| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మహాప్రస్థానికపర్వము - ఏకాశ్వాసము |
| సీ. |
చనునప్పు డయ్యేడ్వురును నతిస్థిరయోగ | సాధనపరు లయి సత్వరముగఁ బోవంగఁ బాంచాల భూపపుత్రిక యోగ | మెడలిన మేదినిఁ బడియె నధిప! పడిన సమీరణుకొడుకు కనుంగొని యన్నతోఁ జెప్పి ‘యయ్యతివవలనఁ గాన మెన్నఁడు ధర్మహాని; యి ట్లగుటకు | నరయంగఁ గత మేమి?’ యని విషణ్ణుఁ |
|
| తే. |
డగుచు నడిగిన నాతఁ ‘డిమ్మగువ యింద్ర | తనయుదెసఁ బక్షపాతిని; దానఁ జేసి సుకృతములు ఫలియింపమిఁ జూవె దీని | కిట్టి దురవస్థ వాటిల్లె నీడ్యచరిత!’ |
034 |
| క. |
అని పలికి సమాధానము | దన బుద్ధిం దిరము చేసి ధైర్యస్థైర్యం బున వికృతి లేని గతి నా | వనితశవము విడిచి కౌరవవిభుం డేఁగెన్. |
035 |
| సీ. |
భూవర! యమ్మెయిఁ బోవంగ సహదేవుఁ | డపగతప్రాణుఁడై యవనిఁ బడిన గని వాయుజుఁడు ధర్మతనయున కెఱిఁగించి | యితఁ డనహంకారుఁ డెపుడు నీకు నతిభక్తి శుశ్రూష యాచరించుచునుండు | మాలోన నెల్ల సన్మార్గ వర్తి; యితనికి నేలొకో యిద్దెస వాటిల్లె?’ | ననిన నమ్మనుజేంద్రుఁ డతనితోడ |
|
| తే. |
‘వీఁడు దనకంటెఁ బ్రాజ్ఞుండు లేఁడు జగతి | నెందు నని సంతతమ్ముఁ దా నెడ్దఁ దలఁచు; దాన నిట్లయ్యె’ నం చుపేక్షానిరూఢ | బుద్ధి నరుగుచునుండె నప్పురుషవరుఁడు. |
036 |
| క. |
అనిలజుఁడు నరుఁడు నకులుఁడు | శునకంబునుఁ దోన నరుగ సుస్థిరమతి యై మనుజేంద్రవర్య! య ట్ల | జ్జనపతి సన నకులుతనువు జగతిం బడియెన్. |
037 |
| క. |
విను ద్రుపదనందనయుఁ దన | యనుజన్ముఁడు నంత నంత నవనిఁ బడుటఁ దాఁ గని ధృతిదూలినయట్లు వ | డిన నకులునిఁ జూచి యడలు డెందముతోడన్. |
038 |
| సీ. |
అనిలసూనుఁడు ధర్మతనయున కెఱిఁగించి | యవ్విభుతో ‘సుందరాకృతియును శౌర్యంబు ధైర్యంబు సౌజన్యమునకుఁగురు | సంఘమునన కాదు జగతి నెందు నితనికిఁ బోలె నహీనత మెఱయునే | యెవ్వరి కైనను నిట్టి పుణ్యుఁ గుత్సితదశ యె ట్లొకో పొందె నక్కట!’ | యనవుడు నక్కౌరవాగ్రగణ్యుఁ |
|
| తే. |
డతని కిట్లను ‘నీతండు నాత్మసదృశుఁ | డఖిల జగముల లేఁడు రూపాతిశయము తనక కల దని యెపుడుఁ జిత్తమునఁ దలఁచు; | నయ్యహంకృతి నిట్టి కీడయ్యెఁ జువ్వె!’ |
039 |
| క. |
అని ధృతిసారం బూఁది య | తని తనువు నుపేక్షఁ గూర్చి ధర్మతనూజుం డనఘ! చనుచుండెఁ దక్కటి | యనుజులుఁ గుర్కురముఁ దోన యరుగుచు నుండన్. |
040 |
| సీ. |
ద్రౌపదిపాటును దన యనుజన్ముల | పడుటయుఁ గనుఁగొని పార్థుఁ డాత్మ యలమట మునిఁగిన నిల విగతాసుఁడై | పడినఁ గుందుచుఁ జూచి బకవిరోధి యన్నకుఁ జూపి ‘యీ యమలచరిత్రుని | యం దెన్నఁడును నసత్యంబుఁ గాన; మిటు వడుటకుఁ గత మేమి?’ నావుడు నీతఁ | డక్కౌరవుల నెల్ల నొక్కనాఁడ |
|
| తే. |
యాహవంబునఁ దెగటార్తు ననియె; నట్లు | సేయఁ డయ్యెఁ; బల్కొక్కటి సేఁత యొకటి యగుట చాల దోషము; విను మదియుఁగాక | యెల్లకోదండ ధరుల గర్హించుచుండు. |
041 |
| ఉ. |
దానను దాన నిట్లగుట తప్పునె?’ యంచుఁ దదీయ మైన య మ్మానితదేహమున్ విడిచి మానవనాథుఁడు దాల్మిఁ జేసి బ ద్ధానిరతాత్ముఁ డై యరిగె; నత్తఱి వాయుజుఁ డార్తి నెంతయున్ దీనతఁ బొంది ధైర్యలత ద్రెవ్విన నేలకు వ్రాలె భూవరా! |
042 |
| క. |
అప్పుడు దగ నిట్లను నతఁ | డప్పౌరవవరున ‘కో ధరాధిప! కనుఁగొ మ్మిప్పా టేమిట వచ్చెం | జెప్పు; మెఱుఁగు దేనిఁ గరుణ చిగురొత్తంగన్.’ |
043 |
| చ. |
అన విని యాతఁ డిట్లనియె నాతనితో ‘భవదీయ మైన భో జన మతిమాత్ర ముద్ధతిఁ బ్రచండుఁడ వై భుజశక్తి నెవ్వరిం గొనక కడంగి రజ్జుపలుకుల్ గడుఁ బెక్కులు పల్కు దెప్డు నీ వనుపమశౌర్య! యిప్పడుట కత్తెఱఁగుల్ గత; మెల్లఁ జెప్పితిన్.’ |
044 |
| క. |
అని పలికి నిరీక్షింపక | చనుచుండె, నితండు ధైర్యసారోదారుం డును నిశ్చయమహితుఁడు నయి | వెనుక శునక మధికభక్తి విడువక చనఁగన్. |
045 |
| తే. |
ఆ సమంచిత సారమేయంబు పాండు | ధరణి నాయకు నగ్రిమతనయు పిఱుఁద నధికభక్తి యుక్తంబుగ నరుగుచునికి | పలుమఱును నీకుఁ జెప్పితిఁ దలఁచి యుండు.’ |
046 |
| వ. | అని పలికి వైశంపాయనుండు జనమేజయున కిట్లను నట్లు నిష్ఠాగరిష్ఠుం డయి యుధిష్ఠిరుం డరుగుచుండ. | 047 |