పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - తృతీయాశ్వాసము
కురుకుమారులు పదుగు రర్జునుం దాఁకి మృతు లగుట (సం. 8-58-23)
చ. తొడరి భవత్తనూజులు పదుండ్రు సముద్భట సింహనాదు లై
వడిఁ దనుఁ జుట్టుముట్టుటయు, వారల సూత హయధ్వజంబులం
బొడి పొడి సేసి, యాతఁడు రిపుల్‌ వెగడంద వెడంద తూపులన్‌
మెడలు దెగంగ నేసి రణమేదినికిన్‌ బలి సేసె నత్తలల్‌.
180
వ. అట్టియెడ. 181
తే. నవతి కౌరవ రథికులు గవిసి కడిమిఁ | బొదువుటయు, నన్ని శరముల భూరి రయము
మెఱయ నందఱఁ దెగటార్చి తఱుము నతనిఁ | దాఁకె వేయుమున్నూఱు దంతావళములు.
182
వ. ఇట్లు దాఁకిన, యాభీరాది మ్లేచ్ఛనికరంబుల నతం డనేకవిధ విశిఖంబుల విరియింపం, బై పైఁ గరి తురగ సుభట రథ సమూహమ్ములు గ్రమ్మినం, గని కడంగిన వడముడి తోడ్పాటునం జేడ్పడియు నవి వోక పొదివి పెనంగిన, గద గొని యరదంబు డిగ్గి యగ్గలిక నప్పవనతనయుండు దారుణ రణ విహారంబుననెఱయ, మెఱయం; దఱుచుగా మెఱుంగు వాలంపగములు గాండీవి గుప్పింప నప్పు డమ్ముఖంబు చతురంగంబులయం దొక్కఁడేనియు రక్తంబునం దోఁగనియట్టిది లేక యుండె; నట్లు గార్చిచ్చు వొదివిన కాననంబు చందం బయి యా సైన్యంబు రూపఱ విఱిగి ‘కర్ణ! కర్ణ! కావు కావు’మను నెలుంగులతో నతనివెనుక కొదిఁగిన నీ కొడుకు లబ్బలుమగని బలసి నిలువ, నా వీరుండు దీవికైవడి సమరార్ణవంబున మునుంగ నీక యమ్మోహరంబు నుద్ధరించి, మౌర్విఁ దాటించి కిరీటి దెసకు నడరె; నంతకు మున్న యరదం బెక్కి యనిలతనయుం డా ధనంజయునిం గూడుకొనిన నయ్యిరువురకుం దల కడచి పాంచాలు రా సూతనందనుం దలపడుటయు. 183
తే. ద్రౌపదీనందనులును సాత్యకియు లోను | గాఁగఁ బాండవ సైనికోత్కరము గవిసి
కూడికొనియెఁ బాంచాలురఁ గురువరేణ్య! యందఱకు నన్నిరూపులై యతఁడు పెనఁగె.
184
వ. అప్పుడు. 185
సీ. జనమేజయునిసూతుఁ దునిమి రథ్యంబుల | నో నేసి, భీమతనూజ నకుల
సుతుల చాపములు ఖండితములు సేసి, ధృ | ష్టద్యుమ్ను మావుల సమయఁ జూచి
మెయి వెంచి సాత్యకి హయములఁ గూల్చి, కే | కయుకుమారుని జముకడకు ననుపఁ;
దజ్జనకుం డల్గి తన్ను నొప్పించి ప్ర | సేనునిఁ దాఁ జూడఁ జెలఁగి చంపు
 
తే. టయును, బుత్రశోకంబు గిన్కయు మనంబు | నందుఁ బిరిగొన రాధేయుఁ డతని నఱకె;
శినివరుం డొండువాజులఁ దన రథమునఁ | బూన్చికొని వచ్చి, తత్సుతుఁ బొదివె నధిప!
186
వ. ఇట్లు సూతపౌత్రుఁడగు సుషేణుం బొదివి శినిపౌత్రుండు. 187
చ. హయములఁ జంపి, ముప్పది శితాస్త్రములం దెగటార్పఁ జూచి, తం
డ్రి యముని చందమై ‘తెగితిరే శినివీరుఁడ’ యంచు నేయుడు,
న్భయద మహోగ్రతన్‌ నిగుడునారసమున్‌ నడుమన్‌ శిలీముఖ
త్రయమునఁ ద్రుంచి మేనఁ బ్రదర త్రితయంబు శిఖండి గ్రుచ్చినన్‌.
188
తే. కనలి యా సూతపుత్రుఁ డాతని సిడంబు | ధనువుఁ దునుమాడి, పార్షత తనయుఁ డగు సు
దేవుఁ దండ్రులు గనుఁగొనంగా వధించి, | యేసె సుతసోముఁ డడరిన నేపు దఱుఁగ.
189
వ. వెండియుఁ బాంచాల రథిక సంఘంబులు రాధేయుమీఁద నురవణింప, సమీరణసుత సహాయుం డగు సవ్యసాచి వానిం గడచి యక్కర్ణు నరదంబున కడరె; నట్టియెడ నుత్తమౌజుండును జనమేజయుండును యుధామన్యుండును శిఖండియు ధృష్టద్యుమ్నుండును నతనిం దల మిగిలి, యబ్బలుమగనిం బొదివి, యింద్రియంబులు దృఢాత్మునిం గలంపం జాలనిచందంబున నా సూతనందనుఁ దెరల్పం జాలరైరి; వారల కేతు చ్ఛత్ర సూత తురగ ధను స్తూణీరంబులు రేణువులు సేసి బహుబాణంబులఁ దనువులు నోనేసి సింహనాదంబు సేసిన, యయ్యంగపతిపై సుసంగతులై ద్రౌపది కొడుకులు గవిసిరి; వారిం గూడికొని శినివరుం డా సేనాపతి వారి నేయు సాయకంబులు ద్రుంచి, యాతనికిం దోడ్పడుటకుం గడంగిన కౌరవపతి యంగంబున నెనిమిది సునిశిత విశిఖంబులు గ్రుచ్చి పేర్చిన. 190
క. అలిగిన యన్నరనాథుని | కెలఁకుల వెసఁ దఱిమి, కర్ణ కృప కృతవర్మల్‌
బలుతూపుల నేయఁగ న | న్నలువుర స్రుక్కించె నతఁడు నారాచములన్‌.
191
తే. దొరలఁ గడఁచి బలంబు లుద్ధురత నిగుడ | వారి మొనలు నెదిర్చిన, ఘోర తుముల
సంగరంబయ్యె; నయ్యవసరమునందుఁ | దాఁకె దుశ్శాసనుఁడు వాయుతనయుతోడ.
192
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )