పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - తృతీయాశ్వాసము
కృష్ణుఁడర్జునుఁ బ్రతిజ్ఞా భంగంబు గాకుండ ధర్మజు దూఱుమని చెప్పుట (సం. 8-48-64)
చ. ‘అతిశిత కర్ణ బాణహతి నంగము నొచ్చిన దాన నల్గి, యి
ప్పతి నిను నివ్వఁ బల్కు టిది ప్రాభవ; మింతియె కాక, నీయెడన్‌
మతిఁ బటుకోపముం గలదె? మారుతసూనుఁడు నీవుఁ దమ్ములుం
జతుర వినీతి నీతని వశంబునఁ గాదె చరింతు రెప్పుడున్‌?’
82
క. ‘కావునఁ బ్రభుత్వ సంపద | నీ విభుఁ డాడినది యెల్ల నెగ్గుగొనక, నా
చే వినుము; నీదు ప్రతినకు | నేవిధి సేయనగు దాని నేర్పడ ననఘా!’
83
క. ‘నీ విట్టివాఁడ వని ధర | ణీవిభునిం బలుకు; మదియ నీచంపుట సం
భావించి, పిదపఁ బ్రణతుఁడ | వై వినయము సేయు చిత్తమలర నతనికిన్‌.’
84
వ. అట్లయిన నసత్యదోషంబునకు గురువధపాతకంబునకుం దొలంగి, సమాహితుండ వగుదు; తదనంతరంబ కర్ణుని సమయింపఁ జనుటకు నమ్మనుజపతి యనుమతి వడయుద’ మనుటయు, నప్పలుకుల కభినందించి, పురందరనందనుండు ధర్మనందను నుద్దేశించి. 85
మ. ‘కనదస్త్రంబుల నుజ్జ్వలోద్భట గదాఘాతంబులం గాలఁ గే
లను విద్విట్చతురంగ సంఘములు గూలం గేలి సల్పంగఁ జా
లిన యాభీముఁడు పల్కుఁగాక నను; దోర్లీలాసమగ్రుండ వై
యనిలో నిల్వఁగ లేని నీ విటుల కీ డాడంగ నర్హుండవే?’
86
క. ‘న న్నెఱిఁగి యెఱిఁగి యిట్లనఁ | జన్నే? నీ జిహ్వ పెక్కు శకలములై పో
కున్నది యే లొకొ? రణమున | నెన్నఁడు నీ వేమి సేసి తింత యనుటకున్‌?’
87
క. ‘నకులుఁడు సహదేవుండును | బ్రకటభుజాస్ఫురణమున నరాతిబలము నే
లకుఁ గోలకుఁ దెత్తురు; నో | రికి వచ్చినయట్టు లాడిరే యిబ్భంగిన్‌?’
88
సీ. నీవు జూదం బాడఁగా వైరబంధంబు | కౌరవకోటితోఁ గలిగె; మనకు;
రాజ్యనాశంబు నరణ్యవాసంబును | దాస్యదైన్యంబు నత్యంతదుఃఖ
ములుఁ దెచ్చికొంటి; సిగ్గొలయదు నీ మనం | బున నించుకేనియు; ననికిఁ జాల
కున్న వానికిఁ దాల్మి యొప్పగుఁ గాక! ప్ర | ల్లదములు పలికిన లాఘవంబు
 
తే. సెందు మున్నేమి సేసినఁ జేసి; తింక | నైన దుర్భుద్ధితనములు మాని, తగిన
పౌరుషము లేము సేయఁగ నూరకుండు; | మిడుమ వడువారు సైఁతురే యివ్విధంబు?’
89
వ. అని యగ్రజు నప్రియంబులు పలికి, యంతరంగంబు సంతాపంబు వొంద నిట్టూర్పు నిగిడించి, యంతకుము న్నొఱఁ బెట్టిన వాలు వెఱికినం గనుంగొని, పద్మనాభుండు ‘గ్రమ్మఱ నిది యేమి?’ యని యడిగిన, నతం ‘డే నిన్నరనాథు నొవ్వనాడిన పలుకులకుఁ బ్రాయశ్చిత్తంబు దలఁద్రెంచుకొనుటయకా నిశ్చయించితి’ ననుటయు, నమ్మహాత్ముఁ; ‘డాత్మప్రశంస సేయు, మది మరణం బని పెద్దలు సెప్పుదు’ రనుటయు. ‘నీ చెప్పినట్ల చేయ కునికికిం గడచిన యధర్మంబును గలదె? యిట్లు సేయువాఁడన కాక’ యని, యా ధనంజయుండు ధనుర్ధరుండై ధర్మనందనున కి ట్లనియె: 90
ఆ. ‘హరుఁడు దక్కఁ జాపధరుఁ డొరుఁ డెన నాకుఁ | ద్రిభువనముల లేఁడు! దిశలు గెలిచి
తెచ్చి నీకుఁ బ్రీతి నిచ్చితిఁ, బెనుపారు | ధనము రాజసూయ దక్షిణలకు.’
91
వ. ‘దీప్త ప్రతాపంబగు సంశప్తక సంచయంబు నడఁగించి, కించిదవశిష్టంబుగా, నష్టంబు సేసితిఁ; గురుసేన నా చేతం గూలి యెట్లున్నదియో యటు సూడు;’ మని పలికి, మొగంబుబిగు వుడిపికొని, సవినయంబుగా దండప్రణామంబు సేసి నిలిచి, చేతులు మొగిడ్చి, యజాతశత్రున కప్పురుహూతపుత్రుం డి ట్లనియె: 92
క. ‘నను సుప్రసాద దృష్టిం | గనుఁగొను; మే నిపుడు కొన్ని కాఱు లఱచితిన్‌;
మనుజేంద్ర! వానిఁ బెడచెవు | లను బెట్టుము వేఱుగాఁ దలంపక దయతోన్‌.’
93
తే. ‘వినుము సత్యంబ పలికెదఁ; దనువుఁ బ్రాణ | ములును నీ సొమ్ముగా మదిఁ దలఁతు నేను;
నాదు వృత్తంబు భవదధీనం బనంగ | నేల పనుపవు నను భీముపాలి కధిప!
94
క. ‘ఓపి యతని రణ భారము | వాపెదఁ; గౌరవ్యసేన బడలువఱిచి సా
టోపతఁ గర్ణునిఁ దునిమెద; | మాపెదఁ గురురాజు దురభిమానము బలమున్‌’
95
వ. ‘ఎల్లభంగుల నేఁడు రాధం బుత్త్రరహితం జేసెదఁ; గాదేని గొంతియైన నట్టిద యగుం గాక!’ 96
చ. అన విని, యమ్మహీరమణుఁ డాతని కిట్లను; ‘మీకు నాకతం
బున బహుదుఃఖముల్‌ గలిగె; భూరికులంబున కప్రియం బొన
ర్చిన యవినీతుఁ బాపపరు వ్రేయఁదగుం దల ద్రెవ్వ; నీ మనం
బునఁ గృప పుట్టి కాచినను, బోయెద నిప్పుడ యేను గానకున్‌.’
97
క. ‘ననుఁ దొఱఁగి నీవు సౌఖ్యం | బున నుండుము; సమరభీతు భుజబలహీనున్‌
జనపతిఁగాఁ జేయుట యొ | ప్పునె? కట్టుము పట్ట మనిలపుత్రునిఁ బ్రీతిన్‌.’
98
వ. అని పలికి, సెజ్జ డిగ్గి వనవాస గమనోన్ముఖుం డయినం, గనుంగొని కమలనాభుం డాభూపతి చరణంబులకుం బ్రణతుండై యిట్లనియె: 99
సీ. ‘నరుని ప్రతిజ్ఞ భూవర! మున్నెఱుంగని | యింతియ కా దేను; నితఁడు నిప్పు
డాడిన మాటలు నంతరంగంబునఁ | బట్టవు; పేర్చు కోపమున నీకుఁ
దను నెవ్వఁ డుఱక యన్యునకు గాండీవ మి | మ్మని ధిక్కరించె, నాతని వధింప
బ్రతిన పట్టినవాఁడు; భావ్యంబు గానియ | ప్పలు కీవు పలికితి; పరమధర్మ
 
ఆ. మైన సత్యనిష్ఠ హానిఁ బొందుట కోర్వ | కునికిఁ జూచి, యేన యుల్లమునఁ ద
లంచి యట్లు పలుకఁ బంచితి; గురునిఁ గీ | డాడుటయు వధించు టగుటఁ జేసి.’
100
క. ‘శరణము వేఁడెదను భవ | చ్చరణంబులు వట్టికొని, నిసర్గదయా ని
ర్భరబుద్ధిని గావుము మ | మ్మిరువుర; నీతప్పు సైఁపు మెల్ల విధములన్‌.’
101
క. ‘సూతసుతుని మెడనెత్తురు | భూతలమున నివుర నేఁడు భూనాయక! నీ
వాతనికి నలిగినప్పుడ | చూ తెగియెం బూని యేన చుమ్ము పలికెదన్‌.’
102
క. ‘విను సత్యం బాడెదఁ; బా | ర్థునిచే నేఁ డెల్లభంగిఁ దునుమంబడు క
ర్ణునిదెసఁ జింతయు వంతయు | మనుజేశ్వర! విడువు; పంపు మమ్ముఁ దెలివితోన్‌.’
103
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )