| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
పితృసంకల్పము సేయఁగ | సుతుల కవశ్యమును వలయు; సుతజన్మఫలం బతిముదమునఁ బితృవరులకు | హిత మొనరించుటయ కాదె యెంతయు భక్తిన్. |
94 |
| క. |
‘పరలోకనిలయు లగు మీ | గురులకు దీనన హితం బగున్ లోకభయం కరసంగరమును గాలాం | తరమున నగు’ నని విరించితనయుఁడు సెప్పెన్. |
95 |
| క. |
పితృగణహితార్థముగ స | త్క్రతు వొనరింపంగ బుద్ధిగలదు, ప్రజా సం హృతి తత్క్రతువున నగు నని | మతి నాశంకయును గలదు మానుగ నాకున్. |
96 |
| వ. | ఏమి సేయుదు నని డోలాయమాన మానసుం డయి యున్న ధర్మరాజునకు ధౌమ్యప్రభృతు లి ట్లనిరి. | 97 |
| ఉ. |
చేయుము రాజసూయ మెడసేయక; దానన చేసి దోషముల్ వాయు నిలేశ! భూప్రజకుఁ; బార్థివులెల్ల భవత్ప్రతాపని ర్జేయులు; సర్వసంపదలు చేకొనఁగాఁ దఱియయ్యెఁ గౌరవా మ్నాయలలామ! నీ కెనయె మానవనాథులు మానుషంబునన్. |
98 |
| వ. | అనిన వారల వచనంబుల కనుగుణంబుగా ననుజానుమతుండయి ధర్మరాజు రాజసూయంబు సేయ సమకట్టి, ‘దీని నిర్విఘ్నంబున నిర్వహించుట కనాదినిధనుం డాదిపురుషుండు పురుషోత్తముండు పుండరీకాక్షుం డజుం డయ్యును జగద్ధితార్థంబుగా మర్త్యంబున జనియించిన యమ్మహాత్ముండు వాసుదేవుండ యోపుంగాని యన్యుల కశక్యం’ బని యప్పుడ యాప్తచరులం బిలువంబనిచి. | 99 |
| క. |
అనిలజవాశ్వంబులఁ బూ | నిన యరదం బెక్కి ధారుణీధరు మధుసూ దను దోడ్తెం డని ముదమునఁ | బనిచి తదాగమనకాంక్షఁ బార్థివుఁ డుండెన్. |
100 |