| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అనవుడు సంజయుం డాంబికేయున కిట్లను నట్లు బాధితుండయిన రాధేయుం గనుంగొని కురుపతి తమ్ములతో నిట్లను ‘భీమసేనుచేత సూతసూనుండు గడు నొచ్చెం గావలయు వేగం బెయిదుఁ’ డనుటయు శ్రుతవర్మాది కుమారులు గొందఱు పటుగతిం గవిసి యక్కౌంతేయుం జుట్టుముట్టిన నతండుఁ దదనుచరుల నేనూట యేఁబండ్రు వీర రథికులం బిలుకుమార్చి శ్రుతవర్మ శిరంబు భల్లంబునం ద్రుంచిన, నది ముఖకాంతి మెఱయం జంద్రమండలంబు మహికెఱఁగు తెఱంగు దోఁపం బడియెఁ; బటుబాణద్వయంబున వికటుని సముని బెట్టేసిన బెడిదంపు గాలిం దూలు తరువుల కరణి ధరణిం ద్రెళ్ళిరి; తదనంతరంబ తీవ్ర నారాచంబునఁ గ్రాథుం గూల్చి, నందోపనందుల నొక్కపెట్ట పెక్కమ్ములం బొరివుచ్చె నిట్లు నీ కొడుకు లార్వురుం దెగినఁ దక్కటి వారు వచ్చి దైన్యంబు నొందిన సైన్యంబు గలంగె; నంతకుఁ దెప్పిఱి యెప్పటి బరవసంబు శోభిల్లం గర్ణుండు గడంగి డగ్గఱి. | 216 |
| చ. |
అనిలజుమీఁద నేయ నతఁ డా శరముల్ దునుమాడి సప్తకాం డ నిహతుఁజేసె నాతని దృఢప్రదరంబులఁ గప్పె; నాతఁడున్ వినుము సముజ్జ్వల ప్రదర విద్ధునిఁగా నొనరించి యమ్మరు త్తనయుఁడు పేర్చి యార్వ వసుధావర! యా రథికుం డుదగ్రుఁడై. |
217 |
| మ. |
పది బాణంబుల నొంచి విల్లు దునుమం బ్రస్ఫీత దీప్త్యుజ్జ్వల ద్గద వైచెం బవనాత్మజుం డది యెడన్ ఖండించె; నవ్వీరుఁ డు న్మదుఁడై పాండవుఁ డొండు విల్లు గొని నానాకంకపత్రంబులం బొదువం గర్ణుఁడు నొంచెఁ దత్తను వతిస్ఫూర్జద్దశాస్త్రంబులన్. |
218 |
| వ. | దానం గోపించి. | 219 |
| చ. |
పటుతరమైన నారసము పాండునృపాత్మజుఁ డుగ్రుఁడై యుర స్తటమున బెట్టు గ్రువ్వ బెడిదం బయి వీఁపున నుచ్చి పోవ ను త్కట ధరణీ ప్రకంప చలితం బగు శైలముఁ బోలి తాల్మి మి క్కుటముగ రోష రంజిత ముఖుం డయి కర్ణుఁడు ఘూర్ణితాకృతిన్. |
220 |
| చ. |
రయమునఁ బంచవింశతి శరంబులు మేన నిగిడ్చి భల్ల సం చయహతి విల్లు సక్కడిచి సస్మిత వక్త్ర సహస్ర పత్రల క్ష్మియతిశయిల్ల రథ్యములఁ జెండిన మారుతి యేచి విద్విష ద్భయద గదారుచి స్ఫురిత బాహువిలాస విభాసమానుఁడై. |
221 |
| వ. | అరదంబు డిగ్గనుఱికి కర్ణుని దెసం గవియం గురుపతి సేనం గల యేనుంగులం బదియేడింటిం బురికొల్పిన నవి దివాకరుఁ బొదువు నంబుదంబుల చందంబున నా జెట్టిమగనిం గిట్టిన, నతండు జోదులతోడంగూడ నగ్గజంబులఁ జదుపుటయు, సౌబలుని ఘోటకంబు లాటోపంబున మూఁడువే లొక్కట నురవడించిన వాని ప్రాపున నరదంబులుం గాలు బలంబులుం గవిసి కూడికొని పొదివిన మదం బొదవి యమ్మహాబలనందనుండు దారుణ రణ విహారంబున నొండొండ పేర్చిన, యబ్బలం బుజ్జ్వలానలంబున వైచిన చర్మంబు చాడ్పున ముడింగి యొదిగె; నప్పు డా శకుని యోధులు పంచ శత రథికులు రభసంబున నడరిన వారల సూతాశ్వ కేతు స్యందన సమేతంబుగా నఱిముఱి నుఱుమాడి యగ్గలిక మెఱసినం గని యగ్గాంధారరాజు పనుపం గడంగిన యవన దేశీయులగు నాశ్వికులం ద్రిసహస్ర సంఖ్యుల నవ్వడముడి పొడిసేయు చప్పుళ్ళు గార్చిచ్చు వెదురుటడవి నేర్చు తెఱంగునం దోఁచె; నిట్లు గదపండువు సేసి యొండురథం బెక్కి యక్కౌంతేయుండు భండనంబు సేయ, రాధేయుండు పాండవేయాగ్రజుం దాకి తీవ్ర ప్రకాండంబుల గప్పి సారథి సమయించినఁ దేరు తురంగంబులు దొలంగ నీడ్చికొని పాఱిన, వెనుకొను నయ్యంగపతిం గనుంగొని. | 222 |
| ఉ. |
భీముఁ డదల్చుచున్ రథము భీమగతిం గవియింప నాతఁ డు ద్దామత మాఱుకొన్న వివిధ స్ఫుర దస్త్ర పరంపరాద్వయ శ్రీ మొన లప్పు డచ్చెరువుఁ జెంది నుతించె మురాంతకానుజుం డా మరుదాత్మజుం గడచి యంగపతిన్ వెసఁ దాఁకెఁ; దాఁకినన్. |
223 |
| క. |
ఆ యిరువురు నిబిడ కన | త్సాయక పటలములు నిగుడ సరి మధ్యాహ్న స్ఫాయత్ప్ర భాఢ్యుఁ డయ్యుం | దోయజబాంధవుఁడు మింటఁ దోఁపక యుండెన్. |
224 |
| వ. | వా రొండొరుల శరపరంపర లడఁగించి రా సమయంబున. | 225 |
| చ. |
తన కరముల్ నిగిడ్చి యుచితంబుమెయిం గొనియాడి యంతటం దనియక లీలఁ జేరి సముదంబుగఁ బద్మినిఁ బొందె భాస్కరుం డనుటకుఁ దావలం బయి జనాధిప! చూడ శమంతపంచకం బున విరిదమ్మి తేనియలఁ బొల్పెసఁగెం బ్రతిబింబ మెంతయున్. |
226 |
| వ. | అప్పుడు కృప సౌబల కృతవర్మాశ్వత్థామల యుద్దామ సాహాయ్యంబున సమధికోత్సాహుం డగు నా సూత నందనుని సంరంభంబునం గౌరవానీకంబు దర్పోద్రేకంబునం గడంగినం బాండవబలంబునుం బొంగె; నివ్విధంబున నిరువాఁగును గలయన్ బెరసిన నార్పుల నదల్పులం బొగడుటలం దెగడుటల నెసఁగు నులివు తూర్య రవంబుల గెలువ నమ్మేదిని నెత్తుటన్ జొత్తిల్లి కెంజాయ రంజిల్లు పుట్టంబు ముసుంగు వెట్టిన యంగన చందంబు నొందె; మస్తక ప్రముఖావయవంబులును గోదండాద్యాయుధంబులును మకుట ప్రభృతి భూషణంబులును నాతపత్ర ధ్వజ చామరంబులుం దునిసిపడి భీమాభిరామంబులుగాఁ గరిహయనర సమూహంబులు రక్తసిక్తంబు లైన నకాలబాలాతపలీల యావహిల్లం దక్కిన సేనాంగంబుల మిగిలిన మాతంగంబులు పెనంగిన కనకలిప్తకాండంబు లూఁదికొనం దాఁకిన నెరగళ్ళు పోవు కొండల కైవడిం బొలుచునవియును నస్త్రశస్త్ర పాతంబులం గ్రమ్ము రుధిరమ్ముల గైరిక నిర్ఘరంబులతోడి ధరాధరంబుల ననుకరించునవియును మెయిమఱువు లఱువు బళ్ళై నానానిశిత శరంబులు నోనాటినం జేష్టలు దక్కిఱెక్కలు దెగియున్న శైలంబులం బోలునవియును నగుచుండఁ జెలంగి చతురంగంబులును బెరయఁ బెనంగు నుల్లాసంబున శోణితం బడంగ మట్టవిసి రేణువు లెగసినం జూడ్కులు నిగుడకున్ననుం దఱియ నుఱికి నిజాభిధానంబులను జననీ జనక నామంబుల బిరుదాంకంబులం దమ్మెఱింగించికొనుచు వీరుల పోరు చక్కటికిం జొచ్చి ప్రొపై పేరువాడు తదీయ బంధుమిత్రులం బొగడు నమరుల యెలుంగులు నింగినిండం బెల్లుదొరఁగు కీలాలం బా ధూళి నడంచిన కొలఁది నిలువక యేఱులయి పాఱ నుబ్బి భూత బేతాళ క్రవ్యాదంబు లోలలాడుచుం ద్రావుచు మదించి నృత్తంబులు సేయ నంబరంబున నట్టలాడ వెక్కసపాటొనర్పంజాలు నా సమయంబున మనంబు లెప్పటి తమకంబున ననిం దనివిసనమిం గవిసి కయ్యంబు సేయు సైనికోత్తముల సింహనాదంబులు దిక్కులం బిక్కటిల్ల నా కలని కెలన నటమున్న తన్నుఁ బొదివిన త్రిగర్త కోసల నారాయణ గోపాల బలంబుల నబ్బలసూదనసూనుండు గాండీవారావం బాకసంబు వగిలింప నొప్పించి. | 227 |
| చ. |
తఱిమి సుశర్మఁ దాఁకిన నతండుఁ దదంగమునన్ దశాస్త్రముల్ వఱపి మురాసురాంతకుని బాహువునం బటు మార్గణ త్రయం బఱిముఱి జొన్పి బల్వెడఁద యమ్మున నుజ్జ్వల కేతుదండ మే డ్తెఱఁ జలియింప నేసిన నుదీర్ణతఁ దత్కపి యార్చె; నార్చినన్. |
228 |