పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము
కర్ణుండు ధర్మరాజు నొప్పించి యవమానించుట (సం. 8-44-72 (కుంభ) 8-33-36 (భం))
సీ. ‘క్షత్రియ కులమున జన్మించి యిది ధర్మ | మిది యధర్మం బని యెల్ల నెఱిఁగి
నట్టి నీ కిట్టి మహాహవమునఁ బ్రాణ | ములు దాఁచికొన శాత్రవులకుఁ దొలఁగి
పోవుట దగునె? నీ బుద్ధి గానఁగనయ్యె; | నృపనీతి యెఱుఁగవు; నీవు బ్రాహ్మ
ణాచార వేదివి; యాగాధ్యయనముల | వర్తింపు, కయ్యంబు వలవ; దుడుగు
 
తే. మింక ననుబోఁటిఁ దొడరిన నింతకంటె | నెడరు వాటిల్లు వేగపొ మ్మింటికడకు
హరియుఁ బార్థుడు నున్నెడకైన నరుగు; | మేను దెగ నీదు ప్రాణాన కింత నిజము.’
194
వ. అని పలికి గొంతి వచనంబులు మనంబున నునికిం జేసి వధియింప నొల్లనివాఁడై యప్పాండవాగ్రజు విడిచి యా పురుషసత్తముండు తదీయ సేనాసముదయంబు నానాస్త్ర నిహతంబు సేసె; లజ్జాకుల మానసుం డగు నమ్మానవపతియును దత్ప్రదేశంబున నిలువక తొలంగిపోయెం; బోవుటయు. 195
క. విను మతని యోధజనములు | మొనయుఁ దిరిగె; నట్లు సమరమున విముఖంబై
చను నబ్బలముం గని వెను | కొనియెం గర్ణుండు నీదు కొడుకులుఁ దానున్‌.
196
క. పటు సింహనాద తూర్యో | త్కట రవగుణ నిస్వనములు గలసి యఖిల ది
క్తట దారణ కేలి సము | ద్భటము లగుచుఁ గురుబలమునఁ బరఁగె నరేంద్రా!
197
ఉ. ఇమ్మెయి సూతనందనుని యేడ్తెఱ కోడిన యోధవీర సం
ఘమ్ములఁ బాండవాగ్రజుఁడు గన్గొని పేర్కొని పేరెలుంగునం
గ్రమ్మఱి పేర్చి కౌరవ నికాయము గర్వమడంపుఁ డన్న ధై
ర్య మ్మిగురొత్త వే తిరిగి రా రథికుల్‌ మరలెన్‌ బలంబులున్‌.
198
వ. ఇ వ్విధంబున వృకోదర పురస్సరంబుగాఁ బాండవ బలంబులు మార్కొనిన మన మూఁకలుం గూడికొని తిరంబై త్రోచి తలపడుటయు నయ్యిరువాఁగునందు. 199
మ. కరిబృందంబులు ద్రెళ్ళెఁ బెల్లుగఁ దురంగ స్తోమముల్‌ పెక్కు గూ
లె రథానీకము లగ్గలంబు గెడసెన్‌ లెక్కింపఁ బెక్కైన కా
ల్వుర మొత్తంబులు రూపడంగె సిడము ల్నుగ్గయ్యె నన్నేల నె
త్తురు వెల్లిన్‌ మునిఁగెన్‌ మరుత్ఖచర పంక్తుల్‌ వెక్కసంబందఁగన్‌.
200
వ. అట్టి సందడి కయ్యంబున భీమసేనుండును శైనేయుండును బెట్టిదంపు టురవడిం గవిసిన ధృష్టద్యుమ్నాది రథిక ప్రకరంబును బరవసంబు సేయం గురుబలంబు వెఱచఱచి పఱచినఁ, గర్ణుం డదల్చి కరతలంబెత్తి నిలునిలు మని పలికి నమ్మోహరంబు నిలువదయ్యె; నవష్టంభ విజృంభితుండైన యా సూతసూనుండు వెండియుం గౌరవుల వేఱు వేఱ పురికొల్పి మరల్చిన నమ్మొనయును మొగకట్టి నిలిచె; నంతం బవమానసూనుం దాను మార్కొన నగ్గలించె; నతం డతని నాలోకించి యంతకుమున్న శ్రుతకీర్తి స్యందనం బెక్కియున్న తమయన్న వలను సాత్యకి ధృష్టద్యుమ్నులకుం జూపి వారలతో ని ట్లనియె. 201
ఉ. ‘ఈతఁడు దుర్దశం బొరసె నేను గనుంగొనఁ గర్ణుఁ డేచి దు
ర్నీతి పరున్‌ సుయోధనునిఁ బ్రీతునిఁ జేయుటకై కడంగె; మీ
చేతికి నిచ్చి యిట్లరువు సేసెద నిన్నరనాథు నాకు నా
సూతతనూభవున్‌ సమయఁ జూడక పోదు విషాద మెమ్మెయిన్‌.
202
క. ఏ నొండె నతనిచే నా | చేనొండె నతండు దెగుట సిద్ధముగ మదిం
బూని కడంగెద; మీ రీ | భూ నాథునిఁ గాచికొనియ పోరు నడపుఁడీ!’
203
చ. అని పటుసింహనాదమున నంబరముం బగిలించి తేరు క
ర్ణుని దెసఁ బోవనిచ్చినఁ గనుంగొని శల్యుఁడు కర్ణుతోడ ని
ట్లను ‘మనమీఁద వచ్చు ననిలాత్మజుఁ జూచితె! యంతరంగ మే
ర్చు నలుక కామిషం బిడఁగఁ జూచిన చందము గాననయ్యెడున్‌.
204
చ. ‘అలిగిన మూఁడు లోకముల నైనను జీరికిఁ జేకొనం డితం
డలఘు పరాక్రమ స్ఫురణుఁ డర్జున సూనుఁడు నాత్మపుత్రుఁడుం
బొలిసిర కాని కోపమునఁ బొంగఁడు నాఁడును నాఁడు నింత దో
ర్బలమును శౌర్యసారముఁ దిరంబయి చూపఱు మెచ్చఁ జూపుమీ!’
205
చ. అనవుడు భీముఁ జూచి యతఁ డాతని కిట్లను ‘నట్టివాఁడ కా
కనిలజుఁ డల్పుఁ డెట్లు? సమరాగ్రమునన్‌ భవదుక్తి యట్ల యిం
తనువగునే కిరీటిఁ దెగటార్పఁగ నీతని నొంపఁ జంపఁ దాఁ
గని వెసవచ్చు నాతఁ డధికం బగు మద్బల మిప్డు సూడుమీ!
206
చ. తరమిడి చంపెఁ గీచక శతంబు నితం; డది యేల? యెల్లెడన్‌
బిరు దనఁగా బలాఢ్యుఁ డనఁ బెద్దయుఁ బేర్చినవాఁ డగున్‌ వృకో
దరుఁ డటు లైన నీతని మదం బడఁగించుట లీల నాకు నీ
వరదము సమ్ముఖంబుగ రయంబునఁ బోవఁగ నిమ్ము భూవరా!
207
ఉ. నావుడుఁ దేరు మద్రనరనాథుఁడు భీముని ది క్కుదగ్రతం
బోవఁగ నిచ్చెఁ దూర్య రవముల్‌ సెలఁగెన్‌ దివి పిక్కటిల్ల న
ప్పావని నవ్వుచున్‌ బలము పాయపడం గడు బెట్టు గిట్టినం
జేవ దలిర్ప నా రథికసింహునిఁ గర్ణుఁడు గప్పెఁ దూపులన్‌.
208
వ. కప్పి యాలోన. 209
క. వెస నతని యురము బలు నా | రసమున నొంచుటయు నతఁడు రాధేయ తను
ప్రసరన్నవ నారాచో | ల్లసితుండై మెఱసెఁ గురుబలంబు దలంకన్‌.
210
ఉ. సూతతనూభవుం డనిలసూనుని చాపము ద్రుంచి యేచి యు
ద్ద్యోతిత మార్గణంబు మెయి నుచ్చి చనన్‌ నిగిడింప నొండు వి
ల్లాతఁడు ధైర్య సారము రయంబును జూపఱుమెచ్చ నెత్తి సం
స్ఫీత శరోత్కరం బతని పేరుర మాడఁగ నేసి యార్చినన్‌.
211
తే. ఈడఁబోక రాధాసుతుఁ డేసె నిరువ | దేను నారాచములు పవమాన తనయు
కత్తళము తూఱి యంగంబు గాఁడి పాఱి | నిలువ కటచని మేదినీతలము సొరఁగ.
212
మ. అలుకం గెంపు గనుంగవం గదురఁగా నప్పాండవుం డేసినం
గులిశంబో యనఁ బ్రజ్వరిల్లి నిగిడెన్‌ ఘోరంపు భల్లం బుర
స్స్థలి భేదిల్లఁగఁ దేరిమీఁదఁబడి మూర్ఛంబొంది కర్ణుండు ని
శ్చలతం జచ్చిన యట్టులుండె వెఱఁ దత్సైన్యంబుఁ దూలెం గడున్‌.
213
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )