| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అనుటయు ధర్మసూనుండు ససంభ్రమంబుగాఁ గృష్ణు నెత్తి, యతండు ప్రాంజలి యై యుండ నతని కి ట్లనియె: | 104 |
| క. |
‘ఇది యట్టిద మోసంబునఁ | బదిలుఁడఁ గా కేను మున్ను పదరినకతనన్ హృదయము గలఁగిన, నా కె | య్యదియును దోఁపమి, వికారి నైతి మహాత్మా!’ |
105 |
| ఆ. |
‘ఇట్టి నన్ను ననునయించి బోధించితి; | కరుణ పేర్మిఁ జేసి గారవమున నజ్ఞులైన మమ్ము నాపత్పయోనిధి | మునుఁగకుండఁ గాచి తనఘమూర్తి!’ |
106 |
| వ. | అనియె, నప్పుడు వివర్ణంబగు వదనంబు వాంచియున్న వాసవిం జూచి, వాసుదేవుండు; ‘నీ విట్లు విషణ్ణుండ వగుట గర్జంబుగా; దిమ్మేదినీపతి ముఖప్రసాదం బభినందించి యనుమతి వడసి చని, రాధేయ వధ విహారంబున నితనికిం బ్రియం బాపాదింతుగాక! యింకఁ దడయ నేల?’ యని పలికి వెండియు. | 107 |
| ఉ. |
‘ఈతని నొవ్వఁ బల్కుటన, యీ దురవస్థకు వచ్చి తక్కటా! శాతమహాసి నీ నృపతిఁ జంపిన నెట్లగుదో? విపత్తికిం బాతకఘోరవృత్తికిని బాసితి దైవ మనుగ్రహించుటన్; నీ తెలి వాప్తబంధుజన నిర్మిత పుణ్యవిపాక మర్జునా!’ |
108 |
| వ. | అనిన, నతండు గన్నీ రొలుక, నన్న పాదంబులపైఁ బడిన; నప్పాండవాగ్రజుండును బాష్పప్లావితముఖుం డగుచు నతనిమీఁద నొఱగె; ని ట్లయ్యిరువురు నొండొరులం బట్టికొని యేడ్చి; రచ్యుతుం డుడుప నుడిగి, తత్కాలోపగత సముచిత పరిజనానీత జలంబుల ముఖప్రక్షాళనంబు సేసికొనిరి; తదనంతరంబ ధర్మనందనుండు దమ్మునిం గౌఁగిలించుకొని మూర్ధాఘ్రాణంబు సేసి, చిఱునవ్వుతో ‘మనల నింత వఱచునే కర్ణుం?’ డని పలికి, మఱియును. | 109 |
| ఆ. |
‘ఎల్లఁజూడ, సిడము విల్లు నశ్వంబుల | సూతుఁ దునిమి, నన్ను నాతఁ డలవు నెఱయ గెలిచె; నతని నీ విప్డు సంపక | యున్న నాకు బ్రదికి యుండఁ దగునె?’ |
110 |
| చ. |
అనవుడు, నమ్మహీపతికి నర్జునుఁ డిట్లను; ‘నేఁడు కర్ణు నే ననిఁ బడవైతు; నీయడుగు లాన! తదీయ సుహృద్గణంబుతో; విను మటు సేయ కే మగిడి వెల్వెలఁ బాఱెడు మోముతోడు వ త్తునె? యిట కృష్ణసారథియుఁ దూలునై మానవిహీనవృత్తియై?’ |
111 |
| వ. | అని గోపాలదేవు నాలోకించి: ‘నీ మనంబునం గర్ణుండు దెగటాఱ వలయు నని యించుక దలంపుము దాన నే నతని వధియింతు’ ననిన, నమ్మహాత్ముం ‘డట్టి పనికిం జాలుదు!’ వని యుత్సాహదీప్తుండై పలుకుటయుఁ, బార్థుండు నిజరథంబు సవిశేషకల్పితంబు సేయించి, రథ్యంబుల జలపాన ఖాద్యఖాదనంబులం బ్రబలంబులఁ గావించి పూన్పించి, యగ్రజు వీడ్కొని గమనోన్ముఖుం డగుటయు, నచ్యుతుం డవ్విభు వీక్షించి ‘నీ తమ్మునిం గారుణ్యార్ధ్ర కటాక్షంబుల నిరీక్షింపుము; దీవనయిచ్చి పనుపు’ మని చెప్పిన, నన్నరవరుండు గిరీటిం దిగిచి బిగియారు కౌఁగిటం జేర్చి, ‘నీవు కృష్ణుపనుపునం దగుమాటలాడి; తత్తెఱంగు నేనునుం దెలిసితి; నా యెఱుంగమి నిన్నుం బలికిన పలుకులకు నుమ్మలింపకుమీ’ యనుటయు, నతండు వికసితవదనుం డగుచుఁ దత్పాదద్వయంబు ఫాలంబు సోఁకం బ్రణతుం డయిన; నమ్మానవపతి యెత్తి పునఃపునరాలింగనంబు సేసి, ‘కర్ణుని గెలువు విజయ! నీకు విజయంబు శాశ్వతం బయ్యెడు’ మని దీవించిన నమ్మేటి మగండు నాటోపంబుగా ‘దేవ! నిన్ను నొప్పించిన యప్పాపకర్ము మత్కార్ముకముక్త శిలీముఖంబులం బొలిపుచ్చి, యిదె వచ్చెద!’ ననుచు నంజలి పుటంబు నిటలంబునఁ గదియించి వీడ్కొనియెఁ; దదనంతరంబ దామోదరుండును నన్నరుండును నరదం బెక్కి, యలరునుల్లంబులతో నరిగి శుభప్రదంబు లగు నిమిత్తంబులకుం బ్రమోదంబు నొందిరి; పదంపడి రాధేయ వధ ప్రకార చింతా క్రాంతుండైన గాండీవి తనువునం బ్రస్వేదకణమ్ములు గ్రమ్మినం గనుంగొని, కమలనాభుం డతని కిట్లనియె: | 112 |
| ఆ. |
‘అమరులకు నజయ్యు లగువారిఁ బెక్కండ్ర | గెలిచి తీవు; నీకుఁ గల యుదాత్త దివ్యబాణములు నుదీర్ణధనుర్వేద | కౌశలంబు బలముఁ గలదె యెందు?’ |
113 |
| చ. |
‘అమరనదీతనూభవుఁడు, నస్త్రగురుండు భవన్మహాస్త్ర ది వ్యమహిమలో నడంగిరి జయద్రథు చా వధికాద్భుతంబు; మ ర్త్యమునన కాదు లోకముల నన్నిట నీ కెదు రెవ్వ? రేల చి త్తమునఁ గలంక? యూఱడుము దర్పము నెక్కెడు నంతకంతకున్.’ |
114 |
| క. |
‘బలమును శౌర్యముఁ దేజముఁ | గలఁ డని కౌరవులు నమ్మి కర్ణుని నీతోఁ దలపెట్టిరి; నీ బాణం | బులఁ గూలెడు నతఁడు; కీర్తి వొందెడు నిన్నున్. |
115 |
| క. |
కురుపతి యాశలు మాలఁగ | దురమున రాధాతనూజుఁ దునుమాడి, జయ స్ఫురణంబునఁ గృతకృత్యతఁ | బొరయుము, నీవారు మోదమునఁ దేలంగన్.’ |
116 |
| వ. | అని వెండియు. | 117 |
| ఉ. |
‘కౌరవసైన్య మగ్గలము గాదె కడున్? భవదీయ సేన క వ్వారణకోటు లా తురగ వర్గము లా రథ సంచయంబు లా వీర భటావళుల్ బహుళ విక్రమకౌతుకి వైన నీ శరా సారములన్ బడల్పడఁ గృశం బగు టిప్పుడు నీకుఁ దోఁప దే?’ |
118 |
| క. |
‘కురుసేనలకుం బతియై | సరిత్సుతుఁడు పదిదినములు సమరము సేసెన్; శరమహిమ నతఁడు నీచే | స్థిర శరతల్ప గతుఁ డయ్యె ధీరవిచారా!’ |
119 |
| చ. |
‘అతని శిఖండి బాణముల క ట్లెరసేసితి; ద్రోణునిం జమూ పతియుఁగ జేసెఁ గౌరవ నృపాలకుఁ; డగ్గురుఁడున్ భవచ్చమూ పతి నడఁగించెనే దివసపంచక, మమ్మెయిఁ బోరి తావకా ప్రతిహత బాహురక్ష యిరువాఁగును జూడదె పాండవోత్తమా!’ |
120 |
| క. |
‘భీముని రణవిహరణ ము | ద్దామం బగు టెల్ల నీదు దర్పంబునఁ గా దే! మాఱు లేని భవద | స్త్రామేయబలంబు దెలియు నంతయు నాకున్.’ |
121 |
| వ. | ‘కృపాశ్వత్థామ కృతవర్మ కర్ణశల్యులు నీచేతం బోయెడువారు ‘కృపాశ్వత్థామల దెసం గృప సేసితేనియుం జంపక గెలిచి విడువుము; చుట్టం బని యరవాయి గొనుట కర్జంబుగాదు, గృతవర్మను సమయింపుము; శల్యుండు మేనమామ యైనను బగవారిం గూడి పరాక్రమించు చున్నవాఁడు గావున నతని వధించుట పాపం బని తలంపవలదు; కర్ణుండు జతుగృహదాహంబును గపటద్యూతోత్సాహంబును లోనుగాఁ గల దుర్యోధను దుర్నయంబులకు మూలం; బట్లుగాక జూదంబునప్పుడా సభలోన ద్రౌపది నుద్దేశించి యప్పాపాత్ముండు. | 122 |
| క. |
‘లే రిచట మగలు నీకును; | వీరలు జూదమున నోడి విడిచిరి నిన్నున్; వారిజలోచన! నీపైఁ | గూరిమి గలమగని వెదకికొను మొరు’ ననఁడే! |
123 |
| తే. |
‘ఏను సంధికిఁ బోయినఁ దాను ధార్త | రాష్ట్ర మానసములఁ బగ రాఁజఁ బెట్టి నన్నుఁ బట్టింపఁ జూడఁడె? యెన్నఁ డైన | నాదికారణ మతఁడ మీయాపదలకు. |
124 |
| చ. |
వినుము! సుభద్ర పట్టి బలు విల్ మును వంచన వాఁడు డాసి త్రుం చిన, మఱి కాదె యందఱును జేరి వధించుట? యా పరాభవం బనలమ పోలె నున్నది యహర్నిశముం బరితాపకారి యై మనమున నస్త్రవృష్టి నది మాన్పుము, బంధులు మోద మందఁగన్. |
125 |
| క. |
‘ఆ సభ నా దుష్టాత్ముఁడు | సేసిన దుర్నయము సూచి, చిత్తమునఁ గడున్ నోసిన బంధులు వానిని | గాసిగ గ్రద్దగమి దొలువఁ గనుఁగొని వలదే!’ |
126 |
| వ. | ‘వాఁడు వడినం దక్కటి రాజులుం గౌరవులు నీకు మొనకట్ట’ రని చెప్పె; నిట్లు సెప్పుచు, సమర స్థలంబున కనతి దూరంబుగాఁ జని యఱ్ఱెత్తి చూచి, కర్ణుండు సంగరంబు సేయు సంరంభం బుగ్గడించి, యగ్గాండీవికిం జూపి పుండరీకాక్షుండు వెండియు. | 127 |
| క. |
‘కేతనము రథముఁ దురగ | వ్రాతముఁ బొడిచేసి, నీ శరంబులఁ గర్ణున్ వే తునిమినఁ గని, శల్యుఁడు | వాతెఱ యెండంగఁ బాఱవలదె కిరీటీ! |
128 |
| వ. | పూనిక నెఱపి, శోకం బుజ్జగించి, లోకంబు సంస్తుతింప సుఖివి గ’మ్మనినం బ్రముదిత హృదయుండై.’ | 129 |
| శా. |
‘నీ తోడ్పాటున నేఁ ద్రివిష్టపముల న్గెల్వంగ నూఁకింతు; నా చేతం గర్ణుఁడు రూపు మాలి చను; మెచ్చింతున్; ననుం జూడుమీ దైతేయాంతక!’ యంచు శేషనిభ హస్తం బుద్ధతిం జాఁచి, ని ర్ధూతారాతిబలుండు పుచ్చికొనియెన్ దుర్దాంత కోదండమున్. |
130 |