| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| చ. |
అనిలజుఁ, డట్లు పెల్లెసఁగు నార్పులు సైఁపక మేటివిల్లు వే కొని, కనుదోయి గెంపుగ నకుంఠిత విక్రమ మొప్పఁ ద్రుంచె నా తని ఘనకార్ముకంబు, నిశితప్రదరంబులు మేన నించె; నిం చిన నతఁ డుర్విఁ గూలెఁ గురుసేనకు బెగ్గల మగ్గలంబుగన్. |
163 |
| తే. |
కూలి మూర్ఛ మునింగినఁ, గురువిభుండు | దన రథంబుపై నిడికొని యనికిఁ దొలఁగఁ బోవుటయుఁ జూచి, తమ తమ పోరు మాని | దొరలు దెరలిన, మూఁకలు మరలి పఱచె. |
164 |
| వ. | ఇట్లు వెఱచఱచి, యవిసిన కలంబు జనంబులు దీవి సేరిన యట్లు కర్ణుం జేరి కాలుదన్ని నిలిచె నని విని, ధృతరాష్ట్రుండు సంజయున కి ట్లనియె. | 165 |
| తే. |
‘అట్టియెడఁ గృతవర్మ ద్రోణాత్మజుండుఁ | గృపుఁడు నృపతియుఁ గర్ణుండుఁ గినియఁ జాల రయిరె? కిమ్మీరవైరి కయ్యంబు కడఁక | యిట్టు లుండునె? పదపడి యెట్టు లయ్యె?’ |
166 |
| వ. | అనిన, సంజయుం డమ్మహీపతి కిట్లనియె: నప్పుడు కరూశ పాంచాల చేది సైన్యంబులఁ దఱుముటయుం గని, కర్ణుండు గడంగిన మనమూఁకలుం బురికొని పవనతనయుతోడం బోరె. నప్పాండవసేనా సముదయంబు రభసంబున నా రాధేయుం బొదివిన. | 167 |
| క. |
అతఁడు వివిధోగ్ర విశిఖ | ప్రతతులు నిగిడించి ఘోరభంగి నుదారో ద్ధతి సూపినఁ, జేడ్పడి త | చ్చతురంగంబులును గలఁగె జగతీనాథా! |
168 |
| చ. |
కనుఁగొని, భీమసేనుఁడు శిఖండియు సైన్యవిభుండు ద్రౌపదీ తనయులుఁ గేశవానుజుఁడు దాఁకిన, నందఱ కన్నిరూపులై తనువులు సించుచున్ హయవితానము నొంచుచుఁ గేతుదండ ఖం డన మొనరించుచుం బెనఁగె డయ్యక క్రుయ్య కతండు గండునన్. |
169 |
| క. |
నకుల సహదేవులును వా | రికిఁ దోడ్పడి నిశితశర పరీతునిఁ జేయం, బ్రకటిత బలశౌర్యుఁడు సూ | త కులోద్వహుఁ డేచి, వారిఁ దలఁకం జేసెన్. |
170 |
| క. |
పెక్కండ్రతోడఁ గర్ణుం | డొక్కఁడ పోరాడి, యెక్కు డుక్కున వారిం జిక్కువడం జేయుట గడు | నక్కజ మై యుండెఁ గౌరవాధిప! చూడన్. |
171 |
| వ. | ఇవ్విధంబున న ద్దెసఁ జేయంగల మేటిమగల వెగ డందించినం, బోక పొదువు పాంచాల చేది మాత్స్యాదివర్గంబులపై నతం డనర్గళ ప్రసారంబులగు శరాసారంబులు నిగిడించినం, గరి రథ ఘోటక భటావయవ ఖండంబులును వివిధాస్త్ర శస్త్రశకలంబులును జామర చ్ఛత్ర కేతు భూషణ భాగంబులును భూ భాగంబునం దొరఁగం బెరిఁగి, నెత్తురు టేఱులు వాఱ; మఱియుం బాండవ యోధవరులు వరుసం బోరి పోరి యంత కంతకు నివ్వటిల్లు నాకర్ణు క్రొవ్వున నివ్వెఱ పడిన, నవ్వీరుండు గోవులం దోలు కోల్పులికైవడిఁ గౌంతేయ బలంబులం బఱపఁ, బాంచాలురు వెండియు దండితనంబున నతనిం దలపడిన; నాతండు పంచవింశతి రథికులం దునిమి వైవస్వతు చందంబునం బేర్చినం, దూర్య రవంబులు సెలంగం దత్పుత్రులును దుర్యోధన కృప దుశ్శాసనులు నశ్వత్థామ శకుని కృతవర్మలుం బైకొని, యా ధర్మనందను సైన్యంబు సమయింప; నది విచ్చిన, నెలుం గిచ్చి పోనీక నిలిపి, భీమ నకుల సహదేవ ధృష్టద్యుమ్న శిఖండి ద్రౌపదేయులు గడంగి కౌరవ సైనికులం గనుపుగొట్టం దొడంగినం, బోరు ఘోరంబయ్యె; నిత్తెఱంగున రెండు దెఱంగుల మూఁకలు దెగటాఱుచుండ, గాండీవి దమ మోహరంబున కుత్సాహం బెసంగ నొక్కవలన మనమొనల నెత్తుటం జొత్తిల్లం జేయుచుం గదిసి, దలయెత్తి చూచి శౌరి నుద్దేశించి. | 172 |
| సీ. |
‘కర్ణునికేతువు గ్రాలెడుఁ జూచితే | భీమాదులైన యుద్దామ రథిక జనులు పెక్కండ్రతో నని సేయుచున్నవాఁ | డితని ప్రాపున గురుసుతుఁడు గృపుఁడుఁ గృతవర్మయును గురుపతి సురక్షితుఁ జేసి | కొని, వీఁకఁ బాంచాలకోటి బడలు వఱిచెద రురవడిఁ దఱిమి; యా రాధేయు | గీటడఁగింతము, ఘోటకములఁ |
|
| తే. |
బటురయమునఁ బోని’ మ్మని పలుకుటయును | శౌరి యట్టులు సేయంగ శల్యుఁ డమ్మ హోగ్ర రథవేగమును, నరునుజ్జ్వలంపు | టేపుఁ గని, సూతపుత్రుతో నిట్టు లనియె: |
173 |
| క. |
‘కేతన కపి భయదంబై | తోఁతేరఁగఁ, జక్రధర చతుర సారథ్య ద్యోతితవల్గన చారు | శ్వేతహరులు మెఱయ వచ్చు వీరునిఁ గంటే!’ |
174 |
| వ. | అని మఱియును; | 175 |
| సీ. |
‘నవ్వెడు తలలను, గ్రొవ్వారు చేతుల | బిరుదులు వెట్టిన చరణములను, వాతులు దెఱచిన వాజి మస్తకముల, | గిరిశృంగములఁ బోని కరిశిరముల, నవయవ భేదంబు లడఁగెడునట్లుగఁ దుము | రైన బహుగాత్ర సముదయముల భయదంబు లై మహిఁ బడు విమానములట్ల | యఱవఱ లైనట్టి యరదములను |
|
| తే. |
నేలఁ గప్పుచుఁ; దన బాణ జాల మదర, | నెవ్వ రడ్డము సొచ్చిన నించుకయును దవులఁబడక, సముద్ధతిఁ దివిరి మనలఁ | దేఱి చూచుచుఁ బార్థుఁ డీ దిక్కు గవిసె. |
176 |
| క. |
తోడై డాపట వలపటఁ | గూడి తఱుమువారు లేరు; కోపంబున నీ తోడి బవరమున కడరెడుఁ | గ్రీడి; మనతలంపు గూడె, గెలుపుము గడఁకన్. |
177 |
| ఆ. |
పాయ వడియె సేన; బరవస మలరంగ | మార్కొనంగ మేటిమగఁ డొకండుఁ గలుగ నోపఁ, డేపు దలకొన మనమ యి |బ్బలియుఁ దలపడంగ వలయుఁ గర్ణ! |
178 |
| వ. | అనిన విని, కర్ణుండు గవ్వడి బాహాబలంబును శౌర్య సారంబును దపః ప్రభావంబును ముక్కంటితోడ నెక్కటి పోరుటయును బాశుపతాది దివ్యాస్త్రంబులు వడయుటయును, బురందర ప్రముఖ బృందారకులకు నజయ్యులగు కాలకేయుల నిర్జించుటయు విరాటు పసుల మరల్చుటయు లోనుగాఁ గల విశేషంబు లుగ్గడించి, కృష్ణుమాహాత్మ్యంబు వొగడి: ‘యిట్టివారల నే నొక్కరుండన మార్కొని మదం బడఁగించెద మద్రనాయక! మన తేరు వారి యరదంబునకు సమ్ముఖంబుగాఁ జనని’మ్మనిన, నతం డట్ల చేయఁ గనుంగొని, కురుపతి పురికొలుపఁ గృపకృతవర్మ గురుపుత్ర గాంధార విభులును గొందఱు కుమారులును విక్రమాటోపంబు దీపింప నయ్యంగరాజుం గడచి యడరి యాఫల్గునుం బొదివిన, నమ్మహాభుజుండు హరిణ కులంబు గనిన సింగంబు విధమున విజృంభించి, యా రథికులపైఁ గలయ వివిధ విశిఖంబులు నిగిడించి, ధనువులు దునిమియు, ఘోటకంబులఁ గూల్చియు సారథుల సమయించియుఁ దత్సేనా చతురంగంబుల బడలువఱిచియు నబ్బలు మగలం దెరల్చి యొత్తరించి, కెలనన దురంబు సేయు నమ్మరుత్తనయుం జేరం జని, బహువిరోధిజన పయోధిమగ్నుం డగుచున్న యతని నుద్ధరించి, సంప్రీతుం డగు నతనికి నగ్రజుకుశలం బెఱింగించి సంతోష సాగరంబునం దేల్చి, ‘నీ విఁక డప్పి యార్చికొ’మ్మని పలికి, రాధేయ రభసోత్సాహ సహితం బగు నీ బలంబుమీఁదం గవిసిన. | 179 |