పురాణేతిహాసములు శ్రీమహాభారతము మహాప్రస్థానికపర్వము - ఏకాశ్వాసము
ధర్మరాజ సురరాజులకుఁ గుర్కురవిషయముగా జరిగిన వివాదము (సం. 17-3-7)
సీ. అనుటయు ధర్మజుం డమరేంద్రుతో ‘నన్ను | నత్యంత దృఢభక్తి నాశ్రయించి
పుర మేను వెడలునప్పుడు మొదల్‌గాఁ దోన | చనుదెంచె నీ భవ్యసారమేయ
మిది యట రావలదే నా మనంబు ని | ష్ఠురవృత్తి కోర్వ దస్తోకపుణ్య
నిరతాత్మ!’ నావుడు దరహాస మొప్ప న | బ్బలవైరి’ యి ట్లంట పాడియే? య
 
తే. మర్త్వభావము కుక్క కేమాడ్కిఁగలుగు | ననఘ! నీ చింత తెఱఁ గశక్యంబు దీని
విడిచి చను టేల నిష్ఠురవృత్తి యయ్యె; | నిచటఁ దడయంగ నేటికి? నెక్కు రథము.’
052
వ. అనిన నమ్మనుజేంద్రుం డింద్రునితోడ ‘నకార్యంబును దుష్కరంబును నగుకార్యం బేనియు నార్యుండును బ్రభుండును నైన నీయట్టి సత్పురుషుండు సంశ్రితులకై సంఘటింపవలదె? భక్త పరిత్యాగంబు సేసి పడయుసిరి నాకు నెంత యింపయ్యెడు?’ ననుటయు నయ్యనిమిషనాథుండు. 053
చ. ‘అలుక హరించు ధర్మముల; నట్లగుటం గురువంశవర్య! నీ
వలుగక విన్ము కుక్కలకు నావసథంబు త్రివిష్టపంబునం
గలుగునె? నీకు నిష్ఠురత గల్గదు దీనిఁ బరిత్యజించినం
జలము కొనంగ నేల? శుభ సంగమనం బెడసేఁత కృత్యమే?’
054
సీ. అనవుడు ధర్మనందనుఁ డమ్మహాత్ముతో | విను భక్తియుక్తుని విడుపు బ్రహ్మ
హత్యఁ బోలెడి పాప మని చెప్పుదురు పెద్ద; | లట్లు గావున దీని నఖిలధర్మ
సారజ్ఞ! విడుచుట చనదు; దివ్యసుఖంబు | నకుఁ గాఁగఁ బాపంబునకుఁ జొరంగఁ
జాల’ నావుడును వాసవుఁడు వ్రతస్థుండు | కుక్కనంటిన వాని కోరి చేయు
 
తే. సుకృతమునకు నాశం బగు సువ్రతాత్మ! యింత యొప్పని నిర్బంధ మేల చెపుమ!
విడువు మీ శునకము; దీని విడువఁబడుట | నాకలోక సౌఖ్యంబు నొనర్చు నీకు.
055
చ. జనులు నుతింపఁగా సుకృత సంపదఁ జేసి యమర్త్య భావముం
గనియును జెంద కి ట్లునికి కార్యమె? ద్రౌపది భీమసేను న
ర్జునుఁ గవలం ద్యజించుటకు సువ్రత! చాలితి చాలవయ్యె దీ
శునకము విడ్వ; నిత్తెఱఁగు సూరినుతుం డగు నీకు నర్హమే?’
056
సీ. అన విని ధర్మజుం ‘డఖిలలోకములకుఁ | బతివి, ధర్మమునకుఁ బ్రభువ విట్టి
నీకంటె నెఱుఁగుదునే సదసత్ప్రకా | రము లట్లుఁగాక వాదము మహాత్ము
లయిన వారలతోడ నగునె చేయంగ? నై | నను విన్నవింపఁదగిన తెఱంగు
విన్నవించుట దోష విధము గా దనియెడు | బుద్ధిఁ జేసెద నేను బూని విన్న
 
తే. పంబు భీమముఖ్యులును ద్రౌపదియుఁ జచ్చి; | రేను వారల విడువక యేడ్చుచున్న
వత్తురే? తోడ వచ్చి చావని శునకము | విడువకుండుట తప్పుగా నుడువఁ దగునె?
057
చ. అనఘచరిత్ర! విన్ము శరణాగతుఁ జేకొన కున్కి శుద్ధమి
త్రునియెడఁ జేయు ద్రోహము. వధూటి వధించుట, విప్రునర్థముం
గొనుట యనంగఁ గల్గునివి గూడ సమం బగు నాకుఁ జూడ భ
క్తు ననపరాధునిన్‌ విడుచుదోషముతో నిది యోర్వవచ్చునే?
058
ఉ. కావున నాకలోకపు సుఖం బటు లుండఁగ నిమ్ము దేవ! నీ
భావము నిల్పు నాదెసఁ గృపాభరితంబుగ; సారమేయ సం
భావన సేఁత దోసముగఁ బట్టమి నాకు వరంబు; నీవు పొ;
మ్మీ వనభూమి నుండెద సమిద్ధతపంబుల నిన్న కొల్చుచున్‌.’
059
వ. అని పుయిలోడక పలికెఁ; బౌరవోత్తమా! యాకర్ణింపుము. 060
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )