| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| సీ. |
అనినఁ, గృపాణంబు గొని సవ్యసాచి య | వ్విభు వ్రేయఁ దలఁచిన, విష్ణుఁ డెఱిఁగి, ‘వాలు గేల నమర్ప వలసిన పని యేమి? | కౌరవు లియ్యెడ లేరు; మనము ధరణీశ్వరుని సేమ మరయంగ వచ్చితి; | మీతని కుశల మి ట్లేర్పడంగఁ గంటిమి; సంతోషకాలంబు గా కిది | క్రోధ కాలమె? వధ్యకోటి యిచట |
|
| ఆ. |
నేది గాఁగ నలిగి తీ’ వని పలికిన | రూక్షభంగి యగు కటాక్షదృష్టి యా నరేంద్రుమీఁద నడరంగ నర్జునుఁ | డ మ్మురారి కిట్టు లనియె నధిప!’ |
67 |
| క. |
‘విను! మొరులకు గాండివ మి | మ్మని, న న్నెవ్వండు పలికె నతనిశిరము గ్ర క్కున బగులవ్రేయుటకుఁ జే | సినవాఁడఁ బ్రతిజ్ఞ నాదు చిత్తములోనన్.’ |
68 |
| తే. |
‘ఇట్టికష్టపు గేలికై యిట్లు సేయఁ | బ్రతిన వట్టుట దగదె? యిప్పలుకు నీవు వినఁగ నితఁ డాడ, నిమ్మహీవిభుఁడు ధర్మ | వంతుఁ డగుఁగాక చంపనవలయుఁ గృష్ణ!’ |
69 |
| వ. | ‘చంపి పాలిత ప్రతిజ్ఞుండ నైన నాకు నసత్యంబు రాకుండఁ బరిహరించెద; దీనికి నీ వేమి సెప్పెదవు? సెప్పుము! నీవు జగత్కృత్యసాకల్యవేదివి; నీ చెప్పినట్ల చేయంగలవాఁడ’ ననుటయు, నచ్యుతుండు ‘పో పొ మ్మెక్కడివాఁడ’వని యదల్చి వెండియు ని ట్లనియె: | 70 |
| ఆ. |
‘నీకు వృద్ధసేవ లేకున్కి యెఱుఁగంగ | నయ్యె; రిత్త యిట్టు లడిచిపడుటఁ బట్టి; ధర్మవిధి విభాగజ్ఞు లైన వా | రేల చేయఁ జొత్తు రిట్టిదాని?’ |
71 |
| క. |
‘చేయంగ వలయువానిం | జేయుట, యిట్టివియె కొన్ని చేయకునికి, ధ ర్మాయత్తచిత్తుఁడై నా | నా యోగ్యస్థలము లెఱిఁగి నడవఁగ వలదే!’ |
72 |
| క. |
‘సత్యంబు నహింసయు నను | నత్యుత్తమధర్మయుగళ మందు, నహింసన్ సత్యము గాచుట ధర్మ, మ | సత్యమున నహింసఁ గావఁ జను నండ్రు బుధుల్.’ |
73 |
| ఆ. |
‘కర్మసూక్ష్మభంగి గానక యిమ్మెయి | సత్యరక్షణంబు సలుపుపొంటె భ్రాత ధర్మపరుఁడు రా జిమ్మహాత్ముఁ జం | పఁగఁ దలఁచుట ధర్మపథము గాదు.’ |
74 |
| క. |
‘విను! పిన్ననాఁడు నీ వీ | యనుచిత మగువ్రతము వట్టి; తది గాకయు, బె ట్టనృతము సూనృతమును నీ | కనియెడు చందంబు బుధులు గయికొన రెందున్.’ |
75 |
| క. | అది యెట్లంటేని; | 76 |
| ఆ. |
‘ప్రాణహాని వచ్చుపట్టున, సర్వధ | నాపహార వేళయందు నడపు సత్య మనృత మం; డ్రసత్యంబు సూనృత | మని పరిగ్రహింతు రార్యజనులు.’ |
77 |
| వ. | ‘విను: పెద్దయు వినికి లేనివాఁడు కౌశికుండను నొక్కవిప్రుం డొక్క విశిష్ట గ్రామంబున కనతిదూరంబున సరిత్సంగమ పుణ్యక్షేత్రంబున వసియించి, సత్యంబ పలుకువాఁడ నని వ్రతంబు వట్టి, సత్యవాది యనం బ్రసిద్ధుండయి తపంబు సేయుచుండ; నొక్కనాఁడు, మ్రుచ్చులం గని వెఱచఱచి పఱతెంచిన జనులు గొంద ఱయ్యాశ్రమంబు చేరువం బొదలఁ దూఱి; రంత వెను తగిలి వచ్చు మ్రుచ్చు లత్తపోధనునికడ కేతెంచి, ‘యిప్పు డిట వచ్చినవార లెటవోయి?’ రని యడిగిన, నతండు సత్య విభాగ విధిజ్ఞుండు గామింజేసి, తన కసత్యంబు వాటిల్లు ననుశంక ‘నీ గుల్మలతా గహనంబు సొచ్చి’ రని చూపి చెప్పిన, నత్తెక్కలికాఱు వారలం జంపి ధనమ్ముగొని; రమ్ముని తద్వచన దోషంబున నరకప్రాప్తుం డయ్యె నను నితిహాసంబు విందుము, హింసాకరం బగు సత్యంబు ధర్మంబు గాదు; తొలుత వినిన దానిన పట్టి మూఢుండు పెద్దల నడిగి తెలిసికొనక వర్తించి దుర్గతిం బొందు; నింతవట్టు విచారించి యజాతశత్రుండు వధ్యుం డవుం, గాఁ డని నిశ్చయింపు’ మనుటయు, నర్జునుం డిట్లనియె: | 78 |
| తే. |
‘తల్లిదండ్రులమాడ్కి హితంబు సెప్పి | నన్ను ననుచితకృత్యంబునకుఁ దొలంగఁ ద్రోచితివి! లోకమున నీకు గోచరంబు | గాని ధర్మ నిబోధంబు గలదె కృష్ణ?’ |
79 |
| క. |
‘జనములు వృథాప్రతిజ్ఞుం | డని నను నిందింపకుండ, నగ్రజుఁడు సుఖం బునికియుఁ గలిగెడునట్లుగ | ననుగ్రహముఁ జేసి, చేయునది పనుపు దగన్.’ |
80 |
| వ. | అనిన నతం డతని కిట్లనియె. | 81 |