| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మహాప్రస్థానికపర్వము - ఏకాశ్వాసము |
| సీ. |
దివ్యదేహోద్ధత దీప్తి సంతానంబు | దిశలు పదింటను దీటుకొనఁగ, రథ సమాగమన సంరావంబు మేరుగ | హ్వరములఁ బ్రతిరవోత్కరము నీవ, నచ్చటి సిద్ధ సాధ్య మునీంద్ర గణముల | నానావిధస్తోత్ర నాద మెసఁగఁ, దత్ప్రదేశంబు బోధ స్ఫీత కల్పవృ | క్షంబులు పుష్పవర్షములు గురియ |
|
| తే. |
నింద్రుఁ డేతెంచి యాదర మెసక మెసఁగ | నక్కురుక్షితిపాలున కగ్రభాగ వర్తి యగుటయు నతఁ డభివందనంబు | సేసె సవినయభక్తివిశేష మొప్ప. |
048 |
| వ. | అట్లు ప్రణతుం డయిన నభినందించి యప్పురందరుం డతని దివ్య స్యందనం బెక్కుమని పలికిన, నతండు శోక సంతప్తుం డగుచు నతని కి ట్లనియె. | 049 |
| శా. |
‘తోడంబుట్టువు లందఱుం బడిన యా దుఃఖంబు చేతంబు సం పీడం బెట్టెడు; సౌకుమార్యవతి దప్పిం గూలెఁ బాంచాలి; వా ర్దోడై వచ్చిరి; వారు లేక యిట మీతో రాను; వా రెల్ల నా తోడం గూడఁగ వచ్చునట్లుగఁ గృపాధుర్యాత్మ! కావింపవే!’ |
050 |
| చ. |
అన విని యింద్రుఁ డి ట్లనియె నక్కురుభర్తకు ‘శోక మేల? నీ యనుజులు ద్రౌపదీసహితులై తనువుల్ దిగఁ ద్రావి చన్నవా రనఘ! యమర్త్య లోకమున; కక్కడఁ గాంచెదుగాక వారలం దనువు దొఱంగఁగా వలదు ధర్మమయాత్మక నీవు రావనా!’ |
051 |