పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము
భీముండు గర్ణుని మూర్ఛితుంజేసి నాలుక గోయం బూనుట (సం. 8-45-48)
వ. అప్పు డయ్యనిలతనయుండు దన యరదంబు గదియం దెచ్చి యా సూతనందనుం గనుంగొని ‘యిన్నీ చు నాలుకం గోసెద’ ననుచుం గట్టిన యలుఁగు వెఱికి యతని యరదంబుమీఁది కరుగ నుత్సహించిన జూచి, మద్రవిభుండు వారించి ‘యిది మూర్ఛగాని మరణంబు గా; దీ యవస్థ నాలుక గోసినం జచ్చు; నితనిం జంపుటకుఁ బార్థుండు ప్రతిన పట్టినవాఁడు నీవు సంపిన నతండు నెవ్వగం బొందు’ ననిన విని యవ్వీరుండు వీఁ డిప్పుడు పాండవాగ్రజుని బాధించినం గ్రోధాంధుండనై యది మఱచితిం గాని చావుగామియు నిట్టియెడ నాలుక గోయం దడవఁ జచ్చుటయు నెఱుంగుదు; నిత్తెఱంగు నీవు దలంపించి లెస్సచేసి; తిద్దురాత్ముండు సభలోన నసభ్యంబు లగు మాటలు ద్రౌపది నుద్దేశించి యాడిన నుద్దీపించిన కోపం బజాతశత్రునకుఁ బ్రియంబుగా నడంచికొని యుండితి; నేఁడు తద్వేదన వెలార్పం జూచితి; నట్ల చేసితినేని మానధనుం డైన ధనంజయుండు దన చేసిన పూనిక నెఱపం గానక మనంబునం గుంది మడియుఁ; గృష్ణ యుధిష్ఠిరులు నాతని తోడివార; యింత ప్రమాదంబు నీవు గలిమిం దెలిసితి; మేలయ్యె; మాతులా! నీ యాజ్ఞ యుల్లంఘింప నని పలికి నిలిచె; శల్యుండును సంతసిల్లి తేరు దొలంగించె; ననుటయు నాంబికేయుండు సంజయున కి ట్లనియె. 214
క. ‘పాండవుల నాజి నోర్చు ని | తం డని మీ రాజు సూతతనయునిఁ బొగడున్‌;
గం డడఁచె భీముఁ డిట్టి మ | గండుఁ గలఁడె? పిదప నెట్లు గయ్యము సెల్లెన్‌?’
215
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )