కం దనకు రణక్రీడకుం దోడుపడియెడు నుల్లాసంబున నుల్లంబు పల్లవింపం బాండవ బలంబులం గలంచు నయ్యంగ పతి మీఁద ధృష్టద్యుమ్న శిఖండి జనమేజయ ప్రముఖ పాంచాల కుమారులును సాత్యకి నకుల సహదేవ ద్రౌపదేయులును గేకయ మాత్స్య యోధవీర వ్రాతంబును భీమసేన పురస్సరంబుగాఁ దోతెంచిన బహుళ జలధరంబులు ధరణీధరంబు పయిం గురియు పెనుసోన చందంబు దోఁప వివిధాస్త్ర శస్త్రంబు లతనిపయిం దొరంగింపం గనుంగొని కౌరవేశ్వరుండు దుశ్శాసన శకుని తదీయ తనయులు దనకెలంకులం దఱుమం గరిఘటలతోడం గడంగి యవ్వడముడిని మార్కొని. 162
క. తానును వారును దూపుల | వాన పయిం గురియ నతఁడు వారించి గళ
ద్దానాంబులోల మధుకర | మైన గజ వ్రజముఁ బటు శరార్చులఁ బొదివెన్‌.
163
క. పొదివెడునప్పుడు శౌర్యో | న్మదుఁ డగు నయ్యనిలతనయు మార్గణములు బె
ట్టిదముగఁ గవియుడు నోటఱి | ఎదురుపలేరైరి కురునరేంద్రుఁడు వారున్‌.
164
మ. బలుగాలిన్‌ నలుదిక్కులం జెదరు నభ్రశ్రేణిచాడ్పు న్సము
జ్జ్వల సూర్యాంశులచేత విచ్చు నిబిడధ్వాంతంబు నందంబుఁ జూ
డ్కులకుం దోఁచెఁ బ్రచండ సంగర పటిష్ఠుండైన యా భీము తూ
పుల మొత్తం బడరం గరిప్రకర ముద్భూతార్తియై తూలినన్‌.
165
వ. అట్టియెడం గృప ప్రముఖ రథికులు రాధానందన భవన్నందనులకుం దలకడచి పవన నందను పార్శ్వంబులం దఱుము ధృష్టద్యుమ్నాది యోధులం దలపడిరి దుశ్శాసన ప్రభృతులును వారిం గూడికొనిరి కర్ణ నందను లక్కిమ్మీరమర్దనుం దాఁకి; రందు సుషేణుండు. 166
క. ఖర భల్లంబున నాతని | శరాసనము ద్రుంచి నారసములు రయముమై
నురమున నేడు సొనిపి ని | ష్ఠుర నినదం బెసఁగ నార్చె సురలు నుతింపన్‌.
167
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )