పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము
భీమసేనుఁడు కర్ణనందనుఁ డగు సత్యసేనునిం జంపి విజృంభించుట (సం. 8-43-24 (కుంభ))
సీ. కనలి యొండొక విల్లు గొని కీచకాంతకుఁ | డక్కుమారుని చాపయష్టి విఱుగ
నేసి మై బల్దూపు లీరేడు నాటించి | తన్నప్డు దొడరు రాధా తనూజు
నుబ్బు వాలమ్ములు డెబ్బదిమూఁట వా | రించి తత్సుతుఁడు దోర్లీల మెఱయఁ
జేరిన నా సత్యసేను రథ్యంబుల | సూతుఁ గార్ముకమును గేతనంబు
 
తే. నేడు తూపులఁ దునుమాడి యేచి మూఁడు | నారసము లంగమునఁ గ్రుచ్చి నాళమునకు
వికసితాంభోరుహముఁ బాపు వెరవు దోఁపఁ | దునిమె వెసఁ గత్తివాతి యమ్మున శిరంబు.
168
వ. తునిమి దోస్సారంబు దుర్వారంబుగా నుక్కునం దక్కటి రథిక జనంబుల పయి నడరి కృప కృతవర్మాది రథికవరుల కోదండంబులు దుండంబులు సేసి వారిం గ్రూరమార్గణంబుల మర్దించి దుశ్శాసనుని సాయక త్రయంబునను సౌబలునిఁ దద్ద్విగుణ బాణంబులను స్రుక్కించి యులూకుని నతని తమ్ముని నొక్కుమ్మడి విరథులం గావించి కర్ణుకొడుకుం గనుంగొని ‘యోరి సుషేణా! పొలిసితి పొ’ మ్మనుచు బలు నారసంబు నిగిడించిన నది నడుమన కర్ణుండు నఱకి మెఱుంగుటమ్ములు మూఁడు మేనం బఱప నుఱక మఱియు నట్టి మార్గణం బక్కుమారు నుపలక్షించి ఏసిన నా సూతనందనుం డదియునుం ద్రుంచి యవ్వడముడిమీఁదఁ ద్రిసప్తతి తీవ్ర ప్రదరంబులు పరఁగించె నప్పుడు; నకులుండు గవిసిన. 169
ఆ. చిత్ర చాపముక్త శితశర పంచకా | హత శరీరుఁ జేసె నా సుషేణుఁ
డేచి నకులుఁ డతని నిరువది యమ్ముల | నొంచి కర్ణు మనము నొవ్వ నార్చె.
170
చ. అలిగి సుషేణుఁ డెంతయు రయంబునఁ దొమ్మిది దొడ్డవాఁడి తూ
పులు మెయిఁ జొన్పి విల్‌ దునిమి పొంగిన నొండొక దీప్త చాప మ
గ్గలిక దలిర్ప నెత్తి వెసఁ గార్ముక దండము ద్రుంచి నొంచె దో
ర్బల విభవం బుదాత్తముగఁ బార్థునితమ్ముఁడు సూతు నాతనిన్‌.
171
ఆ. అన్యచాపలసిత హస్తుఁడై కడఁగి సు | షేణుఁ డతని షష్టి బాణగాఢ
నిహత దేహుఁ జేసె సహదేవుఁ డడరిన | మేటి తూపు లేడు మేనఁ గ్రుచ్చె.
172
క. అయ్యిరువుర యబ్బాలుని | కయ్య మమర దైత్యరణము కరణి మహోగ్రం
బయ్యె; వృషసేనుఁ డత్తఱి | నియ్యని సాత్యకి నెదిర్చె నిషుచయ మడరన్‌.
173
సీ. సాత్యకి వృషసేను సప్త సప్తతి మార్గ | ణంబులఁ బొదివి బాణత్రయంబు
సూతుమైఁ బఱపిన నాతఁ డాతని పెనుఁ | గడఁత వాలికయమ్ము గాఁడ నేయఁ
గోపించి మూఁడు బల్దూపుల సారథి | నొక భల్లమున విల్లు నుజ్జ్వలాస్త్ర
సప్తక నిహతి నశ్వంబుల నేకకాం | డ స్ఫూర్తిఁ గేతుదండంబుఁ దునిమి
 
ఆ. శినివరుండు వక్షమున మూఁడు శరములు | నాట సొగసి కర్ణ నందనుండు
దెలిసి కనలి వాలుఁబలకయుఁ గొని తేరు | డిగ్గి కవియ నవియు నుగ్గు సేసె.
174
వ. ఇ వ్విధంబున విరథుండును నిరాయుధుండును నగు నక్కుమారుం గనుంగొని దుశ్శాసనుండు రయంబున నెయిది చెయిచాచి నిజరథంబు మీఁదికిం దిగిచికొని తొలంగం గొనిపోయిన, నతండు వేఱొక్క యరదం బెక్కి యెప్పటియట్ల కర్ణుతేరి వెనుక వర్తించె; నయ్యంగపతి తొమ్మిది యమ్ము లడరించి శైనేయు సూతాశ్వ చాపంబులు రూపడంచి యతని ఫాలమ్మున మూఁడు వాలిక యమ్ములు నాటించె; నా సత్యక నందనుం డన్యస్యందనారూఢుం డయి కవిసి కర్ణునకుఁ దోడుపడు బలంబులం గలంచి యతని తనువున నేడు నారసంబులు నిగిడించెఁ; గూడికొని శతానీకుం డన్నియ శరంబు లేసె నప్పు డురువడించి తక్కటి ద్రౌపదేయులు డెబ్బది మూఁడును ధృష్టద్యుమ్నుండును శిఖండియుం బదిపదియు భీమసేనుం డఱువది నాల్గును సహదేవుం డేడును నకులుండు ముప్పదియును యుయుధానుం డేడును బాండవాగ్రజుండు నూఱును బాణంబు లా సూతపుత్రుపయిం గుప్పించి నొప్పించిన. 175
క. ముదమున నతఁ డందఱఁ బది | పది తూపుల నే పడంచి బహువిధగతులన్‌
దదనీకంబునఁ దే రొ | ప్పిదముగ వడి సంచరింపఁ బెద్దయు మెఱసెన్‌.
176
శా. శైనేయుండును భీమసేనుఁడును ధృష్టద్యుమ్నుఁడున్‌ ద్రౌపదీ
సూనుల్‌ ము న్నడరంగఁ గిట్టి విశిఖ స్తోమంబు లొక్కుమ్మడిన్‌
మేనం గ్రువ్వ శిఖండియున్‌ భుజబలోన్మేషంబు సూపన్‌ వెసం
దా నయ్యోధుల సూతసూతి విరథత్వస్తబ్ధులం జేసినన్‌.
177
వ. వియచ్చరులు వెఱఁగందిరి; వెండియు నవ్వీరుండు వారలనందఱ నస్త్రధారలం బొదువుచు నేడ్తెఱం బెఱవారిని బాణాంధకారంబునఁ గప్పినం ద్రిప్పికొనియును దొలంగియు దెరలియు మరలియు నా రథికసంఘంబు దైన్యంబు నొందె; నంత ధర్మనందనుని బాధింపఁ దలంపెయ్దిన. 178
క. ఆ రాధేయుం డాతని | పై రయమునఁ గవియు ఘోరభంగిఁ గని మహో
దారంబుగఁ జేది బలము | బోరన నెడసొచ్చెఁ దూర్యములు మొరయంగన్‌.
179
ఉ. సూతతనూజుఁ డబ్బలము సొచ్చి శతత్రయ యోధవీరులం
జేతుల తీఁట వో నుఱుము సేసి విశృంఖల దర్ప దుర్దముం
డై తఱుమంగఁ గల్పిత రథాక్రమ మొప్పఁగ వచ్చి ధర్మజుం
బ్రీతునిఁ జేయుచుం గడిమిఁ బేర్చిరి సాత్యకియున్‌ శిఖండియున్‌.
180
క. వారికిఁ దోడ్పడి యక్కడి | వీరులు గొందఱు గడంగి వివిధోగ్ర శరా
సారము లంగాధీశ్వరు | పై రయమునఁ గురిసి రుగ్రభంగిఁ జెలఁగుచున్‌.
181
క. కురుపక్ష యోధులును స | త్వరులై యా రథికవరులఁ దాఁకి భుజావి
స్ఫురణము సూపిన నద్భుత | కర మయ్యెఁ దదవసరమునఁ గయ్యం బధిపా!
182
వ. ఆ సంకుల సమరంబునందు. 183
శా. బాణజ్వాలలు బెట్టు పర్వ గగన ప్రక్షోభణ జ్యాలతా
క్వాణస్ఫూర్తి ఛటచ్ఛటారవముగాఁ గర్ణోగ్ర దావాగ్ని య
క్షీణోదగ్రత వైరి సైన్యవన భస్మీభావ నిర్వాహ పా
రీణంబై వెలుఁగొందె నిర్జరులు వర్ణింపంగ నే ముబ్బఁగన్‌.
184
వ. అమ్మహోగ్ర విజృంభణంబున. 185
క. ఆటోప మడఁగి యచ్చటి | మేటి మగలు ఱిచ్చవడిరి మెయిగలి గర్ణుం
డేటలవికిఁ గవిసె ధను | ర్జ్యాటంకృతి సెలఁగఁ బాండవాగ్రజుమీఁదన్‌.
186
వ. ఇత్తెఱంగునం గవిసిన నతనిమీఁద నమ్మేదినీనాయకుండు సాయకజాలంబులు పరఁగించిన నతం డుఱక యతి రయంబున నవి వారించి. 187
సీ. నవ్వుచుఁ జాపంబు నడిమికిఁ ద్రుంచి మై | మఱువుఁ దొంబది శితమార్గణముల
భేదింప రత్న ప్రభాదీప్త మగునది | సౌదామనీ చారు జలద మంబు
జాప్తుని తనువున కడ్డమై యుండి వా | తాహతంబై పాయునట్లు వోలెఁ
బడుటయు, మణిమయాభరణ సుందరమైన | యతని గాత్రము సతారాంబరంబుఁ
 
తే. బోలి యప్పుడ యా సూతపుత్రుచేత | రక్తమయమయి పల్లవోద్రిక్త కల్ప
తరువు చందంబు నొందె; నతండు రాజ | ధర్మమూఁది చలింప కదల్చె నధిప!
188
వ. ఇ ట్లదల్చుచు. 189
క. చదల మెఱుంగులు పర్వం | గొదమ పిడుగునట్ల నిగుడఁ గుంతీసుతుఁ డు
బ్బుదలిర్ప శక్తి వైచిన | నది కర్ణుఁడు సప్త భల్లహతి నెడఁ దునిమెన్‌.
190
సీ. పాండవాగ్రజుఁడు దర్పంబును వేగంబు | నొప్ప నవ్వీరుని యురమునందుఁ
గరముల ఫాలభాగంబున నాల్గు తో | మరములు సొనిపి నెత్తురులు వఱపి
యార్చినఁ, బేర్చిన యగ్గలికంబున | నా సూతనందనుఁ డతని సూతుఁ
జంపి కేతువుఁ ద్రుంచి శాతశరంబుల | నంగంబు నొప్పించె; నపుడు సాత్య
 
తే. కియు శిఖండియు నెడసొచ్చి రయము బలువు | మెఱయ రాధాతనూజుని మేన నమ్ము
లొక్క మొగి నింప, నయ్యోధుఁ డుఱక వారి | విరథులుగఁ జేసి విండులు విఱుగనేసె.
191
క. తనువులఁ బటు బాణంబులు | నినిచి వెగడు పఱిచి కడచి నిరతిశయ రయం
బునఁ గదిసి ధర్మనందను | ననేక సాయక పరిక్షతాంగుం జేసెన్‌.
192
వ. ఇ వ్విధంబున రాధేయుండు నొప్పించినం దదీయ సంరంభంబు సైరింపంజాలక యమ్మహీపతి హతసారథికం బగు నిజరథంబు దొలంగం దోలుకొని పోయినం దోడన తవిలి పొదివి నిలువరించి హాసభాసితుం డగుచు నయ్యంగపతి యతనితో ని ట్లనియె: 193
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )