| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
జనపతులు రాజసూయం | బొనరించిన వారు శక్రునొద్దను సురపూ జన లొందుచుండుదురు కో | రిన కోర్కులు వడయుచును హరిశ్చంద్రుక్రియన్. |
88 |
| చ. |
గొనకొని మర్త్యలోకమునకుం జని సన్మునినాథ! యిందు నా యునికిని రాజసూయమఖ మున్నతిఁ జేసిన ధన్యు లింద్రునం దునికియు నా తనూజున కనూనయశోనిధి యైన ధర్మనం దనునకుఁ జెప్పి వాని నుచితస్థితిఁ బన్పుఁడు దానిఁ జేయఁగన్. |
89 |
| చ. |
అనుపమశక్తిమంతులు మదాత్మజు లేవురు దేవతావరం బున నుదయించి యున్న కృతపుణ్యులు; వారలలోన నగ్రజుం డనఘుఁడు రాజసూయము మహామతిఁ జేయఁగ నోపు శత్రుసూ దనుఁ డయి సార్వభౌముఁ డయి తమ్ముల బాహుబలంబు పెంపునన్. |
90 |
| వ. |
అట్లేని నాకు నస్మత్పితృ పితామహ నివహంబుతోడ నాకాధిపలోక సుఖావాప్తి యగు ననిన నప్పాండురాజు వచనంబు నీ కెఱింగించు వేడుక నిట వచ్చితి. |
91 |
| క. |
న్యాయమున రాజసూయము | సేయుము; నీ పితృగణంబుఁ జెచ్చెర నధిక శ్రీయుత సురగణపూజ్యులఁ | జేయుము; శక్రుసభ నుండఁ జేయుము వారిన్. |
92 |
| వ. | ‘దిగ్విజయోపార్జితంబులయిన ధనంబుల బ్రాహ్మణసంతర్పణంబును ధర్మమార్గంబునం జాతుర్వర్ణాశ్రమ రక్షణంబునుం జేసి సామ్రాజ్యంబు పూజ్యంబై యొప్పం బ్రకాశింపుము; మఱి రాజసూయంబు బహు విఘ్నంబు, బ్రహ్మరాక్షసులు దానిరంధ్రంబ రోయుచుండుదు; రదియును నిర్విఘ్నంబున సమాప్తం బయ్యెనేని నిఖిల ప్రజాప్రళయ కారణంబయిన రణంబగు’నని చెప్పి నారదుం డరిగినఁ దమ్ములంజూచి ధర్మతనయుండు ధౌమ్య ద్వైపాయన సుహృద్బాంధవ మంత్రి సమక్షంబున ని ట్లనియె. | 93 |