| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘ఇరువురు నతిరథులు సమ | స్ఫురణులు విక్రాంతిపరులు శూరులు వీ రొం డొరువులతోఁ బెనఁగఁగ న | శ్వర మగు జగ; ముడుపరాదె సమరం బనఘా!’ |
248 |
| క. |
అన విని యా దేవుం డ | వ్వనజభవున కిట్టు లను: ‘నవార్యోద్ధతు లీ ఘనభుజులు వీరి రణ మె | ట్లును జెల్లుం, దప్ప; దప్పలుకు విడు మింకన్.’ |
249 |
| వ. | అని యి ట్లమ్మహాత్ములు సల్లాపంబులు సేయ, నాకర్ణించి పాకశాసనుండు సప్రణయంబుగా బ్రహ్మ కిట్లనియె. | 250 |
| చ. |
‘తపము నుదాత్తశౌర్యము నుదగ్రబలంబును గల్గు క్రీడి క య్యపు వెర వెక్కుడై, గెలుచునట్లుగ నీవు దలంపవే? పురా ణ పురుషు లైన కృష్ణుల రణంబున శాత్రవు లాక్రమించుటం గుపిత మనస్కు లైన నిలకున్ బ్రదు కెమ్మెయిఁ గల్గ నేర్చునే?’ |
251 |
| వ. | ‘నరనారాయణులకు నెందును జయంబు ధ్రువం బని తొల్లియుం జెప్పితి; రిమ్మహాత్ములు జయించుట లోకహితంబు; గర్ణుండు ద్రోణ భీష్మ ప్రాప్తంబైన పుణ్యలోకంబు వడయుఁ; గిరీటి చిరకాల బిడుమలం బడినవాఁడు గావున రాజ్య సుఖంబు లనుభవించుం గాక’ యనిన నప్పరమేష్ఠి ‘వీరల జయాపజయంబులు నిశ్చయించి పలుకనేల?’ యనుటయు, నీశానుం డతని నాలోకించి ‘నిశ్చయించుట మేల కాక యెగ్గేమి? నిశ్చయింత’ మని కలిపికొని యతండునుం దానును వాసవు వలను విలోకించి కృష్ణార్జునుల నుద్దేశించి. | 252 |
| తే. |
‘మహితమును లగు వీ రెందు మాఱు లేక | మెలఁగువా రయి కాదె! జన్మించినారు? వినుము! నీ చెప్పినట్టుల వీరి నొరు ల | ధఃకరించుట లోకహితంబు గాదు.’ |
253 |
| వ. | ‘వీరికి జయంబు ధ్రువం’బని పలికి, యంత నిలువక ‘వీరి జయంబు ధ్రువంబయ్యెడు’ మనవుడు, నయ్యమర విభుండు సుర ముని ప్రభృతులం గలయం గనుంగొని, ‘దేవదేవు లిరువురు నేకమతంబుగా నిశ్చయించిన లోకహితం బగు నానతి యాకర్ణించితిరే! మీ చిత్తంబు లిత్తెఱంగున కనుకూలంబులు గావలయు’ ననిన, నందఱు ‘నది యిట్టిద కాక యొం డగునే?’ యని; రనిమిషులు గుసుమ వర్షంబులు గురియించుచు దివ్య దుందుభి ధ్వానంబులు సెలంగించి; రయ్యవసరంబున నఖిల భూతంబులును విస్మయోత్ఫుల్ల నయనంబులగుచు నమ్మహా ద్వంద్వ యుద్ధంబు వీక్షించు వేడుక నొండు దలంపులు దక్కియుండె; నట్లు దార్కొనిన మహనీయ రథంబులు రెంటియందును సన్నాహసముజ్జ్వలులై యొప్పు వాసుదేవార్జునులును గర్ణశల్యులును దమ తమ శంఖంబు లొత్తి; రప్పుడు. | 254 |
| తే. |
రెండు సేనల శంఖభేరీ ముఖంబు | లైన బహుతూర్యముల పటుధ్వాన మడరి నింగి వొంగారె; నత్యంత నిశ్చలంబు | లయ్యె సైనిక నికరంబు లద్భుతముగ. |
255 |
| సీ. |
కపి కేతనము హస్తికక్ష్యయు నమ్మహా | బలు లిద్దఱును దపోబలము వలనఁ గన్నవియై, బుద్ధిగల్గి శోభిల్లు ను | ర్వీశ! యప్పుడు కపి యెరఁగి హస్తి కక్ష్యపై నడరినఁ గయ్య మారెంటికిఁ | గలిగె; నం దా హస్తికక్ష్య దెరలె నంబుజాక్షుండు మద్రాధినాథుండును | దృక్కలహంబునఁ దేజరిల్లి; |
|
| తే. |
రర్జునుండును గర్ణుండుఁ దర్జనంబు | లైన చూడ్కు లొండొరువుల యాననములఁ బఱపి రా కృష్ణపార్థుల బలుపు, శల్య | కర్ణ చిత్తదౌర్బల్యముల్ గానవచ్చె. |
256 |
| వ. | అట్టియెడ నా సూతనందనుండు మద్రపతి నాలోకించి. | 257 |
| తే. |
‘అర్జునుఁడు నన్ను నోర్చిన యట్టులైన | నెట్లు సెప్పుమ?’ యనుడు మద్రేశుఁ ‘డేను గృష్ణు లిద్దఱ నొక్కటఁ గిట్టి, తీవ్ర | బహుళ శరజాలముల పాలుపఱుతు’ ననియె. |
258 |
| ఆ. |
అట్ల సవ్యసాచి యడిగిన మురవైరి | నగుచు నినుఁడు గూలినను ధరిత్రి పఱియ లైన మేరు వొఱగినఁ గర్ణుచే | నీవు గోలుపోవు టేల కలుగు?’ |
259 |
| వ. | అని వెండియు. | 260 |
| ఉ. |
అట్టిద లోకపర్యవస మా దురవస్థకు స్రుక్క నేర్తునే? కిట్టుదుఁ గర్ణశల్యు లను కీటములం గరతాడనంబులం బెట్టుదు నేలఁ గౌరవులఁ బీనుఁగుపెంటలు గాఁగ, ధర్మజుం గట్టుదుఁ బట్ట మన్న నగి, గాండివి యద్దనుజారి కిట్లనున్. |
261 |
| ఉ. |
‘నవ్వుల కంటిఁ గాక, యది నాకు నశక్యమె కర్ణశల్యులం గ్రొవ్వడఁగించు టే ద్రుపదు కూఁతురు గొల్వునఁ బడ్డ పాటునన్ నెవ్వగఁ బొందుచున్ సమయనిష్ఠ నడంగితిఁ గాని, యింక నా మువ్వురుఁ బూని వచ్చినను ముట్టెదఁ గర్ణుని నేలఁ బెట్టెదన్. |
262 |
| మ. |
అరదంబున్ సిడమున్ హయవ్రజము శల్యాంగంబులుం జాపముం గరకాండంబులఁ బెక్కుభల్లముల నుగ్రస్ఫూర్తిఁ దున్మాడి, ని ష్ఠురభల్లం బొకటన్ సుయోధనుని చూడ్కుల్ నీఱుగా నిప్డ యు ద్ధుర గర్వోన్నతమైన కర్ణుతలఁ ద్రుంతుం జూడుమీ వేడుకన్. |
263 |
| ఆ. |
కర్ణ మద్రపతుల కాంతల విధవలఁ | జేయువాఁడ నీవు సెన్ను మిగిలి నగుచు, నేఁడు ద్రుపదనందన వీనుల | ధర్మసుతుని చెవులఁ దనుపు నినుపు. |
264 |
| క. |
సంతసపువార్త వుచ్చుము | కుంతికి నే దంతి దరువుఁ గూల్చినక్రియ దు ర్దాంతిగతిఁ గర్ణుఁ గూల్చుట | యంతయుఁ గన్నారఁ జూచి యచ్యుత! యెలమిన్.’ |
265 |
| వ. | అని పలికె; నా సమయంబున నుభయ సైన్యంబుల జనంబులకు నంబరంబున నున్న దివ్యసమూహంబులు నందు గీతనృత్తంబుల నుల్లసిల్లు నప్సరోగణంబులుం గాననైన నద్భుతంబున వారు ననిమిషులైయుండి, రప్పు డేకనిశ్చయు లగు కర్ణుండును దుర్యోధనుండును నచ్చెరువాటునం బొరయక, దురంబుమీఁది భరంబునం బొలిచి, రిరువాఁగు సైనికులు గిరీటికిఁ గర్ణునకు నభిముఖంబుగాఁ దల మిగులం దగదను బుద్ధిని భయంబునను దద్రథంబులు రెంటిని బలసి నిలిచి; రమ్మహావీరులు ధనుర్ద్యుతులను బాణ ప్రభలను దీవ్రతేజంబులను బ్రదీప్తులై కల్పాంత సూర్యుల చందంబగుచు నొండొరుల నోర్చు కడంకలఁ బేర్చి; రయ్యవసరంబున నశ్వత్థామ గురుపతిఁ జేరం జని కరంబు సేతం దెమల్చి సాంత్వన స్వరంబున నిట్లనియె: | 266 |