పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - తృతీయాశ్వాసము
అర్జునుఁడు వృషసేనుని మృతిఁ బొందించుట (సం. 8-62-59)
మ. భ్రుకుటిస్ఫూర్జిత ఫాలభాగుఁ డగుచుం బొంగారి, యాసూతపౌ
త్రకు కోదండము బాహుదండములుఁ జిత్రస్ఫూర్తిఁ దున్మాడి, మ
స్తక ముగ్రోద్ధతిఁ గ్రూరభల్ల విలస ద్ధారాహతిం ద్రుంచె, బా
ణకళాదుర్దముఁ డన్నరుండు పతియు న్రాధేయుఁడుం జూడఁగన్‌.
246
వ. ఇ వ్విధంబున వృషసేను సమయించుటం జూచి, కర్ణుండు శోకవ్యాకులచిత్తుండై కన్నీ రొలుకం, గోపాటోపంబున నుద్భటుం డగుచు, నమ్మహారథుని తేరికి సమ్ముఖంబుగాఁ దనయరదంబు వఱపించి, ‘యర్జున! యర్జున!’ యని యాహ్వానంబు సేసిన; నతండును సవిశేషోత్సాహంబునం బొదలి యడరె; నట్టియెడ దురంబు దక్కి యిరువాఁగునుం బరమ కౌతుకంబునం గనుంగొనుచుండ నయ్యిరువురు రామసన్నిభంబులు నాదిత్య సంకాశంబులుఁ ద్రినయన ప్రతిమంబులు నగు నాకారంబుల నుల్లసిల్లిరి; వారల యెక్కటి కయ్యం బాలోకించు కుతూహలంబున సుర పితృ విద్యాధర సంయమి సంఘంబులును శచీపతి ప్రజాపతి పశుపతులును లోనుగా ననేక దివ్యు లేతెంచి నభోభాగంబున నిలిచి; రప్పుడు బ్రహ్మ రుద్రున కిట్లనియె. 247
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )