| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘ఐనను నిప్పటిదుఃఖము | మానింపఁగ మనకు నొండు మం దెయ్యది? యీ సేనల దొరలను గౌరవ | భూనాథుని సమయఁ జూచి పోవుట దక్కన్?’ |
140 |
| వ. | అని పలికి, యవ్విశోకునకు మనదిక్కు సిడంబులు సూపి, ‘యవి యెవ్వరెవ్వరి చిహ్నంబు లేర్పడం జూచికొనుము; మన శరంబుల కొలంది యెట్లున్న దరయు’ మనవుడు, నతండు ‘వీ రెవ్వరైననేమి? నీ వలిగినఁ బడక పాఱక నిలువం జాలు వాఁ డిం దెవ్వం? డస్త్ర శస్త్రంబుల సంపద యడుగవలదు; నేఁడు దెచ్చినవానిలోన నా ఱెడ్లు వ్రేఁగుపడి పూనివచ్చు బండియొక్కటి యించుకయు వెలితిగాక యున్నయది! గాకున్న నేమి? భవద్బాహుదండంబునకు మూలధనంబైన గదాదండం బెల్లపనులకుం జాలు’ నని చెప్పిన బవమానసూతి యాసూతు చేసేత నప్పళించి. | 141 |
| ఉ. |
‘వేడుకఁజూడు మేను బటువిక్రమకౌతుకలీలఁ బేర్చి చెం డాడెద వైరులన్; విదురుఁ డప్పుడు సెప్పఁడె? జూద మిట్లు గా వాడెనె రాజరా జకట! యా ప్రతినల్ గడతేర్చుఁ గాక! బొం కాడునె ధర్మజావరజుఁ డంచుఁ దదాప్తులు వంతఁ బొందఁగన్. |
142 |
| వ. | అని వెండియు. | 143 |
| ఉ. |
ఉత్తమకర్మ మిట్టి దని యొక్కరుఁడుం దగఁ జెప్పలేఁడ నా కిత్తఱి; నేన పోలుతెఱఁ గెల్లను జేసెద నట్లుఁ గాక, నా చిత్తము మార్గవర్తియుఁగ శిక్షక మయ్యెడు దైవ’ మంచు, న ఱ్ఱెత్తి భవద్బలంబుపయి నెల్లను జూ పడరించె నేపునన్.’ |
144 |
| వ. | ఇట్లు గలయం గనుంగొని, యద్దిక్కు గలగుండు గొనుట యెఱింగి, విశోకునితోఁ ‘గౌరవసైన్యంబు మనము దఱుమకయ తాన కలంగెఁ; గెలనం గవ్వడి గదిసెనొ కాక!’ యనుటయు; వాఁడు నిపుణంబుగా నిరూపించి ముదంబునం బొదలుచు. | 145 |
| క. |
‘నరుఁ డదె కంటే! కౌరవ | కరిసేనం గవిసెఁ గేతుకపి రుచు లంభో ధరబృందముపైఁ గలయం | బరఁగు తటిల్లతలఁ దలఁపఁ బట్టయి నిగుడన్.’ |
146 |
| క. |
‘హరిమేనికాంతియును నరు | కిరీటరత్నాంశువులును గిఱిగొన, రథ ర థ్యరుచులు బెరసి విచిత్ర | స్ఫురణంబునఁ దేజరిల్లెఁ జూడు కుమారా!’ |
147 |
| వ. | అనిన విని, యంతరంగంబు సంతోషమయంబు గా నంగంబు వొంగ, నేర్పడ నాలోకించి, విశోకునకు వృకోదరుం డి ట్లనియె: | 148 |
| తే. |
‘వరవుడుల నూర్వురను, మేలివాజు లిరువ | దింటి, నూళులు పదునాల్గు నిత్తు నీకుఁ బసదనము; నీవు నాకు బీభత్సురాక | సూపి ముద మొనరించితి సూతవర్య!’ |
149 |
| వ. | అనియె; నప్పుడు వారణ ఘటావిదారణంబు సేసి, వాసవి వాసుదేవుతో ‘మన తేరు భీమసేనుఁ జేరం బోవ ని’ మ్మనుటయు. | 150 |
| క. |
అతఁడు హరులఁ దఱుమఁగ ను | ద్ధతిఁ జనునెడ, మనబలంబు దర్పమహోగ్రా కృతిఁ బొదివినఁ జతురంగ | ప్రతతుల నన్నరుఁడు నేలపాలుగఁ జేసెన్. |
151 |
| ఆ. |
మందరంబుచేత మథితమై తిరుగు సా | గరము నులివు గెలిచె ధరణి నాథ! పార్థుఁ డురవణింప బలువడిఁ గలఁగెడు | కౌరవేంద్రుసేన కలకలంబు. |
152 |
| వ. | కేతు చామ రాతపత్ర భూషణ శకలంబుల నా శౌర్యభూషణుండు రణక్షోణికి విభూషణం బాచరించె; నట్లు కర్ణువధంబునకు వేగిరపడి తఱుమ నుఱుక, మన మొన వెండియు నొండొండ పయిం గ్రమ్మిన, నమ్మేటి మగండు. | 153 |
| క. |
పేరు గల రథికముఖ్యుల | సారథి రథ రథ్య కేతుసహితంబుగ దు ర్వార విశిఖ స్ఫురణ వి | హారంబున శతచతుష్టయము పొడి చేసెన్. |
154 |
| వ. | అవ్వేఁడిమికి వెఱచఱచి యచ్చటిమూఁక విచ్చుటయుఁ, గర్ణుముందటి మోహరం బుత్సాహతీవ్రం బయి యురవణించినం గని, యన్నరుం డురగ నికరంబునకుఁ గవియు గరుడుని కైవడి నద్దెస కడరె; నట్లడరుట యాలోకించి తనకట్టెదుటి మొనబెట్టు దాఁకి. | 155 |
| తే. |
వాయుసత్త్వుండు వాయుజవ ప్రదీప్త | తనుఁడు వాయుతనూజుఁ డుదగ్రవృత్తి నేచి, బాహాసముల్లాస మెసకమెసఁగఁ | గనుపు గొట్టె వాలమ్ములఁ గౌరవేంద్ర! |
156 |
| వ. | అవ్వీరు నాటోపంబు సూచి, కురుభూపతి ప్రధాన సైనికులకుం జూపి ‘యితండు సమసిన నక్కడ సకలంబు సమయు, మీ రొక్కుమ్మడిం బొదివి పారివుచ్చుం’డనిన, వారును వారణాది చతురంగంబుల యగ్గలిక మెఱయ నతనిం జుట్టుముట్టి, యస్త్రశస్త్రంబులం బొదువుటయు, నతండు, | 157 |
| ఆ. |
వానినెల్లఁ ద్రుంచి, వల వ్రచ్చికొని లీల | నిగుడు చోఱవోలె వెగడు పడక తఱిమి, రక్తనదులు వఱపె మస్తక కూర్మ | హస్తభుజగ తతుల నతిశయిల్ల! |
158 |
| క. |
కురు విభుఁడు సూచి శకునిం | బురికొల్పిన, నాతఁ డుగ్రముగ మార్కొని, పే రురమున నారాచంబులు | గురిసినఁ, బవనజుఁడు సరకుగొన, కారథికున్. |
159 |
| క. |
బలునారసమున నేసిన, | నలఘు లఘుత మెఱయ నాతఁడది యిరు మూఁడ మ్ములఁ దునియలు సేయుడు, నతఁ | డలిగి యతని ధనువు దునిమె నల్లన నగుచున్. |
160 |
| ఉ. |
ఒండొకవిల్లు వుచ్చికొని, యుజ్జ్వల షోడశ భల్లముల్ సము ద్దండత నేసె నీమఱఁది తత్తను వాడఁగఁ, జాప కేతువుల్ ఖండములై పడంగఁ, దురగంబులు నొవ్వఁగ, సూతుమేనఁ బెన్ గండలు నెత్తురుల్ దొరఁగఁ, గౌరవ పుంగవుఁ డిచ్చ మెచ్చఁగన్. |
161 |
| తే. |
అలిగి జమునాలుకయుఁబోని యతులశక్తి | వాయుపుత్రుఁ డారథికుపై వైచె, నతఁడు వెరవుమైఁ బట్టి, దాన నవ్వీరుబాహు | వుచ్చిపో వైవ, మనమొన యుబ్బి యార్చె. |
162 |