పురాణేతిహాసములు శ్రీమహాభారతము మహాప్రస్థానికపర్వము - ఏకాశ్వాసము
సారమేయరూపంబున వచ్చిన ధర్ముండు ధర్మరాజునకుఁ బ్రత్యక్షం బగుట (సం. 17-3-16)
సీ. అ ట్లతిదృఢ నిశ్చయంబుగఁ బలికిన | తనపుత్త్రుఁ గనుఁగొని ధర్ముఁ డధిక
సంప్రమోదముఁ బొంది సారమేయాకృతిఁ | బాసి తా నాత్మరూపంబుఁ దాల్చి
పరమ సంభ్రమ కృత ప్రణతియు నానంద | భరితుండు నగు నా నృపాలుతోడ
‘నీపుణ్యవృత్తంబు నిర్మలమేధయు | నఖిల భూతంబులయందుఁ గలుగు
 
తే. దయయు నాదుచిత్తముఁ బ్రమదమునఁ దేల్చె | వత్స! భూలోకమున నిట్టివారుఁ గలరె?
తొల్లియును ద్వైతవనమున దోషదూర | మయిన నీ మనమున తెఱం గరసినాఁడ.
061
క. విను నీరు రోసి నీదగు | ననుజులు మృతులయిన వచ్చి యందఱలో నొ
క్కనిఁ గోరుము బ్రదికించెద | నని పలికితి నేను నిర్మలాత్మక! నీతోన్‌.
062
ఉ. దానికి నీవు చిత్తమునఁ దల్లుల నిద్దఱనుం దలంచి మా
లోన నొకండఁ గల్గితి నలుప్తత వారలయందుఁ గల్మి లో
కానుమతంబుగాదె నకులార్థిత ధర్మువు నాకు నన్మతిన్‌
వీనుల కింపుగా నకులు వేఁడితి; తద్విధ మెందుఁ గల్గునే?
063
క. భీముని నర్జును విడిచియు | నీ మది నకులు బ్రదికింప నిగుడుట పుత్త్రా!
నా మనమునఁ బాయదు ని | న్నేమనవచ్చు నఖిలంబు నింద్రుండెఱుఁగున్‌.
064
క. విను భక్తియుక్త మిది యని | శునకముఁ జేపట్టి నీవు సురపతి కొనివ
చ్చిన యరద మెక్క నొల్లవ | యనఘా! సరి నీకు దివమునందును గలరే?
065
ఉ. ఇంతటి పెంపు గల్గుట మహేంద్రుఁడు నీ దెసఁ గాంచె; నీవు ని
శ్చింతత మేనితోఁ జనుము సిద్ధపథంబునఁ బుణ్యలోకముల్‌
వింతలు గాక యుండఁ బృథివీవర! నీకు నుదార సౌఖ్య మ
త్యంతము నవ్యయంబు నగు నందలి మాన్యులు సంస్తుతింపఁగన్‌.’
066
సీ. అనియె నప్పుడు పరమాహ్లాదమునఁ జను | దెంచి గంధర్వులు దేవమునులు
మరుదశ్వివసువులు మహితాదరంబున | ధర్ముండు నింద్రుండుఁ దారు నమ్మ
హాత్ముని నెత్తి రథారూఢుఁగాఁ జేసి | తమవిమానములు పార్శ్వముల నడపి
కొని చన నిఖిలదిక్కులఁ దనతేజంబు | వెలుఁగంగ సిద్ధులు వినుతి సేయ
 
తే. దైవతావాసమునకు నా ధర్మజుండు | చనియె; నయ్యవసరమున సర్వలోక
సమ్మతుఁడు బోధఘనుఁడు ప్రసన్నఫణితి | సారతోదారుఁడును నగునారదుండు.
067
వ. ఎల్లవారును విన సంపూర్ణస్వరంబున నిట్లనియె: 068
ఉ. ‘దానములం దపంబులను దద్దయుఁ బే ర్గలయట్టివారలన్‌
మానవనాథులన్‌ వినమె! మాసెఁ దదీయ యశంబు లెల్ల నీ
మానిత కీర్తిదీప్తులు సమస్తజగంబులయందుఁ బర్వుట
న్మేనులతోడ వా రిటులు నేర్చిరె రా నమరత్వసిద్ధికిన్‌.’
069
చ. అన విని ధర్మరాజసుతుఁ డాతని కిట్లను ‘నాదుతమ్ములం
గనుఁగొను నంతకున్‌ సుఖముగాఁ గొన నయ్యెద; నిత్తెఱంగు నా
కు నకట చూపరే పవనుకొడ్కును నింద్రసుతుండు మాద్రినం
దనులును నున్న చోటు సుఖదం బయినన్‌ సుఖహీనమేనియున్‌.
070
వ. వారలను మదీయపక్షప్రాప్తు లయిన భూపతులను జూచు వేడ్క యెల్లలోకంబుల మీఁదను గలుగు వేడుక కంటెనుమిగిలియున్నయది యనుటయు నమరేంద్రుండు తన మనంబున నితనితోడ సముచిత భాషణంబులు చేసెద; నివ్విధంబు కటుక వచనత్వంబు గా దని యూహించి యి ట్లనియె. 071
చ. ‘తనువు దొఱంగ కిట్లు సుకృతంబుల పెంపున వచ్చి తిప్పదం
బునకు మహాత్మ! యిచ్చటను బోవదు నీమదిఁ బాసి మర్త్యతం
బనుపడియున్న నెయ్యము సభాసదులన్‌ శుభదృష్టిఁ జూడుమా
మునులను సిద్ధులం; దగునె ముందటి చందము నొంది యుండఁగన్‌?
072
చ. ఒరులకు నందరానిపద మూర్జిత పుణ్యనిరూఢిఁ బొందఁగా
దొరకొని యున్కి నీ వికృత దూరమనస్కతఁ గాదె! నీ సహో
దరులు భవన్మహోన్నత పదస్థితి కర్హులె తొంటి నెయ్యమున్‌
బొరయునె దేవతాత్మకులబుద్ధి నెఱుంగుము నీ విశేషమున్‌.’
073
క. అని యిట్లాడిన సర్వభు | వనపతియు బుధుండు నైన వాసవుతోఁ దా
ననియెం దగ వెండియు ధ | ర్మనందనుఁడు భరతవంశ మహిమాధాయీ!
074
ఉ. ‘మీ రిటు లేమి సెప్పిన నమేయభుజాబలభగ్నదైత్య! యే
గారవ మొప్పఁ దమ్ములను గాంతను బుత్త్రుల మిత్ర కోటిఁ గ
న్నారఁగఁ జూడ కుండుటకు నక్కట యోర్తునె? యెల్లభోగముల్‌
వారలఁ జూచి క్రమ్మఱఁగ వచ్చి సుఖస్థితిమై భుజించెదన్‌.
075
వ. నాకత్తెఱంగు పరమానందకరం’ బనియె నని యిట్లు మునీంద్రమాననీయం బయిన పాండవేయ మహాప్రస్థానప్రకారంబు జనమేజయునకు వైశంపాయనుండు సెప్పుటయు. 076
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )