| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| మ. |
నరసింహుం డసురేంద్రు వ్రచ్చుకరణి, న్రౌద్రం బుదగ్రంబుగా నుర మత్యుగ్రతఁ జీరి, క్రమ్ము రుధిర మ్ముల్లాసియై దోయిట న్వెర వారం గొని త్రావు, మెచ్చుఁ జవికి, న్మేనున్ మొగంబున్ భయం కర రేఖం బొరయంగఁ జల్లికొను, నక్కౌరవ్యుఁ జూచుం బొరిన్. |
214 |
| వ. | ఇట్లు దారుణ భంగిం బ్రతిజ్ఞాకరణ పూరణం బాచరించి. | 215 |
| తే. |
‘తల్లి చన్నుల పా లేను ద్రావ నెట్టు | లాననే పలుతెఱఁగుల తేనియలును ఖండశర్కరతోడి దుగ్ధంబు లనుభ | వింపఁబడవే! యవియు నింత యింపు గావు.’ |
216 |
| చ. |
అని యెలుఁ గెత్తి పల్కు నలి నాడు, మహోద్ధతిఁ ద్రుళ్ళు, నార్చుఁ, బె ల్చన భుజ మప్పళించుఁ దమ సైనికులున్ మనవారు రక్కసుం డని వెఱఁ గందువారు, గళితాయుధు లయ్యెడువారు, భీతి మూ ర్ఛను బడువారునై రణ విరామముఁ బొంద మదోత్కటాకృతిన్. |
217 |
| వ. | పదంపడి. | 218 |
| మ. |
గద సేతం గొని, యంత్యకాల యమరేఖం బేర్చి, రక్తంబు చా య దలిర్పం దను వుగ్రసుందరముగా నవ్వీరుఁ డేతెంచి, యు న్మద మాతంగము లీల దోఁప; మన సేనం బొల్పఱం దోలి వే పొదివెం గ్రమ్మఱ దుస్ససేను వికటస్ఫూర్తి స్ఫురన్మూర్తియై. |
219 |
| వ. | చలంబు నెఱయ నతని కాలు గేల నమర్చి మొగంబు గనుంగొనుచు నక్కిమ్మీరవైరి యి ట్లనియె. | 220 |
| క. |
‘ఏమిర! పసు లని యార్వవు? నీ | మాటలు నిలువఁబడియెనే? పసరమ! మి మ్మేము మగుడ నిదె యార్చెద; | మీ మాటకు మాఱు పల్క రెవ్వరుఁ గంటే?’ |
221 |
| ఉ. |
‘నెట్టన యల్గినం దగునె? నీళ్ళను ద్రోచుటయున్ విషాన్నముం బెట్టుటయున్ మహాభుజగ భీషణ దంష్ట్రలపాలు సేఁతయుం జుట్టలుఁ బెద్దలుం జెలులుఁ జూడ సభన్ నెఱిమాలి యిమ్మెయిం దిట్టున కోర్చు టెందుఁ గలదే? విను గెల్వరె జూద మెవ్వరున్?’ |
222 |
| క. |
అని పలికి, క్రమ్మఱఁగ మన | మొన మీఁదన్ బ్రమరి వాఱి, ముద్గరి లలితం బునఁ గేలు మెఱయఁ జని, తన | కన లడఁగక దుస్ససేనుఁ గనుగొని పలుకున్. |
223 |
| ఉ. |
‘ప్రై వడి పోయెఁ గాన ధృతరాష్ట్రుఁడు గన్నది యేమి? యా సభం దా వల దన్నఁ గీ డుడుగదా! పతి లేఁ డనఁబడ్డ కాంత నేఁ డీవు గనుంగొనంగఁ బతి యేడ్తెఱ నొప్పెఁ బతుల్ విజృంభిత శ్రీ విలసిల్లు కామినులు సేడ్పడి రిట్లపతిత్వ దీనతన్.’ |
224 |
| క. |
విను! మేను జేయఁ బూనిన | పనులం దొకటి గడతేఱెఁ; బాపాత్ము సుయో ధనుఁ బొరిగొని తల దన్నుదు | నను రెండవ పనియుఁ దీర్ప నరిగెద నెలమిన్’. |
225 |
| చ. |
అని యెలుఁ గెత్తి చెప్పి, యతఁ డాతని గీ టడఁగించి యార్చెఁ గ ర్ణునకును లోనుగా మన వరూథినియోధులకున్ మహాభయం బున మనముల్ గలంగఁబడి పోరికి నూల్కొననీని ఱిచ్చపా టున సకలాంగకంబులు గడున్ శిథిలంబులుగా మహోగ్రుఁడై. |
226 |
| క. |
జనపతియుఁ గృప ప్రముఖులుఁ | గనుఁగొన, ని ట్లనిలసుతుఁడు గ్రౌర్య మొడల్ గై కొనినట్లు పేర్చి దుశ్శా | సనుఁ జంపుటఁ జూచి, రోష సంరంభమునన్. |
227 |
| వ. | నీ కొడుకులు కవచియు నిషంగియుఁ బాశియు దండధారుండును ధనుర్గ్రహుండును నలోలుపుండును సహుండును షండుండును వాతవేగుండును సువర్చసుండును గూడి కవిసి, వివిధ విశిఖంబుల నతనిం బొదివిన; నంతకుమున్న దుశ్శాసన రక్తపాన కౌతుకాధీన మానసుం డైన యా భీమసేనుపై నెవ్వరు గడంగుదురో యని కన్నిడి యుండి, యతం డప్రతిహతంబుగాఁ బ్రతిన దీర్చుటకుఁ బ్రీతచిత్తుం డగు ఫల్గునుండు భల్లదశకంబున నక్కుమార దశకంబు శిరంబులు దునుమాడె; నట్టి భీమార్జునుల యాటోపంబున కోటఱి నీ సైన్యంబు సమర విముఖం బయ్యె, నా సూతనందనుండును భీతుండై వదనంబు వెలవెలఁ బాఱ నూరకుండె; నప్పుడు శల్యుం డతని నాలోకించి యి ట్లనియె. | 228 |
| తే. |
‘ఉగ్రుఁడై దుస్ససేనుని యురము వ్రచ్చి | రుధిర ముగ్రతఁ ద్రావు మరుత్తనూజుఁ జూచి చేడ్పడి చెయ్వేదెఁ జూచితే సు | యోధనుని? నీవు నట్లైన నొప్పు నెట్లు? |
229 |
| క. |
‘బలియు రగు రాజులును గాల్ | నిలువక తెరలంగ, వీరె నీ ప్రాపున శ త్రులఁ దాఁక దలంచి కృపా | దులు నిలిచిరి కూర్చికొను మతులధైర్యమునన్.’ |
230 |
| చ. |
‘కడు వెగడంది యున్న నినుఁ గన్గొని వీఁడె యుదారధైర్య మే ర్పడ వృషసేనుఁ డొక్కరుఁడుఁ బాండుతనూజుల మార్కొనంగఁ బో యెడు; నరు నీవు దాఁక వలదే? రణభారము నీభుజంబునం దిడియె సమస్తముం గురునరేంద్రుఁడు; దానిఁ దలంపు మిత్తఱిన్.’ |
231 |
| వ. | అనిన విని, యతండు సమరోన్ముఖుం డయ్యె; వృషసేనుండు భీమసేనుపై నురవణింప నకులుం డడ్డపడి, యక్కుమారుని సిడంబును గొడుగును గోదండంబును ఖండించిన. | 232 |
| చ. |
అలిగి యతండు వేఱొక శరాసన మెత్తి, రథమ్ము ఘోటక మ్ముల నిలఁ గూల నేయఁ, బొలివోవని ధైర్యము పేర్మి వాలునుం బలకయుఁ గొంచు, మాద్రితొలుపట్టి ధరిత్రికి దాఁటి బెట్టు గో ల్తలఁ జని తత్సహాయభట దారుణకేలి యొనర్చి పేర్చినన్. |
233 |
| ఆ. |
కర్ణసుతుఁడు పలక ఖండించి, కృష్ణ స | ర్పంబుఁ బోని పటు కృపాణ ముఱక నఱికి, నారసములు నాటించె నయ్యర్జు | నానుజన్ముమేన నల్ల నగుచు. |
234 |
| వ. | అప్పుడు ధృష్టద్యుమ్నుండు యుధామన్యుండును నుత్తమౌజుండును శిఖండియు జనమేజయుండును సాత్యకియు ద్రౌపదేయులును రౌద్రంబు శోభిల్ల రుద్రుల కైవడి వృషసేనుపయిం గవిసినఁ గృతవర్మ కృప ద్రౌణి దుర్యోధనులును శకునియుఁ దత్సోదరులు గొందఱును గ్రందం దఱిమి, దుర్వార విశిఖ వర్షంబుల వారలం గప్పినం గని, గజ సాధను లగు కుళిందు లురవణించి. | 235 |
| క. |
కృతవర్మ సిక్కువడ, భూ | పతి సేడ్పడ, శకుని వెగడుపడఁ దదవరజ ద్వితయము ధరఁ బడఁ, ద్రీవో | ద్దతిఁ బోరిరి చాప టంకృతంబులు సెలఁగన్. |
236 |
| వ. | ఇ త్తెఱంగునం బోరినం గనలి కడంగి, | 237 |
| క. |
ఆ మువ్వురుఁ జలమున ను | ద్దామ ద్విప సహిత చిత్ర దళనంబున సం గ్రామ తలము రక్తాక్తం | బై మెఱయ బలాధిపత్రయముఁ బొరిగొనినన్. |
238 |
| క. |
తక్కటి రథిక జనులు పే | రుక్కున నయ్యిభచయంబు నొదిఁగించియునుం జిక్కువఱిచియుం దునిమియు | నెక్కడు మద మొప్ప మెఱసి రిభపురనాథా! |
239 |
| వ. | మెఱసినం జూచి. | 240 |
| ఆ. |
అరద మెక్కి తఱిమె ననిల తనూజుఁ డ | వ్వీరుతోన పాండవేయ సేనఁ జేయఁ గలుగు దొరలు శితశరాసారంబు | లడర వారిమీఁద నడరుటయును. |
241 |
| వ. | రణంబు దారుణం బయ్యె; నందు. | 242 |
| సీ. |
కర్ణుని యగ్రభాగంబునఁ గరిఘటల్ | దునుమాడు నకులనందనునిఁ గిట్టి, వృషసేనుఁ డమ్ములవెల్లి పైఁ బరఁగించి | శితభల్లమున సూతుశిరము ద్రుంపఁ, గనుఁగొని యక్కర్ణతనయుని మీఁదఁ బా | ర్థాదులు గవిసిన; నతఁడు పార్థు ననిలజు మూఁడుమూఁ డమ్ముల నొప్పించి | యాశతానీకుని నట్ల చేసి, |
|
| తే. |
నకులు తనువున బాణసప్తకము సొనిపి. | శార్‌ఙఙఙఙ్గధరు మేనఁ బండ్రెండు సాయకములు వఱపి పేర్చినఁ, గౌరవప్రతతి మెచ్చి, | పార్థువేఁడిమి యూహించి భయముఁ బొందె. |
243 |
| చ. |
కెలఁకుల యోధులం గడచి, క్రీడి వడిన్ వృషసేనుమీఁద న మ్ములు నిగిడింప; నా రథిక ముఖ్యుని మూఁపున నక్కుమారుఁ డే పలరఁగ వాఁడి తూపులు రయంబు మెయిం బది బెట్టు గ్రుచ్చి, య గ్గలిక ముకుందు నేసె నవకాండములన్ దివి ముట్ట నార్చుచున్. |
244 |
| వ. | ఇట్లు విజృంభించిన. | 245 |